Drowning Prevention | వర్షాకాలంలో నీటి ప్రదేశాలలో జాగ్రత్త, మునిగిపోకుండా భద్రతా చిట్కాలు!
World Drowning Prevention Day 2023: వర్షాకాలంలో నీటి ప్రదేశాలకు వెళ్లేటపుడు, ఈత కొట్టేటపుడు ఎలాంటి నీటి భద్రత చర్యలు తీసుకోవాలో కొన్ని చిట్కాలను ఇక్కడ తెలియజేస్తున్నాం
Drowning Preventing Tips: వర్షాకాలంలో నీటి వనరులన్నింటికీ జీవకళ వస్తుంది. చెరువులు, కుంటలు నిండుకుంటాయి, వాగులు - వంకలు పొంగి ప్రవహిస్తాయి, సెలయేళ్లు పరవళ్లు తొక్కుతాయి, జలపాతాలు జాలువారుతాయి. ఈ దృశ్యాలు మనందరినీ కనువిందు చేస్తాయి, జలకాలాటలతో పరవశించిపోవాలని ప్రేరేపిస్తాయి. వర్షపు నీటిలో ఆటలాడాలనుకోవడం, విహారయాత్రలు చేస్తూ మాన్ సూన్ అందాలను ఆస్వాదించాలనుకోడంలో తప్పులేదు. కానీ, ఆ ఆనందాల వెనక కొన్ని ప్రమాదాలు పొంచి ఉంటాయి. ముఖ్యంగా ఈతకు వెళ్లి గల్లంతవడం, నీటిలో మునిగిపోవడం, వరదలో కొట్టుకోవంటి ఘటనలు ఈ సీజన్ లోనే చోటు చేసుకుంటాయి. అంతేకాకుండా నీటిలో మునిగి మరణిస్తున్న వారిలో 80 శాతం మంది పురుషులే ఉంటున్నారని గణాంకాలు తెలియజేస్తున్నాయి. అందుకే ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండటం, జాగ్రత్తలు పాటించడం అవసరం.
ఈరోజు నీటిలో మునిగిపోవడాన్ని నివారించే దినోత్సవం (World Drowning Prevention Day 2023). ప్రతీ ఏడాది జూలై 25న ఈ ప్రత్యేక సందర్భాన్ని నిర్వహిస్తారు. ఈత కొట్టేటపుడు, లేదా నీటి క్రీడలలో పాల్గొనేటపుడు, నీటిలో దిగేటపుడు మునిగిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై అవగాహన కల్పించడం ఈరోజుకు ఉన్న ముఖ్య ఉద్దేశ్యం. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని, ఈ వర్షాకాలంలో నీటి ప్రదేశాలకు వెళ్లేటపుడు, ఈత కొట్టేటపుడు ఎలాంటి నీటి భద్రత చర్యలు తీసుకోవాలో కొన్ని చిట్కాలను ఇక్కడ తెలియజేస్తున్నాం, వీటిని పాటించడం ద్వారా ఎవరైనా నీటిలో మునిగిపోయే ప్రమాదంను నివారించవచ్చు.
మద్యం సేవించి నీటిలో దిగకూడదు
నీటి వద్దకు వెళ్లేటపుడు గానీ లేదా ఈత కొట్టేటపుడు గానీ ఆ వ్యక్తి మద్యం సేవించి ఉండరాదు. మద్యం సేవించినపుడు నీటిలో దిగడం చాలా ప్రమాదం. నీరు ఎక్కువ లోతులేకపోయినప్పటికీ కూడా అల్కాహాల్ సేవించి వెళ్లడం నిషేధం. చల్లని నీరు మరింత ప్రమాదకరం. చల్లని నదులు, సరస్సులు లేదా ప్రవాహాలలో ఈత కొట్టడం చేయరాదు.
లైఫ్ జాకెట్‌ను ఎల్లప్పుడూ ధరించండి
మీరు వాటర్ అడ్వెంచర్లలో పాల్గొంటున్నప్పుడు లేదా బోటింగ్ చేస్తున్నప్పుడు కచ్చితంగా లైఫ్ జాకెట్‌ను ధరించండి. పిల్లలకైనా, పెద్దలకైనా లైఫ్ జాకెట్ ఉండాల్సిందే. ఎక్కువ గాలితో కూడిన నాణ్యమైన లైఫ్ జాకెట్‌ను ఉపయోగించడం ముఖ్యం.
ఈత పాఠాలు నేర్చుకోండి
మీకు ఈత కొట్టడం ఇదివరకే తెలిసినప్పటికీ, కొత్తగా ఈతకు సంబంధించిన పాఠాలు నేర్చుకోవడం మంచిది. గజ ఈతగాళ్ల సలహాలు, సూచనలు స్వీకరించండి. ఎందుకంటే వర్షాకాలంలో విభిన్న పరిస్థితులు ఎదురవుతాయి.
ఎప్పుడూ ఒంటరిగా ఈత కొట్టకూడదు
ఎప్పటికీ గానీ ఒంటరిగా ఈత కొట్టకూడదు. ఈత తెలిసిన స్నేహితులు మీ బృందంలో ఉండాలి. లైఫ్‌గార్డ్‌లు ఉన్న నిర్దేశిత ఈత ప్రాంతాలలో మాత్రమే ఈత కొట్టండి. ఎక్కువ దూరానికి గానీ, ఎక్కువ లోతులో ఈత కొట్టడానికి ప్రయత్నించకండి. ఈత కొట్టేటపుడు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండండి, పరధ్యానాన్ని నివారించండి.
ప్రవాహాలు ఎక్కువైనపుడు అప్రమత్తం
వర్షాకాలంలో బహిరంగ ప్రదేశాలలో ఈత కొట్టేటపుడు జాగ్రత్త. ప్రవాహ ఉదృతిని ఎప్పటికప్పుడు గమనిస్తుండండి. ఎందుకంటే ఎగువన అకస్మాత్తుగా కురిసే భారీ వర్షాలు, క్లౌడ్ బరస్ట్ వంటి పరిస్థితుల కారణంగా వరదలు ఇక్కసారిగా ముంచెత్తవచ్చు. కాబట్టి ప్రవాహాలు ఎక్కువైనపుడు అప్రమత్తంగా ఉండాలి, ఈతను ఆపేసి బయటకు దూరంగా వచ్చేయాలి. చిన్న కొలనులో ఈత కొట్టడం చాలా సులభమే కానీ, సరస్సు, నది లేదా సముద్రంలో ఈత కొట్టడం ఈ వర్షాకాలంలో అత్యంత కఠినమైన సవాళ్లతో కూడుకున్న వ్యవహారం.
కాబట్టి ఈ వర్షాకాలంలో నీటి ప్రదేశాల వద్ద పెద్దలుగా మీరు జాగ్రత్తలు తీసుకోండి, పిల్లలకు నేర్పించండి, మునిగిపోయే ప్రమాదాలను నివారించండి.
సంబంధిత కథనం