Dreams in kids: చిన్న పిల్లలకు కలలు వస్తాయా? నిద్రలో ఏడవడానికి కారణం అదేనా?-does children get dreams in sleep know the reason for their crying ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Dreams In Kids: చిన్న పిల్లలకు కలలు వస్తాయా? నిద్రలో ఏడవడానికి కారణం అదేనా?

Dreams in kids: చిన్న పిల్లలకు కలలు వస్తాయా? నిద్రలో ఏడవడానికి కారణం అదేనా?

Koutik Pranaya Sree HT Telugu
Aug 17, 2024 06:39 PM IST

Dreams in kids: చిన్న పిల్లలు నిద్రలో ఉన్నట్టుండి ఉలిక్కిపడతారు. ఒక్కసారిగా గట్టిగా గుక్కపెట్టి ఏడుస్తారు. వెంటనే మన మనసులో ఏదైనా పీడకల వచ్చి భయపడుతున్నారేమో అనుకుంటాం. మరి నిజానికి వాళ్లకు కలలు వస్తాయా? నిద్రలో ఏడవడానికి కారణం ఏంటో తెల్సుకోండి.

చిన్నపిల్లలకు కలలు వస్తాయా?
చిన్నపిల్లలకు కలలు వస్తాయా? (freepik)

చిన్న పిల్లలు నిద్రలో నుంచి ఉన్నట్లుండి ఏడుస్తూ లేవగానే దేనికైనా భయపడ్డారా, లేదా ఏమైన కలగన్నారా అనిపిస్తుంది. ఏదైనా పీడకల వచ్చి ఏడుస్తున్నారేమోనని సందేహపడతాం. మరి నిజానికి వాళ్లకు కలలు వస్తాయా? ఏ వయసు నుంచి కలలు రావడం మొదలవుతుందో వివరంగా తెల్సుకోండి. వాళ్లు నిద్రలో ఉక్కపట్టి ఏడవడానికి కారణాలూ తెల్సుకోండి.

పిల్లలు తొందరగా గాఢ నిద్రలోకి జారుకుంటారు. కానీ నిద్ర మధ్యలో ఉన్నట్లుండి లేచి కేకలు పెట్టుకుంటూ ఏడుస్తారు. వాళ్ల ఏడుపు చూస్తే దేనికైనా భయపడ్డారా, ఇంకేమైనా అయ్యిందా అనిపిస్తుంది. కొన్నిసార్లు ఏమైనా పీడకల వచ్చి భయపడ్డారనీ అనుకుంటాం. మనకు పీడకల వస్తే మనం లేచే సరికి చెమటలు పట్టేసి, ఆందోళనగా కనిపిస్తాం. తర్వాత అది అబద్దమని తెల్సుకుంటాం. రిలాక్స్ అయిపోతాం. కానీ పిల్లలకు కలలు వస్తే వాళ్లకది నిజమా, అబద్దమా అని తెల్సుకునేంత పరిపక్వత కూడా ఉండదు.

కలలు వస్తాయా?

మనకు వచ్చే కలల్లో చాలా విచిత్రమైన సంఘటనలు ఉంటాయి. ఏవేవో చిక్కుముళ్లుంటాయి. ఒక్కోసారి పెద్ద పెద్ద ట్విస్టులున్న సినిమాలాంటి కలలూ వస్తుంటాయి. మనకొచ్చిన కలను సినిమా లాగా తీస్తే సూపర్ హిట్టే అనిపిస్తుంది. మనకు అంత ఆలోచనా శక్తి, పరిపక్వత ఉన్నాయి కాబట్టి అలాంటి కలలు వస్తాయి. చిన్న పిల్లలకు ఆ సామర్థ్యం ఉండదు. ఊహాశక్తి ఉండదు. క్లిష్టమైన పరిస్థితుల్ని సృష్టించే శక్తి వాళ్ల మెదడుకు ఉండదు కాబట్టి వాళ్లకు కలలు రావు. మనకొచ్చే కలలు మన ఆలోచనల నుంచే వస్తాయి. మనం రోజూవారీ ఎదుర్కొన్న ఒత్తిడి, సమస్యల ప్రభావం కూడా మనకొచ్చే కలల మీద ఉంటుంది. మనిషి వ్యక్తిత్వం బట్టి వాళ్లకొచ్చే కలలు మారతాయి. చిన్నపిల్లలకు ఇంకా ఒక సొంత వ్యక్తిత్వం (క్యారెక్టర్) ఏర్పడదు. కాబట్టి చిన్న పిల్లలకు కలలు అసలే రావు.

ఎందుకు ఏడుస్తారు?

పిల్లలు నిద్ర మధ్యలో లేచి ఏడవడానికి చాలా కారణాలుండొచ్చు. నెలల వయసు నుంచి సంవత్సరం వయస్సున్న పిల్లలు ఆకలి వల్ల, డైపర్ తడవడం వల్ల, బాగా అలిసిపోవడం వల్ల, ఇంకేదైనా అసౌకర్యం వల్ల ఏడవచ్చు. లేదా ఒక్కోసారి వాళ్లకు మెలకువ వచ్చాక మళ్లీ నిద్రలోకి జారుకోవడం తెలీదు. అప్పుడు నిద్ర రాక కూడా ఏడుస్తారు.

ఏ వయసు నుంచి కలలు వస్తాయి?

మూడు లేదా నాలుగు సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న పిల్లలకు కలలు రావు. వాళ్లను భయపెట్టే కలలు అంతకన్నా రావు. ఎందుకంటే వాళ్లను భయపెట్టేవేంటో వాళ్లకు అప్పటిదాకా తెలీదు. చీకటి, దెయ్యం, ఏదైనా ప్రమాదం, భయపెట్టే జంతువులు.. ఇలాంటివేమీ వాళ్లకు తెలీదు. కాబట్టి భయపెట్టే కలలొచ్చే అవకాశం లేదు. నాలుగేళ్ల తర్వాత పిల్లల ఆలోచనా శక్తి పెరుగుతుంది. సృజనాత్మకంగా ఆలోచిస్తారు. అలాగనీ ఈ వయసులో కూడా పెద్ద పెద్ద సన్నివేశాలున్న కలలు రావు. ఫోటోల్లాగా, వాళ్ల చూసిన వస్తువులు, మనుషులు కనిపించొచ్చని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. వాళ్ల వయసు పెరిగే కొద్దీ వాళ్లకు వచ్చే కలల్లో, కలల రకాల్లో మార్పు వస్తూ ఉంటుంది.

టాపిక్