Friday Motivation: మీ జీవితంలో వచ్చిన మార్పును స్వీకరించండి, మూర్ఖంగా ఎదురెళ్లి ప్రతిఘటించకండి
Friday Motivation: కొంతమంది జీవితంలో వచ్చిన మార్పులను స్వీకరించలేరు. ఆ మార్పులను అంగీకరించలేక తమలో తామే బాధపడతారు. మూర్ఖంగా ప్రతిఘటిస్తారు. దీనివల్ల వచ్చే ఉపయోగం ఏమీ లేదు.
ఒక గంభీరమైన పర్వతం ఎత్తుగా, గర్వంగా నిలబడి ఉంది. దాని పక్కనే ప్రశాంతంగా ఓ నది పారుతోంది. ఆ పర్వతం తనకు ఎంతో బలం ఉందని, శాశ్వతంగా తాను నిలిచి ఉంటానని ఎప్పుడూ ప్రగల్భాలు పలుకుతూ ఉంటుంది. నదిని తక్కువ చేసి చులకనగా చూస్తుంది. నది కంటే తానే గొప్పదాన్ని చెబుతూ ఉంటుంది. నది మాత్రం ఆ మాటలను వింటూ ప్రశాంతంగా, రమణీయంగా ప్రవహిస్తుంది. తనలో వచ్చిన ఏ మార్పునైనా అది స్వీకరిస్తుంది.
ఒకసారి నదికి వరదలు వస్తాయి. ఆ వరదలను కూడా తట్టుకుని నది అలా ప్రవహిస్తూనే ఉంటుంది. ఇంకోసారి ఎండలకు నదిలో నీళ్లు ఇంకిపోతాయి. అయినా కూడా నది గంభీరంగా అలా ప్రవహిస్తూనే ఉంది. తనలో ఏ మార్పు వచ్చినా నది కుంగిపోలేదు. స్థిరంగా గంభీరంగా అలా నిలుచునే ఉంది. ఓసారి పెద్ద తుఫాను వచ్చింది.
ఆ తుఫాను దాటికి నదిలో నీరు ఎక్కువగా చేరిపోయాయి. నది అంతకంతకు పెరిగిపోయింది. దాని ఒడ్డు పర్వతాన్ని ముంచెత్తేలా మారింది. పర్వతం నదిలోని నీటి శక్తిని చూసి భయపడి పోయింది. తన మూలాలు కదిలిపోకుండా ఉండాలని ఆ నీటితో ప్రతిఘటించడం మొదలుపెట్టింది. అయినా నదిలోని నీటి శక్తి ముందు పర్వతం నిలబడలేకపోయింది. పర్వతాన్ని మూలాల నుంచి ధ్వంసం చేసింది ఆ నది. పర్వతం మీద నుంచి కొండ చరియలు ముక్కలు ముక్కలుగా విరిగిపడ్డాయి. నది ఇంత శక్తివంతమైనదైనా ఇన్నాళ్ళు ప్రశాంతంగా ఎలా జీవించిందో అర్థం కాలేదు పర్వతానికి. మూర్ఖంగా తాను ప్రగల్బాలు పలికానని భావించింది.
నది ప్రకృతిలో వచ్చిన ప్రతి మార్పును స్వీకరించింది. తనను తాను మార్చుకుంది. అందుకే వరదలు వచ్చినా, నీళ్లు ఎండిపోయినా నది స్థానం మారలేదు. కానీ పర్వతం మాత్రం ప్రకృతిలో వచ్చిన మార్పులను స్వీకరించలేకపోయింది. తన స్థానంలో మాత్రమే తాను ఉండాలని భావించింది. కానీ ఆ స్థానం శాశ్వతం కాదని ప్రకృతిలో వచ్చిన మార్పులకు తగ్గట్టు మారిపోవాలని తర్వాత తెలుసుకుంది. కానీ పర్వతానికి మారే అవకాశం లేదు. నది ప్రకృతికి తగ్గట్టు మారగలదు. అందుకే ఎక్కువకాలం జీవించింది.
మనుషులు కూడా అంతే పర్వతంలా ఒకే చోట నిల్చుంటామంటే కుదరదు. నదిలాగా పరిస్థితులకు తగ్గట్టు మారిపోతూ ఉండాలి. ఎలాంటి మార్పులు జీవితంలో వచ్చినా స్వీకరించి దానికి తగ్గట్టు జీవించడం నేర్చుకోవాలి. అప్పుడే ఆ వ్యక్తి కలకాలం సంతోషంగా జీవించగలడు. జీవితంలో వచ్చిన చిన్న మార్పును కూడా తీసుకోలేకపోతే అక్కడే అతని జీవితం ఆగిపోతుంది.