Chanakya Niti Telugu : 100 ఏళ్లు ఆరోగ్యంగా జీవించేందుకు ఈ చిట్కాలు పాటించండి-follow these tips to 100 years live long according to chanakya niti ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chanakya Niti Telugu : 100 ఏళ్లు ఆరోగ్యంగా జీవించేందుకు ఈ చిట్కాలు పాటించండి

Chanakya Niti Telugu : 100 ఏళ్లు ఆరోగ్యంగా జీవించేందుకు ఈ చిట్కాలు పాటించండి

Anand Sai HT Telugu
Feb 03, 2024 08:00 AM IST

Chanakya Niti On Healthy Life : చాణక్య నీతి ప్రకారం ఎక్కువకాలం జీవించేందుకు మన అలవాట్లే కారణం. నూరేళ్లు ఆరోగ్యంగా జీవించేందుకు చాణక్యుడు కొన్ని చిట్కాలు చెప్పాడు.

చాణక్య నీతి
చాణక్య నీతి

మనుషుల ప్రయోజనం కోసం చాణక్యుడు చాలా విషయాలు చెప్పాడు. చాణక్య నీతిలో పేర్కొన్న సూత్రాలను అనుసరించడం ద్వారా జీవితంలో విజయం సాధించవచ్చు. చాణక్యుడు తన చాణక్య నీతిలో ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని నిర్దిష్ట విషయాలను కూడా పేర్కొన్నాడు. మనిషికి ఆరోగ్యమే గొప్ప సంపద అని మనకు తెలుసు. ఆరోగ్యంగా ఉంటే జీవితంలో అన్ని విజయాలు సాధించొచ్చు. మన ఆరోగ్యాన్ని మనం ఎల్లప్పుడూ సీరియస్‌గా తీసుకోవాలి.

ఆరోగ్యం కోసం చిట్కాలు పాటించాలి

ప్రస్తుతం అనేక వ్యాధులు ప్రబలుతున్నాయి. మానవులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆచార్య చాణక్యుడు చెప్పిన కొన్ని విషయాలను గుర్తుంచుకుంటే కచ్చితంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. చాణక్యుడు చెప్పిన విషయాలు ఇప్పటికీ పాటిస్తూ ఉంటారు. జీవితం, సమాజం గురించి చాణక్యుడు గొప్ప గొప్ప విషయాలు పేర్కొన్నాడు. వాటిని పాటిస్తూ ఉంటే మీరు జీవితంలో ఇబ్బందులు లేకుండా బతకొచ్చు. విజయం సాధించొచ్చు. మనిషి చాలా ఏళ్లపాటు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకోండి.

సరిగా నీరు తాగడం చాలా మంచిది

కొందరికి ఆహారం సరిగా జీర్ణం కాదు. దీనిద్వారా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. దీనికి ప్రధాన కారమం నీరు తాగకపోవడమే. ఆహారం జీర్ణం కానప్పుడు నీరు తాగడం ఔషధం లాంటిది. ఆహారం తిన్న అరగంట తర్వాత నీరు తాగడం శరీరానికి మంచిదని భావిస్తారు. భోజనాల మధ్య చాలా తక్కువ నీరు తాగడం అమృతం లాంటిదని చాణక్య నీతి పేర్కొంది. తిన్న వెంటనే నీళ్లు తాగడం విషం లాంటిది. భోజనం చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి. ఇది మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

పొడి ఆహారం వద్దు

పొడి ఆహారం ఎక్కువగా తీసుకోవద్దు. దీనిద్వారా జీర్ణ సమస్యలు వస్తాయి. ఆహారం డ్రైగా ఉంటే ఏదైనా రసంలాంటిది కలుపుకోవాలి. అప్పుడే సులువుగా జీర్ణమవుతుంది. పొడి గింజల కంటే పాలు 10 రెట్లు ఎక్కువ ప్రయోజనకరమైనవి. మాంసం పాలు కంటే 10 రెట్లు ఎక్కువ పోషకమైనది. మాంసం కంటే నెయ్యి 10 రెట్లు ఎక్కువ పోషకమైనది అని చాణక్యుడు చెప్పాడు. ఇవన్నీ మీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అందుకే వాటిని ఫాలో కావాలని చాణక్యుడు చెప్పాడు.

ఆ రెండు అవయవాలు చాలా ముఖ్యం

అన్ని ఆనందాలలో ఆహారం గొప్ప ఆనందం. తినడం గొప్ప సంతోషం. శరీరంలోని అన్ని ఇంద్రియాలలో కళ్ళు చాలా ముఖ్యమైనవి. అన్ని అవయవాలలో మెదడు చాలా ముఖ్యమైనదని చాణక్యుడు కూడా చెప్పాడు. వాటిని సరిగా చూసుకోవాలి. సరైన విశ్రాంతి ఉండాలి. కళ్లు, మెదడు ఆరోగ్యం కోసం మంచి ఆహారపు అలవాట్లు పాటించాలి. అప్పుడే ఆరోగ్యంగా బతుకుతారని చాణక్య నీతి చెబుతుంది.

వారానికోసారి మసాజ్

చాణక్య నీతి ప్రకారం మంచి ఆరోగ్యం, ఆరోగ్యకరమైన శరీరం కోసం వారానికి ఒకసారి పూర్తి శరీర మసాజ్ చేయాలి. ఇది రంధ్రాలను తెరుస్తుంది, లోపల ఉన్న మురికిని బయటకు పంపుతుంది. మసాజ్ చేసిన తర్వాత స్నానం చేయండి. ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యం మెరుగవుతుందని చాణక్యుడు చెప్పాడు.

తృణధాన్యాలు తినండి

ఆరోగ్యంగా ఉండాలంటే తృణధాన్యాలు తినాలని చాణక్య నీతి పేర్కొంది. ధాన్యాలు తినడం వల్ల మనిషి శక్తివంతంగా తయారవడంతో పాటు జీర్ణవ్యవస్థ కూడా బలపడుతుంది. బలమైన జీర్ణవ్యవస్థ ఉన్న వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడని చాణక్యుడు చెప్పాడు. చాణక్యుడు చెప్పిన విషయాలు పాటిస్తే జీవితంలో ఆనందంగా ఉండొచ్చు. అప్పుడే వందేళ్లు హాయిగా జీవించొచ్చు.

Whats_app_banner