Chicken Nuggets: చికెన్ నగ్గేట్స్ ఇలా సింపుల్‌గా చేసేయండి, చాలా టేస్టీగా ఉంటాయి-chicken nuggets recipe in telugu know how to make this snack ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chicken Nuggets: చికెన్ నగ్గేట్స్ ఇలా సింపుల్‌గా చేసేయండి, చాలా టేస్టీగా ఉంటాయి

Chicken Nuggets: చికెన్ నగ్గేట్స్ ఇలా సింపుల్‌గా చేసేయండి, చాలా టేస్టీగా ఉంటాయి

Haritha Chappa HT Telugu
Mar 30, 2024 03:30 PM IST

Chicken Nuggets: చికెన్ నగ్గెట్స్ పేరు వింటేనే నోరూరిపోతుంది. వీటిని కొనాలంటే ఎక్కువగా ఖర్చు పెట్టాలి. అందుకే ఇంట్లోనే సింపుల్‌గా చేసేయండి. చికెన్ నగ్గెట్స్ రెసిపీ చాలా ఈజీ.

చికెన్ నగ్గెట్స్ రెసిపీ
చికెన్ నగ్గెట్స్ రెసిపీ (Unsplash)

Chicken Nuggets: మల్టీప్లెక్స్ థియేటర్లలో సినిమాలు చూడడానికి వెళ్తే పాప్‌కార్న్‌తో పాటూ ఎక్కువ మంది తినేవి చికెన్ నగ్గెట్స్. వీటి పేరు వింటేనే నోరూరిపోతుంది. క్రిస్పీగా, క్రంచీగా ఉండే చికెన్ నగ్గెట్స్ ఎంత తిన్నా కూడా తినాలనిపిస్తుంది. వీటిని చేయడం చాలా కష్టమేమో అనుకుంటాం... కానీ కాస్త ఓపిక చేసుకుంటే ఇంట్లోనే వీటిని సులువుగా వండేసుకోవచ్చు. వీటి రెసిపీ చాలా సులువు. చికెన్ నగ్గెట్స్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

చికెన్ నగ్గెట్స్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

చికెన్ కీమా - పావు కిలో

అల్లం తరుగు - ఒక స్పూను

వెల్లుల్లి తరుగు - ఒక స్పూను

మిరియాల పొడి - ఒకటిన్నర స్పూను

కారం - ఒక స్పూను

బ్రెడ్ ముక్కలు - నాలుగు

నూనె - రెండు కప్పులు

కొత్తిమీర తరుగు - మూడు స్పూన్లు

కార్న్ ఫ్లోర్ - అరకప్పు

నిమ్మకాయ రసం - రెండు స్పూన్లు

ఉప్పు - రుచికి సరిపడా

చికెన్ నగ్గెట్స్ రెసిపీ

1. చికెన్ కీమాను శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి బాగా ఉడికించాలి.

2. చికెన్ మెత్తగా ఉడికాక అందులోని నీరు పిండేసి చికెన్ మాత్రం తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి.

3. ఆ గిన్నెలో అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, మిరియాల పొడి, ఉప్పు, కొత్తిమీర తరుగు, నిమ్మరసం పిండుకొని బాగా కలుపుకోవాలి.

4. ఒక అరగంట పాటు ఓ పక్కన పెట్టేయాలి.

5. ఇప్పుడు బ్రెడ్ ముక్కలను మిక్సీలో వేసి పొడిలా చేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి.

6. మరో గిన్నెలో కార్న్ పొడిని వేసి పక్కన పెట్టుకోవాలి. ఆ పొడిలో మిరియాల పొడి, కాస్త ఉప్పు, నీళ్లు వేసి గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి.

7. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

8. డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేసుకోవాలి.

9. ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ మిశ్రమంలోంచి కొంత ముద్దను తీసుకొని నగ్గెట్స్ లాగా చేత్తోనే ఒత్తుకొని కార్న్ ఫ్లోర్ కలిపిన పిండిలో ముంచి, బ్రెడ్ పొడి పై ఇటూ అటూ దొర్లించి కాగుతున్న నూనెలో వేయాలి.

10. ఇలా అన్నింటినీ వేసుకున్నాక అవి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించుకోవాలి.

11. తర్వాత తీసి టిష్యూ పేపర్ పై వేయాలి. అదనపు నూనెను టిష్యూ పేపర్ పీల్చేసుకుంటుంది.

12. అంతే చికెన్ నగ్గెట్స్ రెడీ అయినట్టే. వీటిని టమాటో సాస్ తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి చేశారంటే మీకు మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది.

క్రిస్పీగా, క్రంచీగా వచ్చే ఈ చికెన్ నగ్గెట్స్‌ను ఇంట్లో ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు చేసుకొని తింటే ఆ మజాయే వేరు. చికెన్ నగ్గెట్స్ చేసుకున్న వెంటనే తింటే క్రిస్పీగా ఉంటాయి. చల్లారిపోతే కాస్త మెత్తగా అయ్యే అవకాశం ఉంది. పిల్లలకు ఇవి ఖచ్చితంగా నచ్చుతాయి. ముఖ్యంగా చికెన్ తినని పిల్లలకు నగ్గెట్స్ రూపంలో ఇస్తే చికెన్ తినేస్తారు.

టాపిక్