Decoction | చాయ్‌వాలా సక్సెస్‌ స్టోరీ.. సెంచరీ మార్క్‌ దాటిన 'డికాక్షన్‌'-decoction reaches 100 outlets mark in less than one and half year ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Decoction | చాయ్‌వాలా సక్సెస్‌ స్టోరీ.. సెంచరీ మార్క్‌ దాటిన 'డికాక్షన్‌'

Decoction | చాయ్‌వాలా సక్సెస్‌ స్టోరీ.. సెంచరీ మార్క్‌ దాటిన 'డికాక్షన్‌'

Hari Prasad S HT Telugu
Feb 28, 2022 02:35 PM IST

కరోనా కారణంగా ఎన్నో కోట్ల మందిలాగే వాళ్లు కూడా ఇబ్బంది పడ్డారు. కానీ ఆ సంక్షోభంలోనే కొత్త దారి వెతుక్కున్నారు. సింగింగ్‌ కెరీర్‌ వదిలి చాయ్‌వాలా అవతారమెత్తి సక్సెస్‌ సాధించారు.

<p>డికాక్షన్ డైరెక్టర్లు జయకిరణ్, సంతోషి</p>
డికాక్షన్ డైరెక్టర్లు జయకిరణ్, సంతోషి

హైదరాబాద్‌: డికాక్షన్‌.. చాయ్‌ అంటే ఎంతగానో ఇష్టపడే హైదరాబాదీలు ఇష్టపడి అక్కున చేర్చుకున్న టీ బార్‌ ఇది. కరోనా కష్టాల నుంచి పుట్టిన సక్సెస్‌ స్టోరీ ఇది. ప్రారంభించిన ఏడాదిన్నరలోనే 100 ఔట్‌లెట్ల మార్క్‌ దాటి దూసుకెళ్తోంది డికాక్షన్‌. కాస్త కొత్తగా ఆలోచిస్తే చాలు సంక్షోభాలను కూడా అవకాశాలుగా మలుచుకోవచ్చని నిరూపించారు ఈ డికాక్షన్‌ ఓనర్లు అద్దేపల్లి సంతోషి, జయకిరణ్‌ దంపతులు. 

చాయ్‌తోపాటు కాఫీ, మిల్క్‌షేక్‌లు, స్నాక్స్‌ అందించే డికాక్షన్‌కు ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కలిపి మొత్తంగా 110 ఔట్‌లెట్స్‌ ఉండటం విశేషం. వీటిని వచ్చే ఏప్రిల్‌లోగా 130కి చేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు డికాక్షన్‌ డైరెక్టర్లలో ఒకరైన అద్దేపల్లి సంతోషి. ఒక్క హైదరాబాద్‌లోనే వీళ్లకు 70 ఔట్‌లెట్లు ఉన్నాయి. 

ఇప్పటి వరకూ 80 లక్షల మందికిపైగా కస్టమర్లకు తమ పానీయాలను సర్వ్‌ చేసినట్లు సంతోషి ఎంతో గర్వంగా చెబుతున్నారు. ఒక్కో ఔట్‌లెట్‌ ఇద్దరి నుంచి నలుగురి వరకూ ఉపాధి చూపిస్తుండటం నిజంగా అభినందనీయం.

అలా మొదలైంది..

2020లో ప్రపంచాన్ని తొలిసారి చుట్టుముట్టిన కరోనా మహమ్మారి ఎంతోమంది జీవితాలను తలకిందులు చేసింది. అలాగే సింగర్‌ అయిన అద్దేపల్లి జయకిరణ్‌కు కూడా సింగింగ్‌ అవకాశాలను సంక్లిష్టం చేసింది. అయితే ఆ సమయంలోనే ఈ డికాక్షన్‌ ఐడియా ఆయనకు వచ్చింది. 

2020 మార్చిలో తాము ఈ బిజినెస్‌ ప్రారంభించాలని అనుకున్నట్లు జయకిరణ్‌ చెప్పారు. దీనికీ ఓ కారణం ఉంది. కరోనా సమయంలో వేడి వేడి పానీయాలకు మంచి డిమాండ్‌ ఉండటం గమనించి తాము ఈ టీ బిజినెస్‌ పెట్టాలనుకున్నట్లు కిరణ్‌ తెలిపారు. అక్టోబర్‌ 2020లో తమ తొలి సెంటర్‌ ప్రారంభించారు. భార్య సంతోషి, తాను తొలి మూడు నెలలు చాలానే శ్రమించామని జయకిరణ్‌ చెప్పారు. 

ఆ ఒక్క ఔట్‌లెట్‌ కాస్తా 2021 మార్చి నాటికి 25కు, అదే ఏడాది అక్టోబర్‌ నాటికి 50కి చేరింది. ఆ తర్వాతి 50 ఔట్‌లెట్లను ప్రారంభించడానికి తమకు మూడు నెలలే పట్టిందని జయకిరణ్‌ చెప్పారు. అంతేకాదు అసలు తమ ఓన్‌ సెంటర్‌ ప్రారంభించడానికి ముందే రెండు ఫ్రాంచైజీలు ప్రారంభమైనట్లు కూడా ఆయన చెప్పడం విశేషం. ఇందులో తొలి పది సెంటర్లను జయకిరణ్‌లాగా అవకాశాలు కోల్పోయిన ఆర్టిస్టులే ప్రారంభించగా.. ప్రస్తుతం ఉన్నవాటిలో ఏడు ఔట్‌లెట్లను కేవలం మహిళలే నడిపిస్తున్నారు.

Whats_app_banner