Diwali 2022 Decoration Ideas| ఈ దీపావళికి మీ ఇల్లు జిగేల్‌మనేలా ఇలా అందంగా అలంకరించుకోండి!
Diwali 2022 Decoration Ideas: దీపావళి పండగ రోజున ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు అందంగా అలంకరించుకోవడం కూడా ముఖ్యమే. ఎలా అలంకరించుకోవచ్చో ఇక్కడ కొన్ని ఐడియాలు చూడండి.
దీపావళి ఎంతో మంది ఇష్టపడే హిందూ పండుగలో ఒకటి. ఇది వెలుగుల పండగ కాబట్టి, దీపావళి వస్తుందంటే కొన్ని రోజుల ముందు నుంచే నగరాలలోని షాపింగ్ కాంప్లెక్సులు జిగేల్ మనిపించే దీపాల వెలుగులతో ప్రజలను ఆకర్షిస్తాయి. అంతటా రంగురంగుల లైట్లు, అలంకరణలతో రాత్రుళ్లు అద్భుతంగా కనిపిస్తాయి. ఈ పండుగ చెడుపై మంచి సాధించిన విజయం, చీకటి పోయి కొత్త వెలుగు రావటాన్ని సూచిస్తుంది. అందుకే దీపావళి అలంకరణలు వెలుగుల జీవితాన్ని నొక్కి చెబుతాయి.
సంస్కృతంలో దీపావళి అంటే దీపాల వరుస అనే అర్థం వస్తుంది. దీపావళి నాడు వరుస క్రమంలో దీపాల అలంకరణలు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. దీపావళి కోసం ప్రజలు తమ ఇళ్లను శుభ్రపరుచుకొని, దీపాలు, రంగోలీలతో అలంకరించుకుంటారు. ఇంటికి శ్రేయస్సు, ఐశ్యర్యం, శాంతి కోరుతూ లక్ష్మీ పూజలు నిర్వహిస్తారు. కొత్త బట్టలు ధరించి సాయంత్రం వేళ పటాకులను కాలుస్తూ సంబరాలు చేసుకుంటారు.
Diwali 2022 Decoration Ideas- దీపావళి అలంకరణ
మీరూ ఈ దీపావళికి మీ ఇంటిని అందంగా అలంకరించుకోవాలని చూస్తే, ఇక్కడ కొన్ని అలంకరణ ఐడియాలు మీకు అందిస్తున్నాం. ఈ చిట్కాలతో మీ ఇళ్లు దీపాల వెలుగులతో ప్రత్యేకంగా నిలుస్తుంది.
పూలతో అలంకరణ
హిందూ పండగ ఏదైనా అలంకరణలో పువ్వులు కచ్చితంగా ఉండాలి. ఈ దీపావళికి ఇంటిని లక్ష్మీ దేవి సందర్శిస్తుందని నమ్ముతారు కాబట్టి, ద్వారాల వద్ద తాజా పూలు, పూల మాలలతో ఆహ్వానం పలకండి. అందమైన పసుపు, ఎరుపు, నారింజ రంగుల మేళవింపుతో జెర్బెరాస్ పువ్వులు, గుబాలించే గులాబీలు, మైమరిపించే బంతి, చామంతి పూలతో మీ గుమ్మాలను అలంకరించండి. గుమ్మం ముందు అందంగా పేర్చండి, వాటి మధ్యలో దీపాలను ఉంచండి.
రంగురంగుల కొవ్వొత్తులు
ఇప్పుడు మార్కెట్లో ఆనేక రకాల వైబ్రెంట్ కొవ్వొత్తులు వివిధ ఆకారాలు, పరిమాణాలు, రంగులలో అందుబాటులో ఉన్నాయి. ఇవి అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. ఈ దీపావళి రోజున చూసేవారిని మంత్రముగ్ధులను చేసేలా కొవ్వొత్తులను ఉపయోగించడానికి మూడు విభిన్న పద్ధతులు ఉన్నాయి. అద్భుతమైన విజువల్ ట్రీట్ కోసం, డిజైన్ కొవ్వొత్తులను ఉపయోగించండి, ఇంటి మూలలను ప్రకాశవంతం చేయడానికి రంగురంగుల కొవ్వొత్తులను ఉపయోగించండి లేదా స్టైలిష్‌గా చెక్కిన చిక్ క్యాండిల్ బర్నర్‌లను ఉపయోగించండి. కొన్ని క్యాండిల్స్ సువాసనలు కూడా వెదజల్లుతాయి. వీటిని ఇంటి బాల్కనీ, కారిడార్లలో, గుమ్మం ముందు ఉంచితే ఆ ప్రాంతం అంతా వెలుగులతో పాటు గుబాళింపులు ఉంటాయి.
లాంతర్లతో సృజనాత్మకత
సృజనాత్మకంగా ఇంటిని అలంకరించుకోవాలంటే లాంతర్లు అద్భుతంగా ఉంటాయి. ఖాళీ గాజు కూజాను లాంతరుగా ఉపయోగించవచ్చు. వాటిని మరింత సృజనాత్మకంగా చేయడానికి వాటిపై మీ స్వంత డిజైన్లను గీయవచ్చు. దీపం లేదా కృత్రిమ లైట్లు లోపల ఉంచవచ్చు. మీరు మీ ఇంటి అల్మారాలు లేదా బాల్కనీని అలంకరించేందుకు ఈ సుందరమైన గాజు కూజా లాంతర్లను ఉపయోగిస్తే ప్రత్యేకంగా కనిపిస్తాయి.
ఫెయిరీ లైట్లు
ఇంటి ముఖభాగాన్ని అలంకరించడానికి ఫెయిరీ లైట్లు చాలా చక్కగా కనిపిస్తాయి. మార్కెట్లో తక్కువ ధరకే ఫెయిరీ లైట్లు వివిధ రంగుల్లో లభ్యమవుతున్నాయి. వీటిని తీగలాగా చుట్టవచ్చు, ఎక్కడైనా సౌకర్యంగా వేలాడ దీయవచ్చు. పూల కుండీలపై నుంచి పూజ గదుల వరకు, బంగ్లాపై నుంచి బాల్కానీ వరకు ఎక్కడైనా వేలాడదీయవచ్చు. ఇలాంటి దీపావళి అలంకరణతో అద్భుతం చేయవచ్చు.
లోహ వస్తువులతో ప్రత్యేకత
పురాతన లోహ వస్తువులు సంప్రదాయంగా కనిపిస్తాయి. దీపావళి గృహాలంకరణతో ప్రయోగాలు చేయడానికి మీకు ఇదే అవకాశం. మీ ఇంట్లో ఏవైనా లోహపు వాస్తువులు ఉంటే వాటిని ఇంటి మూలల్లో ఉంచి వాటిపై కొవ్విత్తులు వెలిగించవచ్చు, లోహపు పాత్రల్లో నీటిని నింపి, పువ్వులు పరిచి అందులో దీపాలను ఉంచవచ్చు.
ఈ దీపాల పండగ మీ కుటుంబంలో వెలుగులు నింపాలని కోరుకుంటూ మీకు ముందస్తుగా ఈ దీపావళి శుభాకాంక్షలు. ఈ పండగను ఆనందంగా, సురక్షితంగా జరుపుకోండి.
సంబంధిత కథనం