Edible Flowers: ఈ పువ్వులు కనిపిస్తే నమిలి మింగేయండి, ఆరోగ్యానికి ఎంతో మంచిది
Edible Flowers: మన చుట్టూ తినగలిగే పువ్వులు ఎన్నో ఉన్నాయి. కానీ మనం వాటిని తినము. ఆయుర్వేదంలో కూడా వీటి ప్రస్తావన ఉంది. వీటి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఆ పువ్వులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Edible Flowers: ఆకుకూరలులాగే కొన్ని పువ్వులను కూడా మనము తినవచ్చు. ప్రాచీన కాలంలో ఆకుకూరలతో పాటు పువ్వులను తినేవారు. ఆధునిక కాలంలో పువ్వులను పూర్తిగా తినే ఆహారం నుంచి తొలగించారు. నిజానికి ఆకుల్లో ఎన్ని సుగుణాలు ఉంటాయో, పువ్వుల్లో కూడా అలాంటి పోషకాలు ఉంటాయి. కొన్ని రకాల పువ్వులను పచ్చిగా తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. వంటలో పువ్వుల ఉపయోగం అనేది శతాబ్దాలు నాడే మొదలైంది. సలాడ్ల రూపంలో ఆకులనే కాదు పువ్వులను కూడా చేర్చి తినేవారు. కానీ ఇప్పుడు పువ్వులను పక్కన పెట్టేశారు. మన చుట్టూ ఉన్న పువ్వుల్లో తినదగిన పువ్వులు ఉన్నాయి. వీటిని వంటల్లో ఉపయోగించుకోవచ్చు. ఇవి తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. ఆ పువ్వులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
లావెండర్
లావెండర్ పువ్వులు తీపి కాస్త పులుపు రుచితో ఉంటాయి. వీటిని చక్కగా తీసుకొని తినవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్టులు ఉండవు. ప్రత్యేకమైన రుచి కోసం కుకీలు, కేకుల్లో వీటిని వాడతారు. టీ, సిరప్ లలో ఈ లావెండర్ పువ్వులను వాడవచ్చు. పచ్చిగా తినలేనివారు టీ రూపంలో లావెండర్ పువ్వులను తింటే ఎంతో మంచిది.
బంతిపూలు
వీటిని మ్యారిగోల్డ్ అని పిలుస్తారు. వీటిని సూపులపైన, బిర్యాని, పులావ్ వంటి వంటకాలపైన, డిజర్ట్ లపైనా గార్నిష్ చేయడానికి వినియోగించవచ్చు. వీటితో హెర్బల్ టీలు కూడా చేసుకొని తాగొచ్చు. పచ్చిగా కూడా తినేయవచ్చు. ఇవి మన ఆరోగ్యానికి అంతా మేలే చేస్తాయి.
గులాబీలు
గులాబీలను తినేవారు ఇప్పటికీ ఉన్నారు. ఇవి బొకేలకు మాత్రమే కాదు, సలాడ్లు, డిజర్ట్ లు, ఫ్రూట్ సలాడ్లపై గార్నిషింగ్ కి ఉపయోగపడతాయి. గులాబీ రేకులను పచ్చిగా తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. అయితే పువ్వులపై పురుగుల మందులు చల్లలేదని నిర్ధారించుకున్నాకే వాటిని తినాలి. కేకులు, పేస్ట్రీలలో ఈ గులాబీ పూల మిశ్రమాన్ని కలుపుకోవచ్చు.
చామంతి పూలు
చామంతి పూల రుచి కాస్త ఆపిల్ లాగా అనిపిస్తుంది. వీటిని చూస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. వీటితో టీ కాచుకొని తాగితే చాలా మంచిది. చామంతి పూలను ఎండబెట్టి పొడి చేసి పేస్ట్రీలు, కేకుల్లో వాడుకోవచ్చు. కూరల్లో కలుపుకోవచ్చు. నీళ్లలో కలిపి నేరుగా తాగొచ్చు.
పైన చెప్పిన పూలను పండించే విధానాన్ని బట్టి తినాలా? వద్దా? అనేది నిర్ణయించుకోండి. ఇప్పుడు ఎక్కువగా పెస్టిసైడ్స్ ను చల్లుతున్నారు. పురుగుల మందులను చల్లిన పూలను తినడం వల్ల చాలా ప్రమాదం. కాబట్టి సేంద్రీయ పద్ధతిలో పండించిన పువ్వులను మాత్రమే తినండి. వంటలో వీటిని భాగం చేసుకోండి. పూలను పరిశుభ్రంగా నీటితో కడిగాకే తినండి. లేకపోతే ఇతర సమస్యలు ఏమైనా వచ్చే అవకాశం ఉంది.
టాపిక్