Friday Motivation : ప్రేమ గొప్పదే.. కానీ జీవితం అంతకంటే గొప్పది.. ప్రేమలో విఫలమైతేనే నువ్వేంటో తెలుస్తుంది-friday motivation love is great but life is greater than that find your self after breakup ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Friday Motivation : ప్రేమ గొప్పదే.. కానీ జీవితం అంతకంటే గొప్పది.. ప్రేమలో విఫలమైతేనే నువ్వేంటో తెలుస్తుంది

Friday Motivation : ప్రేమ గొప్పదే.. కానీ జీవితం అంతకంటే గొప్పది.. ప్రేమలో విఫలమైతేనే నువ్వేంటో తెలుస్తుంది

Anand Sai HT Telugu
Apr 12, 2024 05:00 AM IST

Friday Motivation : ప్రేమ గొప్పదా.. జీవితం గొప్పదా.. అంటే.. జీవితమే గొప్పది. ప్రేమ అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే. అదే జీవితం కాదు.

ప్రేమలో విఫలమైతే బాధపడొద్దు
ప్రేమలో విఫలమైతే బాధపడొద్దు (Unsplash)

మన చుట్టూ లవ్ ఫెయిల్ అయిన వాళ్లు చాలా మందే కనిపిస్తారు. కొందరు జీవితాన్ని సరిగా నిర్మించుకుంటే.. మరికొందరు కూల్చేసుకుంటారు. ఎటు వైపు వెళితే మీ దారి సరిగా ఉంటుందో మీరే నిర్ణయించుకోవాలి. అప్పుడే మీ లైఫ్ బాగుంటుంది. ప్రేమ గొప్పదే.. కానీ జీవితం అనేది అంతకంటే గొప్పది. అస్సలు లైట్ తీసుకోవద్దు.

విడిపోయిన వ్యక్తికి దేని గురించి చింతించవద్దని సులభంగా సలహా ఇవ్వవచ్చు. అయితే ఆ బాధ నుంచి బయటపడటం ఆ వ్యక్తికి కొంచెం కష్టమే. అకస్మాత్తుగా ఆ వ్యక్తి జీవితం పూర్తిగా మారిపోతుంది. మనతో ఈరోజు ఉన్న వ్యక్తి రేపటి నుంచి కనిపించదు.. మాట్లాడదు అంటే చాలా బాధతో ఉంటాం. కానీ మనల్ని చిన్నప్పటి నుంచి పెంచిన అమ్మానాన్న, మనతో ఆడుకున్న అక్కాచెల్లి, అన్నదమ్ముల గురించి కూడా ఆలోచించాలి. ఒక మనిషి దూరమవుతున్నారు అంటే.. ఇంకా అద్భుతమైన వ్యక్తి మన జీవితంలోకి వస్తున్నారని అర్థం.

ఒక వ్యక్తిని ప్రేమించి, ఆ వ్యక్తితో చివరి వరకు జీవించాలని కోరుకుంటారు. ఆఖరికి ఇద్దరూ విడిపోతే తప్పుడు వ్యక్తిని ప్రేమించానన్న బాధ కలుగుతుంది. ఇలాంటి కొన్ని ఘటనలు చాలా బాధాకరమైనవి. మీ ప్రియమైన వారు ఈ రకమైన బాధలో ఉంటే, మీరు ఆ బాధ నుండి వారికి సహాయం చేయాలి. విడిపోయిన వ్యక్తులు గతాన్ని మరచిపోయి భవిష్యత్తు గురించి ఆలోచించాలి. కానీ పాత జ్ఞాపకాలు వస్తూనే ఉంటాయి. దాని నుండి బయటపడటానికి స్నేహితులకు కాల్ చేయండి. మీ విడిపోవడం గురించి వారికి చెప్పండి. ప్రేమ విఫలం నుంచి అధిగమించడానికి వారు ఇచ్చే సలహాలు కూడా సహాయపడతాయి.

మీ మాజీ ప్రేమికుడు మీకు ఇచ్చిన వస్తువులను ఉంచుకోవద్దు. వాటిని చూస్తుంటే పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. సెల్‌లోని వారి నంబర్‌ను తొలగించండి. ఎవరైనా మీ మాజీ గురించి ఏదైనా చెప్పాలని ఆలోచిస్తే, దాని గురించి వినడానికి మీకు ఆసక్తి లేదని నేరుగా చెప్పండి. అయితే మీ బాధను చెప్పుకుని.. ఒక్కసారి గట్టిగా ఏడవండి.

మీ లక్ష్యం ఏమిటనే దానిపై దృష్టి పెట్టండి. అబ్బాయిలకు ఒక అలవాటు ఉంటుంది. విడిపోతారు కానీ తాగుడులో పడతారు. అలాంటి వారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. నిన్ను విడిచిపెట్టిన ఆమె సంతోషంగా ఉంటుంది. మీరు మీ జీవితాన్ని మాత్రమే నాశనం చేసుకుంటున్నారు. అమ్మాయిలు కూడా నన్ను మోసం చేశాడు అని ఏడ్చే బదులు నీ లక్ష్యం మీద దృష్టి పెట్టు. మీతో జీవించడానికి తగినవాడు కాదని ఆలోచించండి.

నిన్ను వదిలేసిన వాడు బాగా ఉన్నప్పుడు నువ్ కూడా అదే చేయాలిగా. వాళ్ళు నువ్ ప్రేమించినంతగా ప్రేమిస్తే, నిన్ను అర్థం చేసుకునే సత్తా వాళ్ళకు ఉంటే నీ ప్రేమ విడిపోయేది కాదు కదా? విడిపోవడం గురించి మీరు ఎందుకు ఆందోళన చెందుతున్నారు?

అసలు విడిపోయేదైతే ప్రేమే కాదు. ఆకర్శణ అని మీకు మీరు సర్దిచెప్పుకోండి. జీవితంలో ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మన గురించి క్షణం కూడా ఆలోచించని వారి కోసం గంటల తరబడి ఆలోచించడం వృథా. ఆ విషయం మీకు అర్థమైతే.. మరుక్షణం నుంచి ఆలోచించడం మానేయండి.

ఈ ప్రపంచం ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది.. మనుషుల ప్రవర్తన మారేకొద్దీ మీకు కొత్తగా కనిపిస్తుంది. అందుకే ముందు మనుషులను చదవడం అలవాటు చేసుకోండి. ఎందుకుంటే వారి మాయలో కాలాన్ని కరిగిస్తే.. మళ్లీ తిరిగి రాదు.

ప్రేమలో విఫలమైతేనే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. వాళ్ల మీద కసితో ఏదైనా సాధించాలనే తపన పెంచుకోవాలి. వారి గురించి ఆలోచించి సమయాన్ని వృథా చేసుకోకూడదు. ప్రేమలో విఫలమైనవారే.. జీవితంలో సక్సెస్ అయినవారు చాలా మంది ఉన్నారు. మీరు కూడా అలానే అవ్వాలి.

WhatsApp channel