Gutti Dondakaya Recipe: గుత్తి వంకాయలాగే గుత్తి దొండకాయ రెసిపీ ఇలా చేయండి, రెసిపీ చాలా సులువు
Gutti Dondakaya Recipe: గుత్తి వంకాయ కూర ఎంతో మందికి ఫేవరెట్. గుత్తి వంకాయలాగే గుత్తి దొండకాయల కూర కూడా వండొచ్చు. దీన్ని చేయడానికి అరగంట సమయం సరిపోతుంది.
Gutti Dondakaya Recipe: దొండకాయలతో కూరలు, ఫ్రైలు తప్ప ఏమీ చేయలేం అనుకుంటారు. ఒకసారి గుత్తి వంకాయలాగే గుత్తి దొండకాయ కర్రీ ప్రయత్నించండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చేశారంటే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఈ గుత్తి దొండకాయను వేడివేడి అన్నంలో కలుపుకుంటే రుచి అదిరిపోతుంది.
గుత్తి దొండకాయ రెసిపీకి కావలసిన పదార్థాలు
దొండకాయలు - అరకిలో
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు - పావు స్పూను
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
కొబ్బరి తురుము - రెండు స్పూన్లు
నువ్వులు - ఒకటిన్నర స్పూను
ధనియాలు - ఒకటిన్నర స్పూను
జీలకర్ర - ఒక స్పూను
ఎండుమిర్చి - మూడు
శెనగపప్పు - రెండు స్పూన్లు
ఆవాలు - అర స్పూను
ఇంగువ - చిటికెడు
కరివేపాకులు - గుప్పెడు
నూనె - తగినంత
గుత్తి దొండకాయ రెసిపీ
1. గుత్తి దొండకాయ కూర కోసం కాస్త పొడవుగా ఉన్న దొండకాయలను ఎంచుకోవాలి.
2. వంకాయని ఎలా అయితే మధ్యలో నాలుగు చీలికలుగా చేస్తామో... ప్రతి దొండకాయను అలా నాలుగు చీలికలుగా చేసుకోవాలి.
3. కానీ దొండకాయ ముక్కలుగా మాత్రం విడిపోకూడదు.
4. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టి నూనె వేయాలి.
5. అందులో ధనియాలు, జీలకర్ర, సెనగపప్పు వేసి వేయించాలి.
6. చిన్న మంట మీద వేయిస్తే మంచిది. లేకపోతే ఇది త్వరగా మాడిపోతాయి.
7. అందులోనే నువ్వులు, ఎండుమిర్చి కూడా వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
8. ఈ మొత్తం వేయించిన దినుసులు అన్నింటినీ మిక్సీ జార్లో వేయాలి.
9. అలాగే కొబ్బరి తురుమును వేసి పొడిలా రుబ్బుకోవాలి.
10. ఈ పొడిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ముందుగా చీలికలుగా చేసుకున్న దొండకాయలను మధ్యలోకి ఈ పొడిని స్టఫ్ చేసి పక్కన పెట్టాలి.
11. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
12. ఆ నూనెలో ఆవాలు వేసి చిటపటలాడించాలి.
13. అలాగే పసుపు, ఇంగువ కూడా వేయాలి.
14. కరివేపాకులు వేసి వేయించాలి. ఇప్పుడు స్టవ్ మంట తగ్గించి స్టఫ్ చేసుకున్న దొండకాయలను వేసి చిన్న మంట మీద మూడు నిమిషాల పాటు ఉడికించాలి.
15. పైన మూత పెట్టడం మర్చిపోవద్దు. తర్వాత ఒకసారి మూత తీసి కళాయి తో పాటు ఇటూ అటూ కదిలించుకోవాలి.
16. మళ్లీ మూత పెట్టి చిన్నవంట మీద 20 నిమిషాలు పాటు ఉడికించుకోవాలి.
17. దొండకాయలు అన్ని వైపులా బాగా ఫ్రై అయ్యేదాకా ఉంచుకోవాలి.
18. ఆ తర్వాత పైన కొత్తిమీరను జల్లుకోవాలి.
19. టేస్టీ గుత్తి దొండకాయ రెసిపీ రెడీ అయినట్టే.
20. దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే రుచి అదిరిపోతుంది.
21. చపాతీ, రోటీతో దీన్ని తినవచ్చు. మీ ఇంట్లో నువ్వులు లేకపోతే వేరుశెనగ పలుకులను వేసుకోండి.
22. ఎండు కొబ్బరి పొడిని మాత్రం ఖచ్చితంగా ఈ రెసిపీలో వాడండి. అదే ఎక్కువ రుచిని అందిస్తుంది.
దొండకాయలను ఇష్టంగా తినని వారికి ఇలాంటి రెసిపీలను పెడితే వారు తినే అవకాశం ఉంటుంది. గుత్తి వంకాయతో పోలిస్తే గుత్తి దొండకాయ త్వరగా ఉడికేస్తుంది. ఒక్కసారి మీరు ప్రయత్నించి చూడండి. మీకు నచ్చడం ఖాయం. దొండకాయల్లో పోషకాలు ఎక్కువగానే ఉంటాయి. ఈ రెసిపీలో మనం వినియోగించిన పదార్థాలు అన్నీ కూడా మన ఆరోగ్యానికి మేలు చేసేదే. కాబట్టి తినడం వల్ల ఆరోగ్యానికి అంతా మేలే జరుగుతుంది.
టాపిక్