Bathukamma 2024: బతుకమ్మ పండుగ జరుపుకునే సంప్రదాయం ఎప్పుడు మొదలైంది? దీని వెనుక ఉన్న కథలు ఏంటి?-when did the tradition of celebrating bathukamma festival begin what are the stories behind it ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Bathukamma 2024: బతుకమ్మ పండుగ జరుపుకునే సంప్రదాయం ఎప్పుడు మొదలైంది? దీని వెనుక ఉన్న కథలు ఏంటి?

Bathukamma 2024: బతుకమ్మ పండుగ జరుపుకునే సంప్రదాయం ఎప్పుడు మొదలైంది? దీని వెనుక ఉన్న కథలు ఏంటి?

Gunti Soundarya HT Telugu
Oct 02, 2024 11:23 AM IST

Bathukamma 2024: దసరా నవరాత్రుల సమయంలో తెలంగాణ ప్రజలు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగ బతుకమ్మ. తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అసలు ఈ పండుగ జరుపుకునే సంప్రదాయం ఎప్పుడు మొదలైంది, దీని వెనుక కథలు ఏంటో తెలుసుకుందాం.

బతుకమ్మ పండుగ 2024
బతుకమ్మ పండుగ 2024 (pinterest)

Bathukamma 2024: ప్రకృతిని ఆరాధించే పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ఇతర రాష్ట్రాలకు తెలియజేస్తూ తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఓ వైపు నవరాత్రుల ఉత్సవాలు మరోవైపు పువ్వుల పండుగ బతుకమ్మతో తెలంగాణ రాష్ట్రం కళకళలాడిపోతుంది.

ఈ ఏడాది బతుకమ్మ ఎప్పుడు?

రంగు రంగుల పూలను అందంగా పేర్చి ప్రకృతి పరవశించి పోయే విధంగా ఈ పండుగను జరుపుకుంటారు. కులం, మతం, చిన్నా పెద్ద, ప్రాంతం అని తేడా లేకుండా అందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకునే అద్భుతమైన పండుగ బతుకమ్మ. ఇంట్లోని ఆడవాళ్ళు అందరూ అందంగా ముస్తాబై బతుకమ్మ తయారు చేసి వాటి చుట్టూ చేరి జానపద గేయాలు ఆలపిస్తూ నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకుంటారు. దసరా నవరాత్రుల సమయంలో జరిగే ఈ పండుగ చూసేందుకు రెండు కళ్ళూ సరిపోవు. ఏ వీధిలో చూసిన మహిళకు పట్టుచీరలు ధరించి ధగధగలాడే నగలు వేసుకుని బతుకమ్మను తల మీద పెట్టుకుని ఊరేగింపుగా వస్తారు.

ఈ ఏడాది బతుకమ్మ పండుగ అక్టోబర్ 2 నుంచి 10తేదీ వరకు జరుపుకోనున్నారు. మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతున్న బతుకమ్మ పండుగ కోసం మహిళలు అందరూ పొలాల గట్ల వెంబడి రంగు రంగుల పూల కోసం వెళతారు. తొమ్మిది రోజుల పాటు తొమ్మిది పేర్లతో బతుకమ్మను తయారు చేసి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి గౌరీ దేవిని పూజిస్తారు. అమ్మలక్కలు అందరూ ఒకచోట చేరి ఆనందంగా గడుపుతారు.

బతుకమ్మ పండుగ వెనుక కథలు

ఈ పండుగ జరుపుకునే ఆనవాయితీ ఇప్పటి కాదని పెద్దలు చెబుతారు. సుమారు వెయ్యి సంవత్సరాలకు పైగా ఈ పండుగను జరుపుకుంటూ వస్తున్నారు. మొదట్లో గ్రామాల్లో జరుపుకుంటుండగా అది ఊరు వాడ నుంచి వివిధ ప్రాంతాల ప్రజలు జరుపుకోవడం మొదలు పెట్టారు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అనేక మంది తెలుగు ప్రజలు బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నారు. బతుకమ్మ పండుగ జరుపుకోవడం వెనుక అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం గౌరీ దేవి మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించింది. అతడితో యుద్ధం చేసిన అలసిపోయిన అమ్మవారు ఆశ్వీయుజ పాడ్యమి నాడు నిద్రపోయింది. అమ్మను మేల్కొలిపేందుకు భక్తులు బతుకమ్మా అంటూ పూజలు చేశారు. అలా విజయ దశమి సమయంలో అమ్మవారు మేల్కొన్నారు. అప్పటి నుంచి బతుకమ్మ జరుపుకుంటున్నట్టు కొందరు చెబుతారు.

చోళ రాజు ధర్మాంగధకు పెళ్లి జరిగి సంవత్సరాలు గడిచినప్పటికీ పిల్లలు కలుగలేదు. ఎన్నో పూజలు, వ్రతాలు ఆచరించిన తర్వాత అతడి భార్య లక్ష్మీదేవి లాంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆమె ఎన్నో ప్రమాదాలను తట్టుకుని బతికింది. విషయం తెలుసుకున్న రుషులు ఆడబిడ్డను చూసి ఆమెను బతుకమ్మ అని ఆశీర్వదించారట. అందువల్ల ఆమెకు తల్లిదండ్రులు బతుకమ్మ అని పేరు పెట్టారు. అప్పటి నుంచి బతుకమ్మ ఆడపడచుల పండుగగా మారిందని మరికొందరు చెబుతారు.

తొమ్మిది రోజులు వేడుక

తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ప్రతి రోజు ప్రత్యేక నైవేద్యం చేసి గౌరీ దేవికి సమర్పిస్తారు. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నాన బియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏదో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్న ముద్ద బతుకమ్మ, తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ జరుపుకుంటారు. ఎనిమిది రోజులు ప్రత్యేక నైవేద్యాలు చేస్తారు. కానీ అలిగిన బతుకమ్మ రోజు మాత్రం ఎటువంటి సంబరాలు జరగవు. నైవేద్యం పెట్టరు. ఎందుకంటే ఆరోజు అమ్మవారు అలిగారని నమ్ముతారు.

Whats_app_banner