Natural Moisturizers: చర్మం పొడిబారుతోందా.. ఈ సహజ మాయిశ్చరైజర్లు వాడండి..-best natural moisturizers at home that keeps skin smooth ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Natural Moisturizers: చర్మం పొడిబారుతోందా.. ఈ సహజ మాయిశ్చరైజర్లు వాడండి..

Natural Moisturizers: చర్మం పొడిబారుతోందా.. ఈ సహజ మాయిశ్చరైజర్లు వాడండి..

Koutik Pranaya Sree HT Telugu
Nov 02, 2023 10:36 AM IST

Natural Moisturizers: రసాయనాలున్న మాయిశ్చరైజర్లను చర్మానికి రాసుకోవడం కన్నా ఇంట్లోనే కొన్ని నూనెలు పదార్థాలతో చర్మాన్ని హైడ్రెటెడ్ గా ఉంచుకోవచ్చు. అవేంటో మీరూ తెలుసుకోండి.

సహజ మాయిశ్చరైజర్లు
సహజ మాయిశ్చరైజర్లు (freepik)

శీతాకాలంలో చర్మ సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. చర్మం గరుగ్గా అయిపోవడం, పొడి బారిపోవడం, దురదలు రావడం, పొట్టు రాలడం.. లాంటి సమస్యలు దాదాపుగా అందర్నీ ఇబ్బంది పెడుతుంటాయి. అందుకనే మనం మార్కెట్లో దొరికే రకరకాల మాయిశ్చరైజర్లను తెచ్చుకుని చర్మానికి రాసుకుంటూ ఉంటాం. బోలెడు ఖరీదు పెట్టి వాటిని కొంటాం. రసాయనాలు నిండి ఉండే అలాంటి మాయిశ్చరైజర్ల కంటే ఇంట్లో దొరికే సహజ మాయిశ్చరైజర్లను వాడుకోవడం ఎంతో ఉత్తమం అని చర్మ వైద్యులు చెబుతున్నారు.

కొబ్బరి నూనె :

శీతాకాలంలో కొబ్బరి నూనెను చర్మంపై రాసుకునే అలవాటు పూర్వ కాలం నుంచి మన దేశంలో ఉంది. రాత్రి పడుకునే ముందు ముఖం, చర్మం, పాదాలు, మడమలు, చేతులు, కాళ్లకు దీన్ని రాసుకుని రాత్రంతా అలా వదిలేయలి. అందువల్ల చర్మం సున్నితంగా, కాంతివంతంగా ఉంటుంది. దీన్ని రోజూ చేయడం వల్ల ఫలితం ఉంటుంది.

బాదాం నూనె :

బాదాం నూనెలో విటమిన్‌ ఈ దొరుకుతుంది. స్నానానికి ముందు కొద్దిగా బాదం నూనెను శరీరానికి పట్టించి స్నానం చేయడం వల్ల ఫలితం ఉంటుంది. స్నానం చేసిన తర్వాత కూడా మీ చర్మం మృదువుగా, తేమగా ఉండటాన్ని మీరు గమనించవచ్చు.

ఆలివ్‌ నూనె :

సహజమైన నూనెలు చర్మాన్ని తేమగా ఉంచేందుకు ఎంతగానో సహకరిస్తాయి. అందువల్ల చర్మం జీవాన్ని కోల్పోకుండా నిగారింపుగా ఉంటుంది. అలాంటి నూనెల్లో ఆలివ్‌ నూనె ఉత్తమమైనది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని సున్నితంగా ఉంచుతాయి. దెబ్బ తిన్న కణాలను తొలగించి, ఎక్కువగా పొడిదనం లేకుండా చేస్తాయి. అందువల్ల ముడతలు, గీతల్లాంటివి రాకుండా ఉంటాయి.

తేనె :

తేనెను మంచి మాయిశ్చరైజర్‌ అని చెబుతారు. ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉండే దీన్ని నేరుగా చర్మానికి రాసుకుని పది నిమిషాల పాటు ఉండాలి. తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకుంటే చర్మం నిగారింపుగా ఉంటుంది. చర్మం ఎక్కువగా పొడి బారదు.

పెరుగు :

ఈ కాలంలో చర్మం పొడిబారి దురదలు వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు స్నానానికి పది నిమిషాల ముందు పెరుగును శరీరానికి పట్టించండి. పది నిమిషాల తర్వాత గోరు వెచ్చటి నీళ్లతో స్నానం చేయండి. దీనిలో ఉండే కొవ్వు పదార్థాలు చర్మానికి మంచి మాయిశ్చరైజర్లుగా పని చేస్తాయి. దీంతో ఫలితం కనిపిస్తుంది.

పై పదార్థాలన్నీ కూడా తేలికగా ఇంట్లో, మార్కెట్లో దొరికేవే. అందుకనే కృత్రిమ రసాయనాలు నిండిన మాయిశ్చరైజర్ల కంటే వీటిని వాడుకోవడం వల్ల ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవు.

Whats_app_banner