Mouth Fresheners: నోటి నుంచి దుర్వాసన వస్తుందా? ఇవి నమిలితే చాలు
Mouth Fresheners: నోటి వాసన తగ్గించేదుకు బజార్లో దొరికే మౌత్ ఫ్రెషనర్లు వాడక్కర్లేదు. కొన్ని పదార్థాలు సహజంగానే ఆ గుణాన్ని కలిగి ఉంటాయి. వాటిని నమిలితే నోటి దుర్వాసన తగ్గుతుంది. అవేంటో చూడండి.
బిర్యానీలు, మసాలాలు దట్టించిన ఆహారాలు తిన్నాక, ఉల్లి, వెల్లుల్లి లాంటివి తిన్నాకా కూడా నోటి వాసన వస్తుంటుంది. అలాగే మరి కొందరికి నోటి నుంచి దుర్వాసన ఎప్పుడూ వస్తుంటుంది. పళ్లు, చిగుళ్ల ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు ఈ సమస్య రావచ్చు. ఈ సమస్య తగ్గడం కోసం బయట దొరికే మౌత్ ఫ్రెషనర్లు వాడతారు. అలాంటివేం అక్కర్లేకుండా ఇంట్లోనే కొన్ని సహజ పదార్థాలు వాడితే సమస్య తగ్గిపోతుంది. ఇవన్నీ సహజ మౌత్ ఫ్రెషనర్ల లాగా పని చేస్తాయి. నోటి నుంచి మంచి వాసన వచ్చేలా చూస్తాయి.
తులసి, పుదీనా ఆకులు :
నోరు ఎప్పుడైనా చెడ్డ వాసన వస్తోంది అనుకున్నప్పుడు మీ ఇంట్లో తులసి ఆకులుగానీ, పుదీనా ఆకులు గానీ అందుబాటులో ఉన్నాయేమో చూడండి. రెండాకులు తుంపి నోట్లో వేసుకుని నమలండి. వీటిలో ఉండే ప్రత్యేకమైన వాసన మీ నోటి నుంచి బ్యాడ్ బ్రీత్ రాకుండా చేస్తుంది.
లవంగాలు :
లవంగాల్లో ప్రత్యేకమైన ఘాటు వాసన ఉంటుంది. ఎప్పుడైనా నోరు బాలేదు అనుకున్నప్పుడు ఓ లవంగం మొగ్గను బుగ్గన పెట్టుకోండి. దీని వల్ల నోరు తాజాగా అవుతుంది. శ్వాసకోస సంబంధిత సమస్యలూ తగ్గుతాయి.
యాలకులు :
వంటింట్లో ఉన్న గొప్ప మౌత్ ఫ్రెషనర్‌గా యాలకులని చెప్పవచ్చు. నోరు వాసన వస్తోంది అనుకున్నప్పుడు ఓ ఇలాచీ తొక్కతీసి లోపల గింజల్ని నోట్లో వేసుకోండి. సెకెన్లలోనే మీ నోరు తాజాగా మారుతుంది.
దాల్చిన చెక్క, తేనె :
సాధారణంగా నోట్లో ఉండే పుండ్లు, వాపులు తదితర సమస్యల వల్ల అది దుర్వాసన రావచ్చు. ఇలాంటి వాటికి చెక్ పెట్టాలంటే తేనెలో కాస్త దాల్చిన చెక్క పొడిని కలిపి తినండి. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల నోట్లోని బ్యాక్టీరియాల పెరుగుదలను నిలిపివేస్తుంది. ఫలితంగా నోటి నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది.
జామ ఆకులు :
జామ ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. పంటి నొప్పి, నోటి దుర్వాసన లాంటి సమస్యలకు ఇవి చక్కని పరిష్కారం. జామ చిగురును తీసుకుని దానికి ఓ యాలుకను చేర్చి నోట్లో పెట్టుకుని నమలండి. లేదంటే జామ ఆకులతో టీ చేసుకుని తాగండి. వీటి వల్ల నోరు శుభ్రపడుతుంది. వాసన దూరమవుతుంది.
టాపిక్