Liver Health: కాలేయంలో సమస్యలు వేధిస్తున్నాయా? ఉపశమనం కలిగించగల 6 రకాల ఆహారాలు-eat these foods to get relief from liver inflammation ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Liver Health: కాలేయంలో సమస్యలు వేధిస్తున్నాయా? ఉపశమనం కలిగించగల 6 రకాల ఆహారాలు

Liver Health: కాలేయంలో సమస్యలు వేధిస్తున్నాయా? ఉపశమనం కలిగించగల 6 రకాల ఆహారాలు

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 12, 2024 08:30 AM IST

Liver Health: కాలేయంలో ఇబ్బందిగా ఉంటే కొన్ని రకాల ఆహారాలు ఉపశమనం కలిగించగలవు. ఇన్‍ఫ్లమేషన్‍ను తగ్గించగలవు. లివర్ ఆరోగ్యానికి మేలు చేసే ఆరు రకాల ఫుడ్స్ ఏవో ఇక్కడ చూడండి.

Liver Health: కాలేయంలో సమస్యలు వేధిస్తున్నాయా? ఉపశమనం కలిగించగల 6 రకాల ఆహారాలు
Liver Health: కాలేయంలో సమస్యలు వేధిస్తున్నాయా? ఉపశమనం కలిగించగల 6 రకాల ఆహారాలు

కాలేయం పనితీరు బాగుంటేనే పూర్తిస్థాయి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. శరీరంలో కాలేయం అనేది అంత ముఖ్యమైన భాగం. శరీరంలోని వ్యర్థాలు బయటికి పోయే ప్రక్రియ, జీవక్రియ, జీర్ణం సహా చాలా అంశాల్లో కాలేయం (లివర్) కీలకపాత్ర పోషిస్తుంది. కాలేయానికి సమస్య ఎదురైతే ఓవరాల్ ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఫ్యాటీ లివర్, హెపటైటిస్ లాంటి సమస్యలు వస్తే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది.

కాలేయంలో అంతర్గతంగా వాపు పెరగడాన్ని ఇన్‍ఫ్లమేషన్ అంటారు. ఇది తీవ్ర సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంటుంది. కొన్ని రకాల ఆహారాలను మీ డైట్‍లో చేర్చుకోవడం వల్ల ఇన్‍ఫ్లమేషన్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అలా చేయగలిగే ఆరు రకాల ఫుడ్స్ ఏవో ఇక్కడ చూడండి.

బీట్‍రూట్

కాలేయానికి బీట్‍రూట్‍ చాలా మేలు చేస్తుంది. దీంట్లో నైట్రేట్స్, బీటాలైన్స్ అనే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. డియాక్సిఫైయింగ్ ఎంజైమ్‍ల ఉత్పత్తి కాలేయంలో పెరిగేలా.. ఇన్‍ఫ్లమేషన్ తగ్గేలా బీట్‍రూట్ చేయగలదు. బీట్‍రూట్‍ను జ్యూస్‍గా తీసుకుంటే కాలేయం ఆరోగ్యంగా ఉండటంతో పాటు దృఢమవుతుంది. బీట్‍రూట్‍లో చాలా రకాల విటమిన్లు, మినరల్స్ పూర్తిస్థాయి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.

ఫ్యాటీ ఫిష్

సాల్మోన్, సార్డినెస్ లాంటి ఫ్యాటీ చేపలు కూడా కాలేయం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ ఫ్యాటీ ఫిష్‍ల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి యాంటి-ఇన్‍ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటాయి. అందుకే కాలేయంలో ఇన్‍ఫ్లమేషన్‍ను ఫ్యాటీ ఫిష్‍లు తగ్గించగలవు. గుండె ఆరోగ్యానికి కూడా సపోర్ట్ చేస్తాయి. కాలేయంలో సమస్యను ఎదుర్కొనే వారు ఫ్యాటీ ఫిష్ తినడం మంచిది.

సిట్రస్ పండ్లు

నారింజ, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ లాంటి బెర్రీలు, ద్రాక్ష సహా సిట్రస్ పండ్లల పోలిఫెనాల్స్ అనే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయంలో వాపును తగ్గించగలవు. లివల్ డ్యామేజ్ కాకుండా కాపాడేందుకు సహకరిస్తాయి. కాలేయంలో పేరుకున్న వ్యర్థాలు తొలిగేందుకు కూడా తోడ్పడతాయి. సిట్రస్ పండ్లను రెగ్యులర్‌గా తీసుకోవాలి.

అల్లం

అల్లంలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీఇన్‍ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. కాలేయంలో వాపు ప్రక్రియను ఇది తగ్గించగలదు. కాలేయంలో కొవ్వు కరిగేందుకు కూడా తోడ్పడుతుంది. మీరు చేసుకునే వంటకాల్లో అల్లం వేసుకోవడం వల్ల కాలేయానికి మేలు జరుగుతుంది. అల్లం ప్రధానంగా కొన్ని వంటలు చేసుకోవచ్చు. అల్లంతో హెల్దీ డ్రింక్స్ కూడా చేసుకొని తాగొచ్చు.

ఆకుకూరలు

పాలకూర, కేల్, బచ్చలి లాంటి ఆకుకూరలు కూడా కాలేయానికి మంచి చేస్తాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు లివర్‌ను కాపాడడంలో సహకరిస్తాయి. ఆకుకూరల్లో ఉండే క్లోరోఫిల్.. శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు సులువుగా బయటికి వెళ్లి.. ఇన్‍ఫ్లమేషన్ తగ్గించడంలో తోడ్పడతాయి. ఆకుకూరలతో రకరకాల వంటలు చేసుకోవచ్చు. సలాడ్లు, స్మూతీలుగానే తీసుకోవచ్చు.

బాదం, వాల్‍నట్స్

బాదం, వాల్‍నట్స్ తినడం కాలేయంలో ఇన్‍ఫ్లమేషన్‍, ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించగలవు. వాటిలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఈ, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

నిపుణులను సంప్రదించాలి

కాలేయంలో ఆరోగ్యానికి పైన చెప్పిన ఆహారాలు తోడ్పడతాయి. ఇవి డైట్‍లో తీసుకోవచ్చు. పూర్తిస్థాయి పోషకాలతో కూడిన డైట్, జీవనశైలి, వ్యాయామాలు ఇలా చాలా విషయాలు కాలేయంపై ప్రభావం చూపిస్తాయి. కాలేయంలో ఏదైనా సమస్య వస్తే వెంటనే సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించాలి.

Whats_app_banner