Baby safe home: పిల్లలు పాకడం మొదలెట్టేశారా? ఏ దెబ్బా తగలకుండా ఇంటిని ఇలా రెడీ చేయండి-gadgets that are useful for children safety at home ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Baby Safe Home: పిల్లలు పాకడం మొదలెట్టేశారా? ఏ దెబ్బా తగలకుండా ఇంటిని ఇలా రెడీ చేయండి

Baby safe home: పిల్లలు పాకడం మొదలెట్టేశారా? ఏ దెబ్బా తగలకుండా ఇంటిని ఇలా రెడీ చేయండి

Koutik Pranaya Sree HT Telugu
Jul 03, 2024 06:15 PM IST

Baby safe home: పిల్లలు పాకడం మొదలు పెట్టారంటే ఇంట్లో ఏ వస్తువు ముట్టుకుంటారో అనే భయం మొదలైపోతుంది. వాళ్లకు దెబ్బలు తగలకుండా చాలా జాగ్రత్త పడతాం. ఈ విషయంలో మీకు సహాయపడే గ్యాడ్జెట్లు ఉన్నాయి. అవేంటో చూడండి.

పిల్లల భద్రత పెంచే గ్యాడ్జెట్లు
పిల్లల భద్రత పెంచే గ్యాడ్జెట్లు

పిల్లలు పాకడం మొదలు పెట్టగానే చాలా విషయాల్లో జాగ్రత్త పడాలి. ఇంట్లో కూడా కొన్ని మార్పు చేర్పులు చేయాలి. పిల్లలకు పదునైన వస్తువులు కుచ్చుకోకుండా, దెబ్బలు తగలకుండా చూసుకోవాలి. ఎంత చూసుకున్నా కొన్ని సార్లు పిల్లలు వాటి దగ్గరికి వెళ్లే ప్రమాదం ఉంటుంది కాబట్టి కొన్ని గ్యాడ్జెట్లు మీ పనిని సులభతరం చేస్తాయి. అవేంటో చూసేయండి.

1. డమ్మీ సాకెట్లు (Dummy Sockets):

కరెంట్‌కు పిల్లల్ని దూరంగా ఉంచాల్సిందే. అయినా సాకెట్లలో మనం చూడనప్పుడు వాళ్లు వేళ్లు పెట్టే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఫ్లూర్‌కి కాస్త తక్కువ ఎత్తులో ఉండే సాకెట్ల విషయంలో జాగ్రత్త అవసరం. అందుకే ఈ డమ్మీ సాకెట్లు ఉపయోగపడతాయి. సాకెట్లలో వీటిని ప్లగ్ లాగానే పెట్టేస్తే రంధ్రాలు మూసుకుపోతాయి. అవసరమైనప్పుడు వీటిని తీసి సాకెట్ వాడుకోవాలి.

2. బెడ్ రెయిలింగ్ (Bed Railing):

బెడ్ మీద పడుకోబెట్టి పనులు చేసుకుంటాం. నిద్రపోయారని అలాగే వదిలేస్తే ఉన్నట్టుండి కింద పడిపోతారు కూడా. ముఖ్యంగా పాకే పిల్లలతో మరీ ఇబ్బంది. అలాంటప్పుడు బెడ్ చుట్టూ రెయిలింగ్ ఏర్పాటు చేసుకోవాలి. చెప్పాలంటే బెడ్ చుట్టూ ఒక ప్రహరీ కట్టినట్లుంటుందిది. ఎంత ప్రయత్నించినా పిల్లలు బయటకు రాలేదు. మీరూ ఏ భయం లేకుండా మీ పనులు చేసుకోవచ్చు.

3. ఎడ్జ్ ప్రొటెక్టర్ (Edge Protector):

డైనింగ్ టేబుళ్లు, టీ టేబుళ్లు, ఫర్నీచర్, ర్యాకులకు పదునైన అంచులుంటాయి. అది పిల్లలకు తగిలితే ప్రమాదమే. అందుకే అంచుల వెంబడి మెత్తగా ఉండే ఎడ్జ్ ప్రొటెక్టర్ అంటించేయాలి. ఇది మీటర్ల లెక్కన దొరుకుతుంది. మెత్తగా ఉంటుంది. మీ అవసరాన్ని బట్టి దీన్ని అంటించుకోవచ్చు. సులువుగా తీసేయొచ్చు కూడా.

4. కార్నర్ ప్రొటెక్టర్ ( Corner protector):

అంచులు పదునుగా లేకుండా కేవలం మూలల దగ్గర పదునుగా ఉంటే ఈ కార్నర్ ప్రొటెక్టర్ వాడొచ్చు. ఎడ్జ్ ప్రొటెక్టర్ మీటర్ల లెక్కన దొరికితే ఇవేమో పది,పన్నెండు.. అలా మీ అవసరానికి తగ్గట్లు తీసుకోవచ్చు. కేవలం మూలలకు వీటిని తొడిగితే సరిపోతుంది. పిల్లలకు కుచ్చుకుంటాయనే భయం అక్కర్లేదు.

5. సేఫ్టీ లాక్స్:

ఫ్రిడ్జ్ తలుపులు, కబోర్డ్ తలుపులు, క్యాబినేట్ డ్రాలు పిల్లలు ఊరికే లాగేస్తారు. అందులో ఉన్న వస్తువుల్ని బయట పడేసి చిందరవందర చేస్తుంటారు. అందుకే ఈ సేఫ్టీ లాక్స్ ఉపయోగపడతాయి. డ్రా తలుపుకు, కబోర్డ్ బయట వైపుకు వీటి రెండు అంచులు అమర్చి, వాటిలో లాక్ లాగా వేసేయాలి. పిల్లలు వాటిని తీయడం కష్టమే.

6. డూర్ స్లామ్ స్టాపర్:

తలుపుల మధ్య చేతులు పెట్టి ఇరికించుకోవడం, తలుపులను వేగంగా కొట్టేసి దెబ్బలు తగిలించుకోవడం పిల్లలు ఎక్కువగా చేస్తారు. ఈ ఇబ్బంది లేకుండా తలుపుకు మధ్య భాగంలో డూర్ స్లామ్ స్టాపర్ పెట్టాలి. ఇది తలుపు బలంగా వెళ్లి మూసుకోకుండా చూస్తుంది. దాంతో దెబ్బలు తగలవు.

7. బేబీ సేఫ్టీ గేట్:

అపార్ట్‌మెంట్లలో ఉండేవాళ్లు, పై ఫ్లూర్లలో ఉండేవాళ్లు.. పిల్లలు మెట్లు దిగి కిందికి, పైకి వెళ్లిపోకుండా వీటిని వాడొచ్చు. ఈ బేబీ సేఫ్టీ గేట్ ఏర్పాటు చేసుకోవడం చాలా సులువు. ఒకవైపు రాడ్ లాంటిది ఫిక్స్ చేసి మరో వైపు లాక్ వేసి అడ్డు తెర లాగా వేసేయొచ్చు. అవసరం లేనప్పుడు తీసేయొచ్చు.

WhatsApp channel