DIY Egg-based Hair Masks। నల్లగా నిగనిగలాడే సిల్కీ హెయిర్ కావాలా? అయితే ఈ హెయిర్ మాస్క్‌లు ట్రై చేయండి!
DIY Egg-based Hair Masks: నల్లని నిగనిగలాడే వెంట్రుకలు పొందటానికి గుడ్డు ఆధారిత హెయిర్ మాస్క్ లు వర్తించండి. వీటిని మీకు మీరుగా ఇంట్లోనే చేసుకోవచ్చు.
పొడవైన, అందమైన, ఆరోగ్యకరమైన జుట్టును ఎవరు కోరుకోరు? కానీ కాలుష్యం, వాతావరణ మార్పులు, అనారోగ్యకరమైన జీవనశైలి జుట్టు నాణ్యతను ప్రభావితం చేస్తాయి. జుట్టు సంరక్షణకు అనేక పద్ధతులు ఉన్నప్పటికీ, గుడ్లు అత్యంత ప్రభావవంతమైన పోషణ అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. జుట్టు రాలడం లేదా పొడిబారడం, జుట్టు పెరుగుదల మొదలైన సమస్యలకు తలకు గుడ్డును ఉపయోగించడం ద్వారా పరిష్కారం పొందవచ్చు. ఎందుకంటే గుడ్లలో ప్రొటీన్లు, మినరల్స్, బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి, ఈ పోషకాలన్నీ జుట్టు సంరక్షణలోనూ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
గుడ్డులో ఉండే ప్రోటీన్, బయోటిన్ జుట్టు పెరుగుదలకు మంచి పోషక పదార్థంగా చెప్పవచ్చు. జుట్టు రాలడం గురించి చింతించే వారు, గుడ్డును తలకు మాస్క్ లాగా ఉపయోగించాలి. ఇది జుట్టు రాలడాన్ని నిరోధిస్తుంది, కొత్త జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది. నిర్జీవమైన , చీలిపోయిన చివర్లను నివారించడంలో సహాయపడుతుంది. గుడ్డులోని పోషకాలు జుట్టును హైడ్రేట్ చేయడమే కాకుండా దెబ్బతిన్న కెరాటిన్ ఖాళీలను పూరిస్తుంది. గుడ్డులో ఉండే ప్రోటీన్ కంటెంట్ జుట్టును స్మూత్‌గా, మెరిసేలా చేస్తుంది. అలాగే జుట్టు ఆకృతిని మెరుగుపరుస్తుంది.
DIY Egg-based Hair Masks - జుట్టు సంరక్షణకు గుడ్డు ఆధారిత హెయిర్ మాస్క్‌లు
జుట్టు సంరక్షణకు ఉపయోగపడే గుడ్డు ఆధారిత హెయిర్ మాస్క్ లను ఇక్కడ తెలియజేస్తున్నాం, వీటిని మీ తలకు ఎలా అప్లై చేయాలో సూచిస్తున్నాం, మీరూ ప్రయత్నించవచ్చు.
ఎగ్- ఆల్మండ్- కొకనట్ మాస్క్
బాదం నూనె, కొబ్బరి నూనె రెండూ పొడి జుట్టును తిరిగి తేమగా మార్చే గుణాలను కలిగి ఉంటాయి, గుడ్డులోని ప్రోటీన్ మీ ట్రెస్‌లకు బలాన్ని అందిస్తుంది. ఒక గిన్నెలో 4 నుండి 5 టీస్పూన్ల బాదం నూనె, 3 నుండి 4 టేబుల్ స్పూన్ల గుడ్డులోని తెల్లసొన, అలాగే 1 నుండి 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె కలపండి. ఈ మాస్క్‌ను మీ జుట్టుపై సున్నితంగా వర్తించండి. ఆపై చల్లిటి నీరు షాంపూతో శుభ్రపరుచుకోవాలి.
ఎగ్- అలోవెరా - ఆలివ్ ఆయిల్ మాస్క్
గుడ్లు, కలబంద మిశ్రమం మీ జుట్టును బలోపేతం చేసే ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఆలివ్ ఆయిల్ డల్ హెయిర్‌లో తిరిగి జీవం నింపుతుంది. ఈ మాస్క్‌ని ఉపయోగిస్తే మీ జుట్టుకు నిగనిగలాడటమే కాకుండా మందపాటి ఆకృతిని ఇస్తుంది. ఒక గిన్నెలో, 2 నుండి 3 టేబుల్ స్పూన్ల గుడ్డు పచ్చసొనను 4 నుండి 5 టేబుల్ స్పూన్ల కలబందతో కలపండి. ఆపై1 టేబుల్ స్పూన్ ఆలివ్ నూనెను 10 సెకన్ల పాటు వేడి చేసి కలపండి. ఈ మాస్కును మీ జుట్టుకు వర్తించండి, మూలాలకు తగిలేలా ప్రత్యేక శ్రద్ధ ఇవ్వాలని గుర్తుంచుకోండి. 30 నిమిషాల పాటు అలాగే ఉంచి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఎగ్- ఆలివ్ ఆయిల్ మాస్క్
ఒక గుడ్డు, ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ నూనెను మిక్స్ చేసి, గుడ్డు మాస్క్ తయారు చేయండి. దీనిని మీ జుట్టుకు అప్లై చేసి 20 నిమిషాల పాటు ఉంచుకోండి. ఆ తర్వాత మీ జుట్టును చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఈ మాస్క్ స్కాల్ప్ ఆయిల్‌ను బ్యాలెన్స్ చేసి జుట్టును పొడవుగా, మెరిసేలా, బలంగా చేస్తుంది.
ఎగ్- బనానా హెయిర్ మాస్క్
అరటిపండును బాగా మెత్తగా చేసి అందులో ఒక గుడ్డు, ఒక చెంచా ఆలివ్ ఆయిల్ వేయాలి. ఈ ప్యాక్‌ను మీ జుట్టుకు, తలపై అప్లై చేసి సుమారు 15 నిమిషాల పాటు ఉంచండి. ఆ తర్వాత చల్లటి నీటితో మీ జుట్టును సున్నితంగా కడగాలి. ఇలా చేయడం వల్ల మీ జుట్టుకు బి విటమిన్లు, పొటాషియం అందుతాయి. ఈ మాస్క్ పొడి జుట్టుకు పోషణ అందించి పునరుజ్జీవం కల్పిస్తుంది.
ఎగ్- ఆనియన్ హెయిర్ మాస్క్
రెండు గుడ్లు, ఒక టేబుల్ స్పూన్ ఉల్లిపాయ రసంను కలపండి. ఈ మాస్క్ ను జుట్టుకు అప్లై చేయండి. 30 నిమిషాలు అలాగే ఉంచి చల్లటి నీటితో కడిగేయండి. ఈ చికిత్స కొత్త జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది.