Bathukamma 2024: బతుకమ్మ సంబరాలకు వేళాయేరా- ప్రకృతితో మమేకం చేసే అనుబంధాల పండుగ-telangana famous festival bathuamma starts from october 2nd ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Bathukamma 2024: బతుకమ్మ సంబరాలకు వేళాయేరా- ప్రకృతితో మమేకం చేసే అనుబంధాల పండుగ

Bathukamma 2024: బతుకమ్మ సంబరాలకు వేళాయేరా- ప్రకృతితో మమేకం చేసే అనుబంధాల పండుగ

Gunti Soundarya HT Telugu
Oct 01, 2024 11:00 AM IST

Bathukamma 2024: కుటుంబ సభ్యులందరిని ఒక దగ్గరకు చేర్చి ప్రకృతితో మమేకమయ్యేలా చేసే పండుగ బతుకమ్మ. అనుబంధాలను కలుపుతూ సంప్రదాయాలను నేర్పించే పండుగ ఇది. రేపటి నుంచి అంటే అక్టోబర్ 2 నుంచి బతుకమ్మ పండుగ సంబరాలు మొదలు కాబోతున్నాయి.

బతుకమ్మ సంబరాలు
బతుకమ్మ సంబరాలు

Bathukamma 2024: వినాయక చవితితో అబ్బాయిల పండుగ సంబరాలు అయిపోయాయి. ఇప్పుడు ఆడబిడ్డల వేడుక మొదలు కాబోతుంది. అక్టోబర్ 2వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు ప్రారంభం అవుతాయి. తొమ్మిది రోజుల పాటు ఆడపచులు, అమ్మలక్కలు అందరూ అందంగా ముస్తాబై ఒక చోటుకు చేరి బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. దుర్గాష్టమితో బతుకమ్మ ముగుస్తుంది.

గ్రామీణ ప్రాంతాల్లో పొలాల గట్ల వెంబడి దొరికే గడ్డి పూల దగ్గర నుంచి బంతి, చామంతి, గులాబీ పూల వరకు అన్నింటినీ బతుకమ్మలో పేర్చుకుంటారు. ఈ తొమ్మిది రోజులు పూల పండుగ చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు. పెళ్ళయిన ఆడపిల్లలు తమ పుట్టింటికి వచ్చి బతుకమ్మ సంబరాలు చేసుకుంటారు. తంగేడు, గునుగు, చామంతి, బంతి, సీత జడ, గుమ్మడి పువ్వులతో పాటు అనేక రంగు రంగుల పూలు ఇందులో ఉపయోగిస్తారు.

ఆరోగ్యాన్ని ఇస్తుంది

వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు పడి చేరువులన్నీ నీటితో నిండి జలకళను సంతరించుకుంటాయి. అలాగే ఇదే సమయంలో అనారోగ్యాలు, ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వ్యాప్తి చెందే సమయం. ఇటువంటి కాలంలో జరుపుకునే ఈ పూల పండుగ వల్ల నీరు శుభ్రం అవుతుంది. ఎటువంటి ఇన్ఫెక్షన్స్ సోకకుండా ప్రజలకు రక్షణగా నిలుస్తుంది. బతుకమ్మ పేర్చిన తర్వాత పసుపుతో చేసిన గౌరీ దేవిని ఉంచుతారు. వాటన్నింటిని కలిపి చెరువులో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ పండుగలో ఉపయోగించే పూలల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బయాటిక్ లక్షణాలు ఉంటాయి. వాటితో పాటు పసుపు కూడా నీటిలో చేరి వాటిని శుభ్రం చేస్తుంది.

అనుబంధాల పండుగ

పండుగ పుణ్యమా అంటూ ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ సొంత ఊర్లకు చేరుకుంటారు. నేటి బిజీ లైఫ్ లో అందరూ ఉద్యోగాల పేరిట వేర్వేరు ప్రదేశాలలో స్థిరపడిపోయారు. బతుకమ్మ కోసం అందరూ ఆనందంగా సొంత ఇంటికి, సొంత ఊరికి చేరుకుంటారు. ఒక్క చోటుకు చేరి బతుకమ్మ వేడుకను జరుపుకుంటారు. అందుకే ఇది అనుబంధాల పండుగగా కూడా మారింది. చుట్టాల రాకతో ఇల్లు కూడా కళకళాడిపోతాయి. అలాగే సంస్కృతి సాంప్రదాయాల గురించి ఈ తరం వారికి కూడా తెలుస్తుంది. వయసుతో సంబంధం లేకుండా అందరూ బతుకమ్మ చుట్టూ చేరి జానపద గీతాలు ఆలపిస్తూ లయబద్ధంగా నృత్యం చేస్తూ ఆనందంగా గడుపుతారు.

నైవేద్యం ఆరోగ్యం

తొమ్మిది రోజుల పాటు సాగే ఈ పండుగలో రోజుకో రకం నైవేద్యం చేస్తారు. పాత కాలం నాటి వంటకాలు మన ఇళ్లలో పెద్దవాళ్ళు చేస్తారు. నువ్వులు, కొబ్బరి, సత్తు పొడి, బెల్లం వంటి వాటితో నైవేద్యాలు చేసి అమ్మవారికి సమర్పించి ప్రసాదంగా తీసుకుంటారు. అనేక రకాల సంప్రదాయ పిండి వంటలు చేసుకుని ఆరగిస్తారు. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమయే వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. అలిగిన బతుకమ్మ రోజు మాత్రమే అమ్మవారికి ఎటువంటి నైవేద్యం సమర్పించకుండా, బతుకమ్మ ఎత్తకుండా ఉంటారు. ఎందుకంటే ఆరోజు అమ్మవారు అలిగి ఉంటారని నమ్ముతారు. ఇలా అందరినీ ఒక దగ్గరకు చేర్చి ప్రకృతితో మమేకమయ్యే బతుకమ్మ పండుగ అంటే చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమైనది.