Engili pula bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ అంటే ఏంటి? దీనికి ఆ పేరు ఎలా వచ్చింది? ఎప్పుడు జరుపుకుంటారు?
Engili pula bathukamma: అక్టోబర్ 2 నుంచి బతుకమ్మ పండుగ సంబరాలు మొదలవుతాయి. ఎంగిలి పూల బతుకమ్మగా తొలిరోజు వేడుకలు జరుపుకుంటారు. అసలు ఎంగిలి పూల బతుకమ్మ అంటే ఏంటి? దీనికి ఆ పేరు ఎలా వచ్చింది. ఆరోజు సమర్పించే నైవేద్యం ఏంటో తెలుసుకుందాం.
Engili pula bathukamma: పూలను దైవంగా ఆరాధించే పండుగ బతుకమ్మ. దేశమంతా నవరాత్రుల సంబరాలు ప్రారంభమయ్యే రోజుకు ఒక రోజు ముందుగానే తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు మొదలవుతాయి. అమావాస్య రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా వేడుకలు జరుపుకుంటారు.
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే ఈ పండుగ ఇప్పుడు దేశ విదేశాల్లోనూ ఎంతో పేరు గాంచింది. ఈ తొమ్మిది రోజుల పాటు మహిళలు రోజుకో విధమైన బతుకమ్మను పేర్చి పండుగ సంబరాలు జరుపుకుంటారు. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మతో సంబరాలు ముగుస్తాయి. అలిగిన బతుకమ్మ ఒక్క రోజు మినహా మిగతా ఎనిమిది రోజులు వైవిధ్యమైన నైవేద్యాలు అమ్మవారికి సమర్పిస్తారు. తీరోక్క పూలను అందంగా స్తూపం, శంఖం, గోపురం ఆకారంలో అమర్చుకుంటారు.
అక్టోబర్ 2 నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది. ఈరోజు ఎంగిలి పూల బతుకమ్మ చేసుకుంటారు. అసలు ఎంగిలి పూల బతుకమ్మ అంటే ఏంటి? దానికి ఆ పేరు ఎలా వచ్చింది? ఈరోజు సమర్పించే నైవేద్యం ఏంటో తెలుసుకుందాం.
ఎంగిలి పూల బతుకమ్మ కథ
బతుకమ్మ చేసుకునేందుకు ముందు రోజు నుంచే ఆడవాళ్ళు పొలాలు, చెట్లు, గట్టులు తిరుగుతూ ఉంటారు. కనిపించిన అందమైన రంగు రంగుల పూలన్నీ కోసి తెచ్చి పెట్టుకుంటారు. మొదటి రోజు చేసుకునే ఎంగిలి పూల బతుకమ్మ పేర్చుకునేందుకు సిబ్బిలు, తంగేడు పూలు, గునుగు, తామర, చామంతి, బంతి, సీత జడలు పూలు ఎక్కువగా వినియోగిస్తారు. ముందుగా తంగేడు పూలలు పెట్టుకుని ఆ తర్వాత రంగులను బట్టి పూలను అమర్చుకుంటారు.
ఎంగిలి పూల బతుకమ్మ కోసం ముందు రోజుగానే పూలు తెచ్చి నీళ్ళలో వేసుకుని ఉంచుతారు. అలా పూలు నిద్ర చేస్తాయి. అందుకే ఎంగిలి పూలు అంటారు. అది మాత్రమే కాదు పూలకు ఉన్న ఆకులు, కాడలు తెంచడం కోసం కత్తెర లేదా నోటితో వాటిని కట్ చేస్తారు. అంటే ఎంగిలి చేసినట్టు అర్థం వస్తుంది. పితృ పక్ష అమావాస్య రోజు బతుకమ్మ తొలి రోజు వేడుక జరుపుకుంటారు. ఈరోజు చాలా మంది తమ పెద్దలను, పూర్వీకులను తలుచుకుంటూ ధార్మిక కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత కాస్త భోజనం చేసి బతుకమ్మ తయారు చేస్తారు. భోజనం చేయడాన్ని ఎంగిలి పడటం అంటారు. అందుకే ఆ పేరు వచ్చిందని కూడా అంటారు. తెలంగాణ ప్రజలు పితృ పక్ష అమావాస్యను పెత్రమాస అంటారు.
నైవేద్యం ఏంటి?
ఇలా ఎంగిలి పూల బతుకమ్మ అనడం వెనుక అనేక కారణాలు చెబుతారు. ఇక ఈరోజు గౌరీ దేవికి సమర్పించే నైవేద్యం ప్రత్యేకంగా తయారు చేస్తారు. నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తారు. తొమ్మిది రోజు అమ్మవారికి సమర్పించే నైవేద్యాలకు అనుగుణంగా బతుకమ్మ పేర్లు కూడా ఉంటాయి. సద్దుల బతుకమ్మ చివరి రోజు పోయిరా బతుకమ్మ అంటూ వాటిని సరస్సు లేదా నీటిలో వదిలి ఆడవాళ్ళు అమ్మవారికి నమస్కారం చేసుకుంటారు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.