Doorway Effect | ఏం వెతుకుతున్నారో మరచిపోతున్నారా? దానికి కారణం ఇదే!-do you know about the doorway effect and why it triggers ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Doorway Effect | ఏం వెతుకుతున్నారో మరచిపోతున్నారా? దానికి కారణం ఇదే!

Doorway Effect | ఏం వెతుకుతున్నారో మరచిపోతున్నారా? దానికి కారణం ఇదే!

Hari Prasad S HT Telugu
May 03, 2022 04:26 PM IST

Doorway Effect.. మనం ఏదో ఒక పని చేస్తూ ఉంటాం. సడెన్‌గా ఇంకేదో గుర్తుకు వస్తుంది. దాని కోసం మనం మరో గదిలోకి వెళ్తాం. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత అసలు అక్కడికి ఎందుకు వచ్చాం? దేని కోసం వెతుకుతున్నామో కూడా మరచిపోతాం. ఏం చేస్తున్నామో తెలియదు. ఇలాంటి అనుభవం మీకెప్పుడైనా ఎదురైందా?

ఒక గది నుంచి మరో గదికి వెళ్లినప్పుడు జరిగే మెమరీ లాసే Doorway Effect
ఒక గది నుంచి మరో గదికి వెళ్లినప్పుడు జరిగే మెమరీ లాసే Doorway Effect (Pexels )

ఒకవేళ అయినా, కాకపోయినా, భవిష్యత్తులో ఎదురైనా.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యే అనుభవమే ఇది. దీనికే సైంటిస్టులు Doorway Effect అనే పేరు పెట్టారు. అంతేకాదు అసలు ఇలా జరగడం వెనుక ఉన్న కారణాన్ని కూడా విశ్లేషించారు. మరి అదేంటో ఓసారి చూసేద్దామా?

ఏంటీ Doorway Effect?

మనుషులు సాధారణంగా రోజూ చేసే పనులను చాలా సులువుగా చేసేస్తుంటారు. దానికోసం ప్రత్యేకంగా మెదడు పెట్టి చేయాల్సిన అవసరం ఉండదు. కానీ కొన్నిసార్లు రోజూ చేసే పనులు చేసే సమయంలోనూ మెదడు పని చేయదు. అసలు ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితి తలెత్తుంది. ఏం వెతుకుతున్నామో కూడా అర్థం కాదు. అయితే మనలో చాలా మంది ఇది మామూలే కదా అని అనుకుంటారు. ఏదైనా ముఖ్యమైన పని చేస్తున్న సమయంలో ఇలాంటి చిన్న చిన్న పనులు మరచిపోవడం సహజమే అనీ భావిస్తారు. 

కానీ సైకాలజిస్టులు దీనిని డోర్‌వే ఎఫెక్ట్‌గా పిలుస్తున్నారు. ముఖ్యంగా మనం ఒక గది నుంచి మరో గదికి వెళ్లిన సమయంలో మన మెదడు కొన్ని స్వల్పకాలిక జ్ఞాపకాలను మరచిపోతుంది. ఈ డోర్‌వే ఎఫెక్టే ఇప్పుడు మనిషి మెదడు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది.

డోర్‌వే ఎఫెక్ట్‌,, ఎందుకిలా జరుగుతుంది?

రోజూ మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. ఒక పని నుంచి మరో పని పైకి మనం మన దృష్టి మారుతూనే ఉంటుంది. ఇందులో రోజూ మన ప్రమేయం లేకుండా జరిగిపోయే పనులు ఎన్నో ఉంటాయి. ఉదాహరణకు ఓ డ్రైవర్‌ ఉన్నారనుకుందాం. ఆ వ్యక్తి పని రోజూ వాహనాలు నడపడమే. ఈ పని అతడు చాలా సులువుగా చేసేస్తుంటాడు. పాటలు వింటూ, పక్కవాళ్లతో మాట్లాడుతూ.. గేర్లు మార్చడం, స్టీరింగ్‌ తిప్పడం, బ్రేకులు వేయడం చేస్తుంటాడు. ఈ పనులు చేయడానికి ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అసవరం లేదు. 

కానీ ఏదైనా సడెన్‌గా ఊహించని ఘటన జరిగినప్పుడో, ట్రాఫిక్‌ చాలా ఎక్కువగా ఉన్న సమయంలో.. అదే డ్రైవర్‌ ఈ పనులనే ఎంతో ఏకాగ్రతతో చేయాల్సి వస్తుంది. ఇలా మన ఏకాగ్రతను ఒక స్థాయి నుంచి మరో స్థాయికి తీసుకెళ్లిన సమయంలోనే ఈ డోర్‌వే ఎఫెక్ట్‌ కలుగుతుందని సైకాలజిస్టులు చెబుతున్నారు. మన జ్ఞాపకశక్తి, మన చుట్టూ ఉన్న పరిసరాలకు కూడా ఈ డోర్‌వే ఎఫెక్ట్‌ను ముడిపెట్టిన సిద్ధాంతాలు కూడా ఉన్నాయి.

మెదడు.. కొన్ని కొత్త విషయాలు

ఈ డోర్‌వే ఎఫెక్ట్‌పై జరిపిన పరిశోధనలు మనిషి మెదడు గురించి కొన్ని తెలియని విషయాలను బయటపెట్టాయి. మెదడు గురించి మొదట్లో జరిపిన అధ్యయనాలకు తాజాగా జరిగిన వాటికి స్పష్టమైన తేడాలు ఉన్నట్లు గుర్తించారు. మెదడుపై తొలినాళ్లలో జరిగిన అధ్యయనాలను బట్టి.. మెదడులో జ్ఞాపకాలు వివిధ భాగాలుగా స్టోర్‌ అయి ఉంటాయి. 

ఇవి ఎప్పటికీ అలాగే ఉంటూ అవసరమైనప్పుడు గుర్తుకు వస్తాయి అని పరిశోధకులు భావించారు. అయితే తాజా అధ్యయనాలు మాత్రం ఇది నిజం కాదని, మన జీవితం మొత్తం మన మెదడు ఎలా మారుతూ ఉంటుందో కళ్లకు కట్టాయి. మన జ్ఞాపకాలు స్పష్టంగా ఉండవని, ఒక ఘటన గురించి ఒక్కో వ్యక్తి జ్ఞాపకం ఒక్కో రకంగా ఉంటుందని తేలింది.

యూనివర్సిటీ ఆఫ్‌ నోట్రెడామ్‌లో ఈ మధ్య జరిపిన ఓ అధ్యయనం గురించి ఇప్పుడు చూద్దాం. ఈ అధ్యయనంలో భాగంగా కంప్యూటర్‌ గేమ్‌తోపాటు నిజ జీవితంలో డోర్‌వే ఎఫెక్ట్‌ ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తేల్చారు. మొదట ఇందులో పాల్గొన్న పార్టిసిపెంట్స్‌తో ఓ వీడియో గేమ్‌ ఆడించారు. ఈ గేమ్‌లో మొత్తం 55 గదులు ఉంటాయి. కొన్ని గదుల్లో ఒక టేబుల్‌, మరికొన్ని గదుల్లో రెండు టేబుల్స్‌ ఉంటాయి. ఈ టేబుళ్లపై పెన్సిల్‌, ఎరేజర్‌ వంటి వివిధ ఐటెమ్స్‌ ఉంచారు. 

కీబోర్డ్‌లో ఉండే యారో కీస్‌ ఉపయోగించి ఒక టేబుల్‌పై నుంచి ఒక ఐటెమ్‌ను తీసుకొని మరో టేబుల్‌పై పెట్టాలి. అక్కడి నుంచి మరో ఐటెమ్‌ తీసుకొని ఇంకో టేబుల్‌పై ఉంచాల్సిందిగా పార్టిసిపెంట్స్‌కు చెప్పారు. ఇలా ఒక టేబుల్‌పై నుంచి తీసిన వస్తువులు ఆ తర్వాత కనిపించకుండా పోతాయి. ఈ టాస్క్‌లో భాగంగా కొన్నిసార్లు పార్టిసిపెంట్స్‌ ఒకే గదిలో మరో చోటుకి వెళ్లాల్సి రాగా.. కొన్నిసార్లు ఓ గది నుంచి మరో గదికి వెళ్లాల్సి వచ్చింది.

కొత్తవి వచ్చి చేరతాయి..

ఇలా ఓ గది నుంచి మరో గదికి వెళ్లిన సమయంలో వాళ్ల జ్ఞాపకశక్తిని గుర్తించేందుకు చిన్న టెస్ట్‌ కూడా నిర్వహించారు. అయితే ఓ గది నుంచి మరో గదికి వెళ్లిన సమయంలో వాళ్ల జ్ఞాపకశక్తి ఎలా తగ్గిపోయిందో ఈ టాస్క్‌లో పరిశోధకులు గుర్తించారు. ఇదే టాస్క్‌ను నిజ జీవితంలోనూ ఆ పార్టిసిపెంట్స్‌కు ఇచ్చారు. ఆశ్చర్యకరంగా ఇక్కడే అవే ఫలితాలు వచ్చాయి. దీనినిబట్టి కొన్ని జ్ఞాపకాలు మనకు సులువుగా అందుబాటులో ఉన్నా కూడా అవి త్వరగా మన మొమెరీ నుంచి వెళ్లిపోతాయని పరిశోధకులు తేల్చారు. ఇలా వెళ్లిపోయిన జ్ఞాపకాల స్థానంలో కొత్తవి వచ్చి చేరతాయనీ గుర్తించారు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్