Chicken egg roll: చికెన్ ఎగ్ రోల్... దీన్ని ఇంట్లోనే చాలా ఈజీగా చేసేయొచ్చు
chicken egg roll: రోల్స్ అంటే పిల్లలకు ఎంతో ఇష్టం. వాటిని ప్రతిసారి బయటకొనే కన్నా ఒకసారి ఇంట్లోనే చేసి చూడండి. ముఖ్యంగా చికెన్ ఎగ్ రోల్ అదిరిపోతుంది.
chicken egg roll: అరగంటలోనే చికెన్ ఎగ్ రోల్ చేసేయొచ్చు. పిల్లలకు దీన్ని బ్రేక్ ఫాస్ట్ గా, లంచ్ రెసిపీ గా సాయంత్రం స్నాక్స్‌గా... ఎలా ఇచ్చినా మంచిదే. వారికి పొట్ట నిండిపోతుంది. అలాగే ప్రోటీన్ పుష్కలంగా అందుతుంది. దీన్ని చేయడానికి అరగంట సమయం పడుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు చేసేయొచ్చు. ఈ చికెన్ ఎగ్ పరాటా రోల్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
చికెన్ ఎగ్ రోల్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
గోధుమపిండి - రెండు కప్పులు
అల్లం వెల్లుల్లి పేస్టు - అర స్పూను
పసుపు - అర స్పూను
కారం - ఒక స్పూన్
జీలకర్ర పొడి - అర స్పూను
ధనియాల పొడి - అర స్పూను
గరం మసాలా - అర స్పూను
నిమ్మరసం - ఒక స్పూన్
పెరుగు - రెండు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
గుడ్లు - రెండు
కొత్తిమీర తరుగు - ఒక స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నల్ల మిరియాలు పొడి - అర స్పూను
టమోటో కెచప్ - ఒక స్పూను
నూనె - మూడు స్పూన్లు
చికెన్ కీమా - అరకప్పు
చికెన్ ఎగ్ రోల్ రెసిపీ
1. చికెన్ కీమాను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయాలి.
2. ఆ గిన్నెలో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాలపొడి, గరం మసాలా, నిమ్మరసం, పెరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి.
3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి మ్యారినేట్ చేసిన చికెన్ అందులో వేసి ఉడికించాలి.
4. అది మెత్తగా ఉడికే దాకా చిన్న మంట మీద స్టవ్ పెట్టి మూత పెట్టి ఉంచాలి.
5. మరోవైపు ఒక గిన్నెలో గుడ్లను పగలగొట్టి ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకోవాలి.
6. స్టవ్ మీద పెనం పెట్టి దీనితో ఒక ఆమ్లెట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి.
7. ఇప్పుడు గోధుమ పిండిని చపాతీ పిండిలా బాగా కలుపుకొని చపాతీని కాల్చి రెడీ చేసుకోవాలి.
8. ఆ చపాతీ పైన ఆమ్లెట్ ను వేయాలి.
9. ఆ ఆమ్ట్ పై మిరియాల పొడిని చల్లాలి.
10. అలాగే టమాటో కెచప్ కూడా వేయాలి. అవసరమైతే మయోనెస్ కూడా వేసుకోవచ్చు.
11. ఇప్పుడు బాగా మెత్తగా ఉడికిన చికెన్ ముక్కలను తీసి ఈ ఆమ్లెట్ పై వేసుకొని రోల్ చుట్టినట్టు చుట్టుకోవాలి. అంతే చికెన్ ఎగ్ రోల్ రెడీ అయినట్టే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు చాలా నచ్చుతుంది. పెద్దలు కూడా దీన్ని ఇష్టపడతారు.
చికెన్ లేతగా ఉన్నది తీసుకుంటే రోల్ టేస్టీగా వస్తుంది. చికెన్ బాగా ఉడికితే జీర్ణం తేలిక అవుతుంది. అలాగే బరువు పెరగకుండా ఇది అడ్డుకుంటుంది. మన ఆహారంలో కచ్చితంగా ఉండవలసిన పదార్థాలలో చికెన్ ఒకటి. దీనిలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అలాగే కోడి గుడ్డులో కూడా ప్రోటీన్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ చికెన్ ఎగ్ రోల్, బ్రేక్ ఫాస్ట్ లో తింటే మరీ మంచిది. పిల్లలకు లంచ్ బాక్సులో అన్నం తో చేసిన ఆహారాలు బోర్ కొట్టినప్పుడు ఈ చికెన్ ఎగ్ రోల్ చేసి పెట్టండి. వాళ్ళు ఇష్టంగా తింటారు. అలాగే చాలా సేపు వారికి ఆకలి వేయకుండా ఉంటుంది. మన శరీరానికి అవసరమైన పోషకాలు ఎన్నో దీనిలో ఉన్నాయి.
టాపిక్