Dondakaya Pachadi: దొండకాయ పచ్చడి ఇలా చేసుకున్నారంటే స్పైసీగా అదిరిపోతుంది, రెసిపీ ఎలాగో తెలుసుకోండి
Dondkaya Pachadi: దొండకాయ కూర నచ్చకపోతే దొండకాయ పచ్చడి ప్రయత్నించండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. ముఖ్యంగా రోట్లో రుబ్బుకుంటే ఆ రుచే వేరు
దొండకాయ కూర ఇష్టం లేకపోతే ఒకసారి దొండకాయ పచ్చడిని ప్రయత్నించండి. ముఖ్యంగా రోట్లో ఈ పచ్చడిని ప్రయత్నిస్తే సహజ సిద్ధమైన రుచితో ఇది వస్తుంది. మిక్సీ కన్నా రోట్లో చేసిన పచ్చళ్ళు ఎంత రుచిగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దొండకాయలను కాస్త లేతవిగా ఉన్నవి తీసుకుంటే ఈ పచ్చడి అదిరిపోతుంది. దొండకాయ రోటి పచ్చడి రెసిపీ కింద ఇచ్చాము. స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోండి.
దొండకాయ పచ్చడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు
దొండకాయలు - పావు కిలో
చింతపండు - నిమ్మకాయ సైజులో
కొత్తిమీర తరుగు - అరకప్పు
నూనె - సరిపడినంత
ఉప్పు - రుచికి సరిపడా
పచ్చిమిర్చి - పది
కరివేపాకులు - గుప్పెడు
జీలకర్ర - రెండు స్పూన్లు
శనగపప్పు - రెండు స్పూన్లు
మినప్పప్పు - రెండు స్పూన్లు
ఆవాలు - రెండు స్పూన్లు
నూనె - సరిపడినంత
ఇంగువ - చిటికెడు
ఎండుమిర్చి - రెండు
మెంతులు - పావు స్పూను
దొండకాయ పచ్చడి రెసిపీ
1. దొండకాయలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. ఆ నూనెలో మెంతులు, ఒక స్పూను జీలకర్ర, కరివేపాకులు, ఇక స్పూను శనగపప్పు,ఒక స్పూను మినప్పప్పు, ఒక స్పూను ఆవాలు వేసి వేయించుకోవాలి.
3. వాటిని పొడిలా చేసి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు అదే కళాయిలో రెండు స్పూన్ల నూనె వేసి దొండకాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి బాగా మగ్గించుకోవాలి.
5. అరగంట పాటు చిన్న మంట మీద మగ్గిస్తే దొండకాయలు మంచిగా ఉడుకుతాయి.
6. అందులో చింతపండును కూడా వేసి కాసేపు మగ్గించండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి.
7. ఈ మొత్తం మిశ్రమాన్ని చల్లార్చి రోట్లో వేసి దంచండి.
8. ముందుగా చేసుకున్న పొడిని కూడా వేసి రుచికి సరిపడా ఉప్పును వేసి ఒకసారి కలపండి.
9. అలాగే కొత్తిమీరను కూడా వేసి మెత్తగా రుబ్బుకోండి.
10. ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకోండి.
11. దీనికి తాలింపు వేసేందుకు స్టవ్ మీద చిన్న కళాయి పెట్టి నూనె వేయండి.
12. అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి ఇంగువ వేసి వేయించి పచ్చడి పైన వేసుకోండి.
13. దాన్ని ఒకసారి స్పూన్ తో కలుపుకోండి. అంతే టేస్టీ రోటి పచ్చడి రెడీ అయినట్టే. ఇది చాలా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఈ స్పైసీ దొండకాయ పచ్చడి వేసుకొని తింటే ఆ రుచే వేరు.
దొండకాయలో మనం శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి. విటమిన్ బి1, ఫైబర్, క్యాల్షియం, ఐరన్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు, రక్తంలో చక్కర స్థాయిలను పెంచే గుణాలు దొండకాయలో ఎక్కువ. కాబట్టి వీటిని తరచు ఆహారంలో భాగం చేసుకోవాలి. దొండకాయను తినేవారిలో గుండె సమస్యలు కూడా తక్కువగా వస్తాయి. పొట్ట సంబంధిత సమస్యలు కూడా తగ్గించడంలో దొండకాయ ముందుంటుంది. ఇంట్లో రోలు లేకపోతే మిక్సీలోనే దీన్ని చేసుకోవచ్చు.