Friday Motivation: నిజమైన ప్రేమలో షరతులు ఉండవు, స్వార్థం ఉండదు, మరి మీది ఏ రకం ప్రేమ?-friday motivation true love has no conditions no selfishness and what kind of love is yours ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Friday Motivation: నిజమైన ప్రేమలో షరతులు ఉండవు, స్వార్థం ఉండదు, మరి మీది ఏ రకం ప్రేమ?

Friday Motivation: నిజమైన ప్రేమలో షరతులు ఉండవు, స్వార్థం ఉండదు, మరి మీది ఏ రకం ప్రేమ?

Haritha Chappa HT Telugu
Feb 02, 2024 05:00 AM IST

Friday Motivation: ప్రేమే ప్రపంచాన్ని నడిపిస్తుంది. మనసులో ప్రేమ నిండిన వ్యక్తి అందరికన్నా అదృష్టవంతుడు, ఆనంద జీవి. ప్రేమించామని చెప్పుకోవడం కాదు ప్రేమించిన వ్యక్తికి షరతులు లేని జీవితాన్ని, నిస్వార్థమైన మనసును అంకితం చేయాలి.

నిస్వార్థంగా ప్రేమించడం ఎలా?
నిస్వార్థంగా ప్రేమించడం ఎలా? (pixabay)

Friday Motivation: నిజమైన ప్రేమ... దీన్ని సరిగ్గా నిర్వచించడం కష్టమే. కానీ ఎదుటివారిది నిజమైన ప్రేమ కాదు, వారి ప్రవర్తనను బట్టి అంచనా వేయొచ్చు. నిజమైన ప్రేమలో స్వచ్ఛత ఉంటుంది. అమాయకమైన బంధం ఉంటుంది. భావోద్వేగాలు మిళితమై ఉంటాయి. ప్రతికూల భావనలు, మాటలు తక్కువగా వినిపిస్తాయి. వారిద్దరి మధ్య బంధం ఆప్యాయతతో నిండిపోతుంది. వారి ఆత్మ, మనస్సు, శరీరం ...అన్నీ నిస్వార్ధంగానే ఉంటాయి. అదే నిజమైన ప్రేమ. భాగస్వామితో కల్లాకపటం లేకుండా, కల్మషం లేకుండా జీవించడమే నిజమైన ప్రేమ.

ఇప్పుడు ప్రపంచంలో బతకడం కాస్త కష్టమే. మిగతా మనుషులతో ఎలా ఉన్నా... మీరు ప్రేమించిన వ్యక్తితో మాత్రం ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా స్వార్థపూరితంగానే ప్రవర్తించాలి. వారికి నిజమే చెప్పాలి. అవసరమైతే వారి కోసం త్యాగం చేయడానికి సిద్ధపడాలి. వారి సంతోషం కోసం మీరు నిజాయితీగానే ఉండాలి. అదే అసలైన ప్రేమ.

కొందరు ప్రేమిస్తారు. ఎదుటి వ్యక్తులు తాము ఆశించినట్లుగా, తమకు నచ్చినట్టు ప్రవర్తించాలని కోరుకుంటారు. తమకు నచ్చినట్టు వారు ఉండాలని వారి నుంచి ఆశిస్తారు. కొన్ని షరతులు కూడా పెడతారు. షరతులు పెట్టిన ప్రేమ... నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమకు ఎలాంటి అంచనాలు, ఆశించడాలు, షరతులు ఉండవు. కేవలం ఎదుటివారిని ప్రేమించడం పైనే వారి దృష్టి ఉంటుంది.

ప్రేమలో అసూయకు చోటు ఉండకూడదు. వారి స్వేచ్ఛను మీరు హరించకూడదు. ఎగురుతున్న వారి రెక్కలకు మీరు గాలిగా మారాలి, కానీ వెనక్కి పట్టి లాగే తాడులా మారకూడదు. వారు మీ చెప్పు చేతల్లోనే ఉండాలి అనుకోవడం ఎప్పటికీ ప్రేమ కాదు. నిజంగా ప్రేమించిన వారు తమ భాగస్వామిని ఎప్పుడూ బాధపెట్టాలని కోరుకోరు. వారిని కన్నీరు పెట్టే పరిస్థితికి తీసుకెళ్లరు. వారి ఆలోచనలకు, ఆశయాలకు, గౌరవాన్ని ఇస్తారు. రిలేషన్ షిప్‌లో ఉన్న వారంతా కూడా నిజమైన ప్రేమలో ఉన్నట్టు కాదు. ఒకసారి పైన చెప్పిన లక్షణాలను మీ ప్రేమలో మీలో ఉన్నాయో లేవో తరచి చూసుకోండి, లేకపోతే మీకు నిజమైన ప్రేమే కాదని అర్థం చేసుకోండి. వీలైతే షరతులు లేకుండా, నిస్వార్ధంగా ప్రేమించడానికి ప్రయత్నించండి.

Whats_app_banner