Yoga For a Rainy Day। మాన్‌సూన్‌లో ఇంట్లోనే ఉంటూ ఈ యోగాసనాలు వేయండి!
Yoga For a Rainy Day: ఈ మాన్‌సూన్ సీజన్‌లో మీలో ప్రతి ఒక్కరూ తప్పకుండా సాధన చేయాల్సిన కొన్ని యోగాసనాలు ఏమున్నాయో ఇక్కడ తెలుసుకోండి.
Yoga For a Rainy Day: ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. ఇందుకోసం జిమ్‌కు వెళ్లాల్సిన పనిలేదు రోజూ వాకింగ్, జాగింగ్, రన్నింగ్ వంటి చేయడం వలన కూడా మీకు అనేక ప్రయోజనాలు లభిస్తాయి. అయితే ఈ వర్షాకాలంలో బయటకు వెళ్లి వ్యాయామం చేయాలంటే అన్నిసార్లు సాధ్యపడకపోవచ్చు. బయట బాగా వర్షం పడుతున్నప్పుడు జిమ్‌కు కూడా వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. అలాంటపుడు మిమ్మల్ని మీరు ఫిట్‌గా ఉంచుకోవడానికి ఇంట్లోనే వ్యాయామం చేయవచ్చు. ముఖ్యంగా యోగా చేయడం చాలా అనుకూలంగా ఉంటుంది. వర్షాకాలంలో యోగా చేయడం చాలా మంచి అభ్యాసం. యోగాభ్యాసాలు మీ శరీరానికి పలు విధాలుగా రక్షణ కవచాలుగా ఉంటాయి. కొన్ని యోగాసనాలు మీ రోగనిరోధక శక్తిని మెరుగుపరిచి, మీ ఆరోగ్యాన్ని పెంపొందించగలవు, మిమ్మల్ని అనేక వ్యాధుల నుంచి రక్షించగలవు కూడా.
ఈ మాన్‌సూన్ సీజన్‌లో మీలో ప్రతి ఒక్కరూ తప్పకుండా సాధన చేయాల్సిన కొన్ని యోగాసనాలు ఏమున్నాయో ఇక్కడ తెలుసుకోండి.
అధో ముఖ స్వనాసనం
అధో ముఖ స్వనాసనం (Downward Dog Pose) శరీరాన్ని శక్తివంతం చేయడంలో, పునరుజ్జీవింపజేయడంలో సహాయపడుతుంది. ఇది వెన్నెముకను సాగదీస్తుంది, ఛాతి కండరాలను బలోపేతం చేస్తుంది, తద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇంకా చేతులు, భుజాలు, కాళ్ళు , పాదాలకు బలాన్ని తెస్తుంది. మెదడుకు రక్త ప్రసరణను పెంచడంలో కూడా ఈ భంగిమ గొప్పగా ఉంటుంది.
సేతు బంధాసనం
దీనిని బ్రిడ్జ్ పోస్ (Bridge Pose) అని కూడా అంటారు. పేరుకు తగినట్లుగా ఈ ఆసనంలో వీపును వంచి వంతెన వంటి ఆకారాన్ని ఏర్పరచడం ద్వారా సాధన చేస్తారు. సేతు బంధాసనం వెన్ను కండరాలును బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. తద్వారా వెన్నునొప్పిని నివారిస్తుంది. ఇంకా మూత్రపిండాల పనితీరును పెంచుతుంది, నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది, శరీరంలో రక్తపోటును నియంత్రిస్తుంది. మీ ఊపిరితిత్తులను విస్తరించి వాటి సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
నౌకాసనం
నౌకాసనం (Boat Pose) ప్రధానంగా ఉదర కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా ఈ అసనం సాధన చేయడం ద్వారా పెరిగిన పొట్టను ప్రభావవంతంగా కరిగిస్తుంది. ఈ ఆసనంతో మానసిక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది, మనస్సును ఏ చింత లేకుండా ఉంచుతుంది.
భుజంగాసనం
భుజంగాసనం (Cobra Pose) ఉదర కొవ్వును కరిగించడానికి ఉత్తమమైనది ఈ ఆసనం సాధన చేయడం ద్వారా ఉదర కండరాలు మంచి ఆకృతిలోకి వస్తాయి, ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే వెన్నును బలపరుస్తుంది, వెన్నెముక ఫ్లెక్సిబిలిటీని మెరుగుపరుస్తుంది. ఒత్తిడి, అలసట నుంచి ఉపశమనం అందించడంలో గొప్ప పాత్ర పోషిస్తుంది. వర్షాకాలంలో బద్దకం పోవడానికి ఈ ఆసనం వేయాలి.
ప్రాణాయామం
ప్రాణాయామం (Pranayama) నిజంగా మీ ప్రాణాన్ని పొడగించే ఒక గొప్ప వ్యాయామం. ఇది శ్వాసక్రియతో ముడిపడి ఉన్న వ్యాయామం. ఇందులో కపాలభాతి ప్రాణాయామం అనేది ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో పాత్ర పోషిస్తుంది. మెరుగైన ఆక్సిజన్ రవాణాకు తోడ్పడుతుంది. ముఖ్యంగా ఈ ఆసనం మీ శరీరంలోని అంతర్గత అవయవాలకు మంచి చికిత్సను అందిస్తుంది. శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో, జీవక్రియ రేటును పెంచటంలోనూ సహాయపడుతుంది. అధిక బరువును సమర్థవంతంగా నియంత్రిస్తుంది. ప్రాణాయామంలోని కొన్ని పద్ధతులు ఆందోళనలను, అలసటను తొలగించి మీ మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.
సంబంధిత కథనం