Foods to avoid with alcohol: మద్యంతో ఈ ఆహారాలు వద్దే వద్దు!-dont eat these foods with alcohol know the reasons ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Foods To Avoid With Alcohol: మద్యంతో ఈ ఆహారాలు వద్దే వద్దు!

Foods to avoid with alcohol: మద్యంతో ఈ ఆహారాలు వద్దే వద్దు!

HT Telugu Desk HT Telugu
Oct 16, 2023 06:39 PM IST

Foods to avoid with alcohol: ఆల్కహాల్ తాగుతూ కొన్ని ఆహారాలు తినడానికి అలవాటు పడిపోతారు. అసలు ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీసేవేంటో తెలుసుకోండి.

మద్యంతో తినకూడని ఆహారాలు
మద్యంతో తినకూడని ఆహారాలు

మద్యం ఆరోగ్యానికి హానికరం. అయినప్పటికీ దాన్ని చాలా మంది తాగుతూనే ఉంటారు. అయితే దీనితో కొన్ని ఆహారాలను కలిపి తినడం వల్ల మనిషి శరీరంపై దుష్ప్రభాలు ఇంకా ఎక్కువ అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకోవడం ద్వారా ఆల్కహాల్‌ తాగేప్పుడు వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయవచ్చు.

కరకరలాడే చిరు తిండ్లు :

కొంత మంది మద్యంతోపాటుగా చిప్స్‌, నూనెలో వేపించిన స్నాక్స్‌ని ఎక్కువగా తింటూ ఉంటారు. చికెన్‌ పకోడీలు, ఉల్లి పకోడాల్లాంటి వాటినీ తినేందుకు ఇష్టపడుతుంటారు. వీటిలో సంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయి. అలాగే సోడియం శాతమూ అధికంగా ఉంటుంది. మద్యంతోపాటు వీటిని తినడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్‌ ప్రమాదాలు పెరుగుతాయి.

మసాలా ఆహారాలు :

కొందరు మద్యంతోపాటుగా బిర్యానీలు, స్పైసీ ఆహారాలను తింటూ ఉంటారు. అందువల్ల అరుగుదల ఇబ్బందులు ఎదురవుతాయి. మరి కొందరు వీటిపై నిమ్మకాయ రసం పిండుకుని మరీ తింటుంటారు. దీని వల్ల పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుంది. పొట్ట లోపలి పొర దెబ్బతింటుంది. అందువల్ల పొట్ట నొప్పి, గ్యాస్‌, కడుపు ఉబ్బరం, అల్సర్‌, వికారం, వాంతుల్లాంటి సమస్యలు తలెత్తుతాయి.

గ్యాస్‌ ఉన్న శీతల పానీయాలు :

కొందరు ఆల్కహాల్‌తో పాటు శీతల పానీయాలు, సోడా లాంటి కార్బోనేటెడ్‌ డ్రింకుల్ని తాగుతూ ఉంటారు. దీని వల్ల శరీరం ఆల్కహాల్‌ని మరింత ఎక్కువగా శోషించుకుంటుంది. దీంతో హ్యాంగోవర్‌ సమస్యలు తీవ్రతరం అవుతాయి.

ఎనర్జీ డ్రింకులు :

ఆల్కహాల్‌తో ఎనర్జీ డ్రింకుల్ని కలిపి తీసుకోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. ఎనర్జీ డ్రింకుల్లో ఎక్కువగా కెఫీన్‌ ఉంటుంది. వీటి వల్ల వచ్చే మత్తు తగ్గగానే మళ్లీ ఇది కావాలని అనిపిస్తూ ఉంటుంది. కాఫీకి ఎలా ఎడిక్ట్‌ అవుతారో అలా మద్యానికీ ఎడిక్ట్‌ అయి మితిమీరిపోయే ప్రమాదాలు ఉంటాయి.

చాక్లెట్లు :

సాధారణంగా డార్క్‌ చాక్లెట్‌ తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అదే గనుక మద్యంతోపాటు చాక్లెట్‌ని తింటే అన్నీ దుష్ప్రభావాలే ఉంటాయి. పేగుల్లో ఉండే పైపొర దెబ్బతింటుంది. దీని వల్ల గ్యాస్ సంబంధిత సమస్యలు తీవ్రతరం అవుతాయి.

బీన్స్‌, పప్పులు :

బఠానీ జాతికి చెందిన గింజలు, పప్పులను మద్యంతో కలిపి తీసుకోకపోవడమే మంచిది. రెండు వ్యతిరేక లక్షణాలు ఉన్న ఆహారాలు కలవడం వల్ల శరీరానికి తీవ్రమైన ఇబ్బందులు తలెత్తుతాయి. సాధారణంగానే ఈ బీన్స్‌, పప్పుల్లో పీచు పదార్థాలు, ఐరన్‌ అధికంగా ఉంటాయి. అందువల్ల అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. మద్యంతోపాటు వీటిని తీసుకోవడం వల్ల జీర్ణ కోశంలో మరింత ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి ఈ ఆహారాలను మద్యంతో కలిపి తీసుకోకూడదు.

Whats_app_banner