బరువు తగ్గాలనుకుంటున్న వారికి ఆహారం చాలా ముఖ్యమైన విషయం. తమ డైట్‍లో ఏం తింటున్నారో కచ్చితంగా చూసుకోవాలి. నారింజ (ఆరెంజ్) పండ్లలో పోషకాలు మెండుగా ఉంటాయి. అయితే, ఈ పండు బరువు తగ్గేందుకు సహకరిస్తుందా అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. అయితే, బరువు తగ్గేందుకు చాలా రకాలుగా నారింజ తోడ్పడుతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు రెగ్యులర్‌గా నారింజ తినొచ్చు. బరువు తగ్గేందుకు నారింజ ఎలా ఉపయోగపడుతుందో వివరాలను ఇక్కడ చూడండి.
బరువు తగ్గాలనుకునే వారు స్నాక్‍లాగా నారింజను తినొచ్చు. ఈ పండులో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఓ మోస్తరు సైజు నారింజలో సుమారు 80 క్యాలరీలు ఉంటాయి. అంటే ఈ పండు తినడం వల్ల సంతృప్తి కలిగినా.. ఎక్కువగా క్యాలరీలు తీసుకున్నట్టు అవదు. బరువు తగ్గాలనుకునే వారు క్యాలరీలు తక్కువగా ఫుడ్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. క్యాలరీలు తక్కువగా తీసుకునేలా చేసి బరువు తగ్గే ప్రయత్నానికి ఆరెంజ్ సహకరిస్తుంది.
నారింజ పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ పండు తింటే కడుపు నిండిన ఫీలింగ్ చాలాసేపు ఉంటుంది. చిటికిమాటికీ ఆహారం తినాలనిపించే కోరికను ఈ పండు తగ్గించగలదు. కడుపు నిండిన ఫీలింగ్ ఉంటే మీరు ఎక్కువగా ఆహారం తీసుకోరు. దీనివల్ల క్యాలరీలు తీసుకోవడం తగ్గుతుంది. వెయిట్ నియంత్రణకు ఇది కీలకంగా ఉంటుంది. అందుకే మీ డైట్‍లో ఆరెంజ్‍ను తప్పకుండా చేర్చుకోండి.
కొందరికీ తరచూ తీపి పదార్థాలు తినాలనే ఆశ కలుగుతూ ఉంటుంది. అయితే, బరువు తగ్గాలనుకునే వారు స్వీట్స్ ఎక్కువగా తినకూడదు. తీపిపదార్థాలు తినాలని అనుకుంటున్నప్పుడు నారింజ తింటే ఆ కోరిక తగ్గిపోతుంది. షుగర్ ఉండే స్నాక్‍లకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా నారింజను తినవచ్చు. నారింజ తినడం వల్ల షుగర్ ఇంటేక్ కూడా తగ్గుతుంది. వెయిట్ లాస్‍లో ఇది కూడా కీలకంగా ఉంటుంది.
నారింజ పండ్లలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. జీవక్రియను మెరుగుపరచడంలో ఈ విటమిన్ కీలకపాత్ర పోషిస్తుంది. ఫ్యాట్‍ను ఎనర్జీగా మార్చేందుకు ఇది తోడ్పడుతుంది. ఇలా వెయిట్ లాస్‍కు నారింజ ఉపయోగపడుతుంది. ఇన్‍ఫ్లమేషన్‍ను కూడా నారింజ నిరోధించగలదు.
నారింజ పండులో గ్లెసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. దీంతో ఇవి తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడాన్ని నియంత్రించగలదు. రక్తంలో గ్లూకోజ్ శోషణను కూడా నారింజ నెమ్మది చేయగలదు. నారింజ లాంటి గ్లెసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహారాలు తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‍లో ఉంటాయి. ఆకలిని కూడా నారింజ తగ్గిస్తుంది. ఎక్కువగా తినాలన్న కోరికను తగ్గిస్తుంది. ఇలా బరువు తగ్గేందుకు నారింజ తోడ్పడుతుంది.
నారింజ పండును నేరుగా తినడం చాలా మేలు. ప్రతీ రోజు ఈ పండును తినాలి. జ్యూస్ చేసుకొని కూడా తాగొచ్చు. అయితే, బరువు తగ్గాలనుకునే వారు చెక్కెర సహా ఏమీ యాడ్ చేయకుండా.. నారింజను మాత్రమే బ్లెండ్ చేసి తాగాలి. సలాడ్లలోనూ నారింజను తినొచ్చు. ఇతర పండ్లతో నారింజను కలిపి స్మూతిగానూ చేసుకోవచ్చు.