WednesDay Motivation: నిజమైన ప్రేమికులు ఎప్పటికీ విడిపోరు, ఒకవేళ విడిపోతే వారిది ప్రేమే కాదు
WednesDay Motivation: ప్రేమంటే ఒక్కొక్కరూ ఒక్కో నిర్వచనం చెబుతారు. ఏదైనా ప్రేమ అనే ఫీలింగే వేరు. ప్రేమిస్తే ఖచ్చితంగా గెలిపించుకోండి. పెళ్లి దాకా నడిపించుకోండి. అప్పుడే మీది నిజమైన ప్రేమ అవుతుంది.
WednesDay Motivation: ప్రేమ పుడితే గాలిలో తేలిపోయినట్టు ఉంటుంది. అది ఒక అనిర్వచనీయమైన భావన. మాటల్లో చెప్పలేని అనుభూతి. గుండెల్లో మోసే తీయని భారం. దీనికి చివరి మజిలీ పెళ్లి. కానీ పెళ్లి వరకు చేరుతున్న ప్రేమలు ఎన్ని? నిజంగా ప్రేమిస్తే ఆ ప్రేమను పెద్దల అనుమతితో పెళ్లి దాకా చేర్చండి. అప్పుడే మీది నిజమైన ప్రేమ, లేకుంటే మీది కేవలం ఆకర్షణ మధ్య పుట్టినా ఒక ఫీలింగ్ మాత్రమే.
ప్రేమ ఎప్పుడైనా పుట్టచ్చు
ప్రేమ ఎవరి మీద అయినా, ఎప్పుడైనా పుట్టవచ్చు. కొంతమంది అందం చూసి ఇష్టపడతారు. మరికొందరు గుణానికి పడిపోతారు. ఇంకొందరు వారిలో ఉన్న లాలిత్యానికి ఆకర్షితులవుతారు. ఏదైనా ప్రేమలో పడితే ఆ వ్యక్తి తీరే మారిపోతుంది. మరింత సంతోషంగా ఉంటారు. వారి వ్యక్తిత్వంలో కూడా ఎంతో అందం కనిపిస్తుంది.
ప్రేమలో పడినప్పుడు మెదడులో ఎంతో అల్లకల్లోలంగా ఉంటుంది. అదేదో మానసిక వ్యాధి లాగా అనిపిస్తుంది. గుండె వేగంగా కొట్టుకోవడం, చేతులు చెమలు పట్టడం, బుగ్గలు ఎరుపెట్టడం ఇవన్నీ కూడా ప్రేమలో పడ్డారు అనడానికి గుర్తులే.
ప్రేమ హార్మోన్లు
ప్రేమలో పడటానికి ముఖ్యంగా కారణమయ్యేది మూడు హార్మోన్లు. ఏ మనిషిని చూస్తే మీకు ఈ హార్మోన్లు అధికంగా ఉత్పత్తి అవుతాయో... ఆ మనిషితోనే మీరు ప్రేమలో పడతారు. ఆ మూడు హార్లోన్లు... డోపమైన్, సెరటోనిన్, నోరెపైన్‌ఫ్రీన్. మూడు హార్మోన్లు కలిసి ఒక మనిషిని ప్రేమలో పడేలా చేస్తాయి.
ఇందులో ముఖ్యమైనది సెరటోనిన్. అది ప్రేమలో పడిన తర్వాత ఎదుటి మనిషి పట్ల పిచ్చెక్కించేలా చేస్తుంది. వారితో ఉండాలనిపించేలా ఫీలింగ్ కలిగిస్తుంది. ఇక డోపమైన్ ఒక మనిషి నచ్చితే వారికే అంకితమైపోయేలా చేస్తుంది. ఇక మూడోది నోరోపైన్‌ఫ్రీన్. ఇది ఇష్టమైన వ్యక్తిని చూడగానే గుండె వేగంగా కొట్టుకునేలా చేస్తుంది. గుండెల్లో ఏదో అనుభూతి కలిగిస్తుంది. ఈ మూడు హార్మోన్లు కలిసి మనల్ని ప్రేమలో పడేస్తాయి.
ప్రేమ విఫలమైతే ఈ మూడు హార్మోన్ల పైన తీవ్ర ప్రభావం పడుతుంది. ఇవి ఎక్కువగా ఉత్పత్తి కావడం, తక్కువగా ఉత్పత్తి కావడం వంటివి జరుగుతాయి. దీనివల్ల మానసికంగా కుంగుబాటు కలగడం వంటివి జరుగుతాయి. మీ ప్రేమను గెలిపించుకోవాలంటే మీరు ఎన్నో త్యాగాలు చేయాల్సి రావచ్చు. అన్నిటికీ సిద్ధపడండి. ప్రేమిస్తే సరిపోదు. ప్రేమను గెలిపించుకోవడానికి సత్తా కూడా మీకు ఉండాలి.
ప్రేమ అంటే కేవలం ఇవ్వడం మాత్రమే కాదు ఎదుటివారి నుంచి అంతే ప్రేమను పొందాలి. మీ అవసరాల కోసమో, ఆర్థిక లాభాల కోసం ఎవరిని ప్రేమించకండి. మీ జీవితం కోసం నిజాయితీగా ప్రేమించండి. ఆ ప్రేమను గెలిపించుకోండి. నిజాయితీ గల ప్రేమ గెలిస్తే రెండు జీవితాలు, రెండు కుటుంబాలు గెలిచినట్టే.
ప్రేమ ఒక అందమైన స్పందన, సంతోషం, ఆరాధన. మనసుకి మాత్రమే తెలిసే ఒక అంతులేని ఆనందం. ప్రేమించే మనుషులు తప్పుగా ఉండొచ్చు . ప్రేమ మాత్రం ఎప్పుడూ తప్పు కాదు. ఆ ప్రేమని గెలిపించుకున్న రోజే మీరు గెలిచినట్టు.
నిజమైన ప్రేమ ఎదుట మనిషిలో లోపాలున్న, దోషాలు ఉన్నా సహిస్తుంది, భరిస్తుంది. మంచి మనసుతో ఆదరించి ప్రేమిస్తుంది. ఎంతో ప్రేమను పంచుతుంది. మీ ప్రేమ అలాంటి కోవలోకి వస్తుందో రాదు ఒకసారి సరి చూసుకోండి.