Butterscotch ice cream: నోరూరించే బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఇంట్లోనే ఇలా సులువుగా చేసేయండి, పిల్లలకి చాలా నచ్చుతుంది-butterscotch ice cream recipe in telugu know how to make this ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Butterscotch Ice Cream: నోరూరించే బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఇంట్లోనే ఇలా సులువుగా చేసేయండి, పిల్లలకి చాలా నచ్చుతుంది

Butterscotch ice cream: నోరూరించే బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఇంట్లోనే ఇలా సులువుగా చేసేయండి, పిల్లలకి చాలా నచ్చుతుంది

Haritha Chappa HT Telugu
Oct 09, 2024 12:11 PM IST

Butterscotch ice cream: ఐస్ క్రీమ్‌ తినడానికి సీజన్ అంటూ లేదు, వాతావరణం చల్లబడిన కూడా పిల్లలు ఐస్ క్రీమ్ తినేందుకు ఇష్టపడతారు. ఇక్కడ మేము బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ రెసిపీ ఇచ్చాము.

బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ రెసిపీ
బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ రెసిపీ

ఐస్ క్రీమ్ పేరు చెబితేనే నోరూరిపోతుంది. దీన్ని కొనుక్కునే తినక్కర్లేదు. ఇంట్లోనే చాలా సులువుగా చేసుకోవచ్చు. ఇక్కడ మేము బటర్ స్కాచ్ ఐస్ క్రీం రెసిపీ ఇచ్చాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ ఖర్చుతోనే ఎక్కువ మొత్తంలో బటర్ స్కాచ్ ఐస్‌క్రీమ్ తయారు చేసుకోవచ్చు. దీన్ని బయట కొంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కానీ అదే ఇంట్లో చేసుకుంటే ఎక్కువ పరిమాణంలో తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చు.

బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ రెసిపీకి కావలసిన పదార్థాలు

పాలు - అరకప్పు

చక్కెర - అరకప్పు

కార్న్ ఫ్లోర్ - నాలుగున్నర టీ స్పూన్లు

పాల మీగడ - రెండు స్పూన్లు

జీడిపప్పు - గుప్పెడు

ఫుడ్ కలర్ - చిటికెడు

కస్టర్డ్ పౌడర్ - రెండు స్పూన్లు

వెన్న - ఒక స్పూను

బటర్ స్కాచ్ ఎసెన్స్ - అర స్పూను

బటర్ స్కాచ్ ఐస్‌క్రీమ్ రెసిపీ

1. స్టవ్ మీద కళాయి పెట్టి పాలు వేయాలి.

2. ఆ పాలు పొంగే వరకు వేడి చేసుకోవాలి.

3. ఈలోపు ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్, కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి.

4. అలాగే చిటికెడు ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి.

5. వేడి అయిన పాలను చల్లార్చి కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉండలు లేకుండా చూసుకోవాలి.

6. మిగతా సగం పాలను స్టవ్ మీదే ఉంచి వేడి చేయాలి.

7. ఆ మరుగుతున్న పాలలో చక్కెర వేసి బాగా కలుపుకోవాలి.

8. ఇది బాగా కరిగాక కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలి.

9. ఇప్పుడు బటర్ స్కాచ్ ఎసెన్స్ వేసి బాగా కలపాలి.

10. ఇది చిక్కగా అయ్యేవరకు బయట ఉంచాలి.

11. మరో కళాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి పంచదార వేయాలి.

12. పంచదార కరిగాక వెన్న లేదా నెయ్యి వేసి బాగా కలపాలి. ఇదే క్యారమిల్.

13. ఇప్పుడు ఒక కవర్లో ఈ క్యారమిల్ వేసి మెత్తగా చితక్కొట్టాలి. ఇదే బటర్ స్కాచ్.

14. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న పాలు, కస్టర్డ్ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి అందులో కాస్త పాలమీగడ వేసి మిక్సీ చేసుకోవాలి.

15. ఈ మొత్తం మిశ్రమాన్ని తీసి గంటపాటు ఫ్రిజ్లో ఉంచాలి.

16. ఆ తర్వాత మళ్లీ ఫ్రిడ్జ్ లోంచి ఆ మిశ్రమాన్ని తీసి ముందుగా రెడీ చేసుకున్న బటర్ స్కాచ్ మిశ్రమంలో వేసి బాగా కలపాలి.

17. ఈ రెండింటిని మళ్లీ మిక్సీలో వేసి ఒకసారి తిప్పుకోవాలి.

18. చివరగా ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక బౌల్ లో వేసి డీప్ ఫ్రిజ్లో పెట్టుకోవాలి.

19. మూడు నాలుగు గంటల తర్వాత తీస్తే బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది.

బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ మంది ఇష్టపడే ఐస్ క్రీమ్ కూడా ఇదే. దీన్ని ఇంట్లోనే ఇలా చేసుకుని చూడండి. మీ అందరికీ నచ్చడం ఖాయం.

Whats_app_banner