Drinking Warm Water | ఈ 5 కారణాల కోసం మీరు రోజూ ఉదయం గోరువెచ్చని నీరు తాగాలి!
ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చని నీరు తాగటం (Drinking Warm Water) అలవాటు చేసుకోవాలి. దీని వల్ల ఉదర సంబంధిత సమస్యలు తీరిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రపడుతుంది. మలబద్ధకం సమస్య ఉండదు. ఇంకా పలు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.
రాత్రి నుంచి ఉదయం వరకు సుదీర్ఘమైన సమయం పాటు నీరు లేకపోవటం వలన శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. కాబట్టి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి నీరు తాగాలి. అయితే ప్రతిరోజూ ఉదయం గోరు వెచ్చని నీరు తాగటం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఉదయం లేచిన తర్వాత ఒక గ్లాసు నీటిని వేడి చేసుకొని గోరువెచ్చగా తాగడం వల్ల అది మీ శరీరంలోని టాక్సిన్స్‌ని బయటకు పంపుతుంది. మలబద్ధకం సమస్య ఉన్నవారు తప్పకుండా ఉదయం లేచిన తర్వాత కొన్ని గ్లాసుల గోరువెచ్చని నీరు తాగాలి. గోరువెచ్చని నీరు ఒక భేదిమందులా పనిచేస్తుంది. మీ పొట్టలోని ఆహారాన్ని విచ్ఛిన్నం చేస్తుంది, అలాగే మీ ప్రేగు కదలికలను ప్రేరేపిస్తుంది. ఈ రకంగా మలబద్ధకం సమస్యకు ఫలితం లభిస్తుంది.
ఇటీవల కాలంలో చాలా మంది ఊబకాయం, డయాబెటీస్ వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వలన అధిక రక్తపోటు, స్థూలకాయం, మధుమేహం, గుండెపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధి మొదలైన సమస్యలను కలిగిస్తుంది. దీనిని నివారించడానికి తక్కువ నూనెతో చేసే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటంతో పాటు ఉదయం నిద్ర లేవగానే వేడినీళ్లు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఉదయం లేచిన తర్వాత ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీరు తాగటం (Drinking Warm Water) వలన కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
కొలెస్ట్రాల్ తగ్గుతుంది
వేడి నీటిని తాగితే అధిక కొలెస్ట్రాల్ సమస్యను దూరం చేసుకోవచ్చునని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. ఇది శరీరంలోని అదనపు కొవ్వును కరిగిస్తుంది, గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది.
అధిక బరువు నియంత్రణ
లేచిన వెంటనే రెండు గ్లాసుల గోరు వెచ్చని నీటిని తాగటం వలన శరీర ఉష్ణోగ్రతను పెరుగుతుంది, మీ జీవక్రియ రేటు మెరుగుపడుతుంది. ఈ పెరిగిన జీవక్రియ రేటు ఎక్కువ కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. నిమ్మరసంతో కలిపి తాగితే మెరుగైన ఫలితాలు ఉంటాయి.
చర్మం కాంతివంతం
వేడి నీరు తాగటం వలన శరీరం నిర్విషీకరణ చెందడం ప్రారంభిస్తుంది, శరీరంలోని మలినాలు తొలగొపోతాయి. దీని ప్రభావం మన చర్మం, ముఖంపై కనిపిస్తుంది. ఇది ముఖానికి అద్భుతమైన మెరుపునిస్తుంది.
పీరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం
పీరియడ్స్ నొప్పితో బాధపడే ఆడవారు ఉదయం పూట కొన్ని కప్పుల గోరువెచ్చని నీటిని తాగడం వల్ల గొప్ప ఉపశమనం పొందవచ్చు. ఈ నీటి నుంచి వచ్చే వెచ్చదనం బాధాకరమైన పొత్తికడుపు కండరాలకు విశ్రాంతి కలిగించి, నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
ENT సమస్యలకు చెక్
జలుబు చేసినప్పుడు గోరువెచ్చని చల్లనివి కాకుండా వెచ్చని నీరు తాగమని డాక్టర్లు సలహా ఇస్తారు. ఎందుకంటే ఇది పేరుకుపోయిన శ్లేష్మాన్ని క్లియర్ చేస్తుంది, మీరు బాగా ఊపిరి పీల్చుకోవడానికి సహాయపడుతుంది. వేడి నీరు గొంతు నొప్పిని కలిగించే సూక్ష్మజీవులను కూడా నాశనం చేస్తుంది. దీంతో మొత్తం శ్వాసకోశానికి ఉపశమనం లభిస్తుంది. ENT సమస్యలను నియంత్రించవచ్చు.
సంబంధిత కథనం