Vinakaya chavithi 2024: వినాయక చవితి పండుగను పది రోజులు ఎందుకు జరుపుకుంటారో తెలుసా?-why we all are celebrate vinakaya chavithi festival for 10 days what are the reason behind this ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vinakaya Chavithi 2024: వినాయక చవితి పండుగను పది రోజులు ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

Vinakaya chavithi 2024: వినాయక చవితి పండుగను పది రోజులు ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

Gunti Soundarya HT Telugu
Sep 05, 2024 01:23 PM IST

Vinakaya chavithi 2024: వినాయక చవితి పండుగను పది రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. పదో రోజు వినాయకుడి ప్రతిమలను నీటిలో నిమజ్జనం చేస్తారు. అయితే ఈ పండుగను పది రోజులు మాత్రమే ఎందుకు జరుపుకుంటారు? విగ్రహాలను ఎందుకు నిమజ్జనం చేస్తారో తెలుసుకుందాం.

వినాయక చవితిని పది రోజులు ఎందుకు జరుపుకుంటారు?
వినాయక చవితిని పది రోజులు ఎందుకు జరుపుకుంటారు? (pixabay)

Vinakaya chavithi 2024: భారతదేశలో అత్యంత విస్తృతంగా జరుపుకునే పండుగల్లో ఒకటి వినాయక చవితి. పది రోజుల పాటు ఊరు వాడ ఎక్కడ చూసినా వినాయకుడి విగ్రహ మండపాలు దర్శనమిస్తాయి. ప్రత్యేక పూజలు, పాటలతో వీధులన్నీ సందడి నెలకొంటాయి. ప్రమథ గణాలకు అధిపతి అయిన వినాయకుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.

ఈ ఏడాది సెప్టెంబర్ 7న వినాయక చవితి జరుపుకోనున్నారు. ఈరోజు ప్రజలు వినాయకుడు విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టించుకుని పూజలు చేస్తారు. ఉదయం, సాయంత్రం దీపం వెలిగించి నైవేద్యాలు సమర్పించి పూజలు నిర్వహిస్తారు. పది రోజులపాటు ఈ వేడుకలు జరుపుకుంటారు. కొందరు మూడు, ఐదు, ఏడు, తొమ్మిది రోజుల పాటు ఉంచుకొని తర్వాత వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. వినాయకుడి రాక జ్ఞానం, శ్రేయస్సు, ఆశీర్వాదాలను అందిస్తుంది. ప్రతిరోజు వినాయకుడికి మూడుసార్లు పూజ చేసి నైవేద్యం సమర్పిస్తారు.

వినాయకుడి కథ

హిందూ పురాణాల ప్రకారం పార్వతీదేవి స్నానానికి నలుగు పెట్టుకుంటూ ఆ నలుగుతో వినాయకుడిని రూపొందించి దానికి ప్రాణం పోసింది. స్నానానికి వెళుతూ గది బయట కాపలాగా ఉండమని వినాయకుడికి అప్పగించి వెళ్తుంది. అదే సమయంలో శివుడు గదిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తాడు. కానీ గణేషుడు మాత్రం తన తల్లి లోపలికి ఎవరినీ అనుమతించవద్దని చెప్పిందని పంపించే ప్రసక్తే లేదని చెప్తాడు.

శివుని గురించి తెలియక ప్రవేశించేందుకు నిరాకరించాడు. దీంతో ఆగ్రహించిన శివుడు వినాయకుడి శిరస్సును ఛేదిస్తాడు. పార్వతీదేవి తన కుమారుడి గురించి తెలుసుకుని దుఃఖిస్తూ తిరిగి బ్రతికించమని శివుడిని వేడుకుంటుంది. తెగిపడిన తల కోసం ఎంత వెతికినా కనిపించకపోవడంతో ఏనుగు తలను తీసుకొచ్చి వినాయకుడికి పెడతారు. దీంతో అప్పటి నుంచి వినాయకుడు గజాననుడిగా పేరు తెచ్చుకున్నాడు.

పది రోజులు పూజలు ఎందుకు?

వినాయక చవితి సందర్భంగా గణేశుడికి 10 రోజులపాటు పూజలు నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం వినాయకుడు కైలాసం నుంచి భూలోకానికి వచ్చి పది రోజులు మాత్రమే ఉండి వెళ్లాడని అంటారు. భక్తుల నిరంతరం పూజించడం వల్ల కైలాసానికి దూరంగా ఉంటాడేమో అని అనుకొని పార్వతీదేవి పది రోజులపాటు పూజలు అందుకొని రమ్మని చెప్పిందనట్లుగా చెబుతారు. అందువల్ల పది రోజులు పాటు భక్తులు వినాయకుడిని పూజిస్తారు.

వినాయక చవితి సందర్భంగా చాలామంది గణేష్ విగ్రహాలను ప్రాణప్రతిష్ట చేసి ఆచారబద్ధంగా పూజలు నిర్వహిస్తారు. విగ్రహంలోకి దైవాన్ని ఆవాహనం చేస్తారు. రెండు నుంచి తొమ్మిది రోజుల వరకు ప్రార్థనలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తూ వినాయకుడిని సంతోషపెడతారు. తమ భక్తికి చిహ్నంగా మోదకం, పూలు, కొబ్బరికాయలు, వెలగపండు, ఇతర వస్తువులు సమర్పిస్తారు. సాయంత్రం వేళలో పూజ చేసి నైవేద్యం సమర్పిస్తారు.

అనంత చతుర్దశి అని పిలిచే పదవ రోజున పండుగ ముగింపుని సూచిస్తుంది. మట్టితో చేసిన విగ్రహాలను సమీపంలోనే నదులు, సరస్సులు లేదా సముద్రం వంటి వాటి వరకు ఊరేగింపుగా తీసుకువెళ్లి నిమజ్జనం చేస్తారు. గణపతి బప్పా మోరియా అంటూ గణేషుడికి వీడ్కోలు పలుకుతూ వచ్చే ఏడాది వరకు ఆశీర్వాదం ఇవ్వమని కోరుకుంటారు. ఈ పండుగ భక్తులందరినీ ఐకమత్యం చేస్తోంది. ఎటువంటి తారతమ్యాలు లేకుండా అందరూ ఒకే వేదిక దగ్గరికి వచ్చి పూజలు చేస్తారు. వినాయకుని రాక నిష్క్రమణ జీవితం మరణము, పునర్జన్మ చక్రానికి అద్దం పడుతుందని అంటారు.

నిమజ్జనం ఎందుకు చేస్తారు?

వినాయకుడి ప్రతిమలు చేసేందుకు ఉపయోగించే మట్టిని చెరువుల నుంచి సేకరిస్తారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే ఈ మట్టిని సేకరించి వాటితో విగ్రహాలు తయారు చేస్తారు. దీనివల్ల చెరువులో లోతు పెరిగిపోతుంది. ఆ తర్వాత వినాయకుడి ప్రతిమకు 21 పత్రాలతో పూజ చేస్తారు. 10 రోజుల తర్వాత ఆ మట్టి విగ్రహాలతో పాటు ఔషధ గుణాలు కలిగిన పత్రులను కూడా నీటిలో కలుపుతారు.

వీటికి ఉన్న ఆయుర్వేద గుణాలు నీటిలోనూ కలుస్తాయి. అలాగే మట్టి కూడా యధా స్థానానికి వెళుతుంది. అందువల్ల ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయని చెబుతారు. అది మాత్రమే కాకుండా మట్టితో చేసిన ఏ దేవుడు విగ్రహం అయినా కూడా నవరాత్రులు మాత్రమే పూజించేందుకు అర్హత ఉంటుందని ఆ తర్వాత అందులోని దైవత్వం పోతుందని అంటారు. అందువల్లే నవరాత్రుల తర్వాత దుర్గామాత, వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేస్తారు.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

Whats_app_banner