Easter 2024: అంతరిక్షంలోను ఈస్టర్ వేడుకలు.. ఇంకా మరెన్నో ఆశ్చర్యపరిచే విషయాలు
Easter 2024: భూమి మీద మాత్రమే కాదు ఈస్టర్ వేడుకలు అంతరిక్షంలో కూడా ఆనందంగా జరుపుకుంటారు. వ్యోమగాములు వీడియో కాల్ ద్వారా భూమి మీద ఉన్న వారికి శుభాకాంక్షలు చెప్తారు.
Easter 2024: ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఈస్టర్ పండుగను ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. దీన్ని యేసు పునరుత్థాన పండుగ అని కూడా అంటారు. బంధువులు, స్నేహితులను కలిసి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ గడుపుతారు. ఉదయం పూట చర్చిలో జరిగే ప్రార్థనకు హాజరవుతారు. కీర్తనలు పాడుతూ యేసు తమ కోసం చేసిన త్యాగాన్ని స్మరించుకుంటారు. తమని పాపం నుంచి విడిపించమని కోరుకుంటూ ప్రార్థనలు చేస్తారు. అయితే ఈస్టర్ వేడుకలు భూమి మీద మాత్రమే కాకుండా స్పేస్ లో కూడా జరుపుకుంటారు. ఈస్టర్ వేడుకకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీ కోసం.
ఈస్టర్ గుడ్లు
ఈస్టర్ రోజు గుడ్లుని అందంగా అలంకరించడం ఒకరికొకరు ఇచ్చుపుచ్చుకోవడం అనే సంప్రదాయం శతాబ్దాలకు నాటిది. ఇది కొత్త జీవితం, పునర్జన్మకు ప్రతీకగా భావిస్తారు. లెంట్ సమయంలో గుడ్లు తినకుండా ఉపవాసం ఉంటారు. అందుకే ఉపవాసం ముగిసిన తర్వాత వీటిని ఉడకబెట్టుకొని అలంకరించి ఇతరులతో పంచుకుంటారు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఈస్టర్ ఎగ్స్ తో రకరకాల వంటలు చేసుకుని ఆరగిస్తారు.
ఈస్టర్ బన్నీ
అనేక సంస్కృతులలో ఈస్టర్ చిహ్నంగా ఈస్టర్ బన్నీని భావిస్తారు. ఇది అన్యమత మూలాలను కలిగి ఉంది. ఈస్ట్రే అనే అన్యమత పండుగ ఇది. వసంతకాలం, సంతాన ఉత్పత్తి ఆగమనాన్ని సూచిస్తుంది. ఈస్ట్ దేవత చిహ్నంగా ఒక కుందేలుని భావిస్తారు. కాలక్రమేణ ఈ సంప్రదాయం క్రిస్టియన్ వేడుకలతో కలిసిపోయింది. ఈస్టర్ బన్నీ దాల్చిన గుడ్లు దొరికితే సంతానం కలుగుతుందని నమ్ముతారు.
ప్రపంచవ్యాప్తంగా ఈస్టర్ సంప్రదాయాలు
ఈస్టర్ పండుగను ప్రపంచవ్యాప్తంగా వివిధ మార్గాల్లో జరుపుకుంటారు. ప్రతి సంస్కృతికి ప్రత్యేక ఆచారాలు సంప్రదాయాలు ఉంటాయి. గ్రీస్ లో ఈస్టర్ రోజు సౌగ్రిస్మా అనే గేమ్ ఆడటం సర్వసాధారణం. ఇక్కడ ప్రజలు ఎదుటి వారి దగ్గర ఉన్న ఎరుపు రంగు గుడ్లను పగలగొట్టడానికి ప్రయత్నిస్తారు. స్వీడన్, ఫిన్లాండ్ లో పిల్లలు మంత్రగత్తెలవలే దుస్తులు ధరించి ఇంటింటికి తిరుగుతూ స్వీట్స్ కోసం వాళ్ళు వేసిన డ్రాయింగ్స్, పెయింటింగ్స్ ఇచ్చిపుచ్చుకుంటారు.
అతిపెద్ద చాక్లెట్ ఈస్టర్ ఎగ్
2011 లో ఇటలీలో ఇప్పటివరకు తయారు చేసిన అతి పెద్ద చాక్లెట్ ఈస్టర్ ఎగ్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ను సృష్టించింది. ఈ భారీ గుడ్డు 34 అడుగుల పొడవు, 15,873 పౌండ్ల బరువు కలిగి ఉంది. ఇటలీలోని టోస్కా కంపెనీ దీన్ని రూపొందించింది. 8వేల కిలోల చాక్లెట్ తో దీన్ని తయారు చేశారు.
అంతరిక్షంలో ఈస్టర్
అన్ని ప్రదేశాలలో అందరూ చర్చికి వెళ్లి ఈస్టర్ వేడుకలు జరుపుకుంటారు. ప్రార్థనలు చేస్తారు. బహుమతులు ఇచ్చుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. అయితే భూమ్మీద మాత్రమే కాదు అంతరిక్షంలోనూ ఈస్టర్ వేడుకలు నిర్వహించుకుంటారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములు కూడా ఈస్టర్ జరుపుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. వారు ప్రత్యేకంగా ప్యాక్ చేసిన ఈస్టర్ భోజనాలు ఆస్వాదిస్తారు. మైక్రోగ్రావిటీలో ఈస్టర్ ఎగ్స్ కోసం వెతుకుతారు. వీడియో సందేశాల ద్వారా భూమి మీద ఉన్న వారికి శుభాకాంక్షలు పంపుతారు.