Kolkata Style Chicken Biryani : కోల్‌కతా స్టైల్ చికెన్ బిర్యానీ.. ఇలా చేసేయండి..
Kolkata Style Chicken Biryani : చికెన్ బిర్యానీ అనగానే హైదరాబాద్ గుర్తుకువస్తుంది. అయితే కోల్‌కతా స్టైల్ చికెన్ బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా? చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో తెలుసుకుందాం..
బిర్యానీ పేరు వినగానే.. నోటిలో వెంటనే నీళ్లు వస్తాయి. హైదరాబాద్ బిర్యానీ అయితే చాలా ఫేమస్. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కోల్‌కతాలో చికెన్ బిర్యానీ కూడా ప్రసిద్ధి చెందింది. కోల్‌కతా చికెన్ బిర్యానీ తయారీ విధానం చూద్దాం.
పెద్ద ముక్కలుగా కట్ చేసిన ఒక కేజీ చికెన్ తీసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ఆవాల నూనె, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, 4 టేబుల్ స్పూన్ల చిక్కటి పెరుగు, ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా జోడించాలి. చెంచా కారం పొడి, చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. దానిని మూతపెట్టి 30 నిమిషాలు పక్కన పెట్టండి.
స్టవ్ మీద పాత్ర పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల వంటనూనె, ఉల్లిపాయను చిన్న ముక్కలుగా చేసి వేయించాలి. ఈ ఉల్లిపాయలను తీసి పక్కన పెట్టండి. తర్వాత సగం కట్ చేసిన బంగాళదుంప ముక్కలను కొద్దిగా నూనె వేసి చిటికెడు ఉప్పు, పసుపు-మసాలా పొడి వేసి 2 నిమిషాలు వేయించాలి. తర్వాత ఈ బంగాళదుంప ముక్కలను తీసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు అదే పాత్రలో లవంగాలు, యాలకులు, మరిన్ని తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించాలి. మూతపెట్టిన ఉంచిన చికెన్ ను వేసి కాసేపు వేయించాలి. తర్వాత అప్పుడు కొద్దిగా నీరు పోయాలి. తర్వాత పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను వేయాలి. ఒక టేబుల్ స్పూన్ కీవ్రా వాటర్, ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసి 20 నిమిషాలు తక్కువ మంటలో ఉడికించాలి.
తర్వాత స్టౌ మీద మరో పాత్ర వేడి చేసి అందులో లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకులు వేయాలి. అందులో చిటికెడు నల్ల జీలకర్ర, అర చెంచా అల్లం పేస్ట్ వేసి 3 నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత ఆ నీటిలోని పదార్థాలన్నీ తీసేయాలి. ఇప్పుడు అదే నీటిలో బాస్మతి బియ్యాన్ని వేసి మూత పెట్టి ఉడికించాలి.
ఇప్పుడు చికెన్ ఉడికిన పాత్ర మూత తీసి ముందుగా చేసుకున్న ఉల్లిపాయలను వేయాలి. అనంతరం బియ్యం వేసుకోవాలి. బియ్యాన్ని ఎక్కువగా కదిలించవద్దు. పైన వేయాల్సి ఉంటుంది. ఒక టేబుల్ స్పూన్ కీవ్రా నీరు, నెయ్యి, కుంకుమపువ్వు నీరు, వేయించిన ఉల్లిపాయ ముక్కలను అన్నం మీద వేసి మూతపెట్టి 35 నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించాలి. తర్వాత బాగా మిక్స్ చేస్తే కోల్‌కతా స్టైల్ బిర్యానీ రెడీ.