Hibiscus for hair: జుట్టు రాలడం, చుండ్రు తగ్గడానికి.. మందార ఇలా వాడండి-best methods to use hibiscus for hair and its benefits ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hibiscus For Hair: జుట్టు రాలడం, చుండ్రు తగ్గడానికి.. మందార ఇలా వాడండి

Hibiscus for hair: జుట్టు రాలడం, చుండ్రు తగ్గడానికి.. మందార ఇలా వాడండి

Koutik Pranaya Sree HT Telugu
May 25, 2023 07:27 AM IST

Hibiscus for hair: చుండ్రు, జుట్టు రాలడం,పొడిబారడం.. ఇలా చాలా సమస్యలకు మందార పువ్వులను ఎలా వాడాలో తెలుసుకోండి.

జుట్టు ఆరోగ్యానికి మందార
జుట్టు ఆరోగ్యానికి మందార (pexels)

ప్రతి ఆరోగ్య సమస్యకు ప్రకృతి నుంచే చిట్కాలు దొరుకుతాయి. జుట్టు సమస్యలను తగ్గించడంలో మందార పువ్వు చేసే మేలు చాలా. మందార పువ్వును మీ హెయిర్ కేర్ రొటీన్ లో చేర్చుకోవడం వల్ల జుట్టు పెరుగుతుంది. ఈ పువ్వులో అమైనో యాసిడ్లు, కెరాటిన్ ఉంటాయి. వాటివల్ల జుట్టుకు సహజ మెరుపు వస్తుంది. మృదువుగా మారుతుంది.

జుట్టు కుదుళ్లలో రక్త ప్రసరణ పెంచడానికి మందార సాయపడుతుంది. దీంట్లో ఉండే ఫ్లవనాయిడ్లు యూవీ కిరణాల నుంచి కాపాడి చల్లదనాన్నిస్తాయి. మాడు పొడిబారడం కూడా తగ్గిస్తుంది. వేసవిలో దీని వాడకం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

జుట్టుకు మందార ఎలా వాడాలి?

1. జుట్టు పెరగడానికి:

మందార పూలు, ఆకులను మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ వీలు లేకపోతే మందార పొడిని తీసుకోవచ్చు. దీంట్లో ఏదైనా నూనె, కొబ్బరి లేదా ఆలివ్ నూనె కలపాలి. జుట్టుకు, మాడుకు పట్టించాలి. అరగంటయ్యాక గాఢత తక్కువున్న షాంపూతో కడిగేసుకుంటే చాలు. దీనివల్ల జుట్టుకు కొత్త మెరుపు వస్తుంది. బలంగా, ఆరోగ్యంగా మారుతుంది.

2. జుట్టు నిర్జీవంగా ఉంటే:

మందార ఇన్ఫ్యూజ్ చేసిన నూనె వాడొచ్చు. ఇది చాలా సులభంగా చేసుకోవచ్చు. ఎండబెట్టిన మందార పూలను ఒక డబ్బాలో వేయండి. వాటి మీద నూనె పోయండి. ఒక రెండు మూడు వారాలు వెచ్చని ప్రదేశంలో ఉంచండి. ఇపుడు నూనెను వడగట్టి వాడుకోవచ్చు. తలస్నానం చేసే కన్నా ముందు ఈ నూనె రాసుకుని పావుగంటయ్యాక స్నానం చేస్తే కండీషనర్ లాగా పనిచేస్తుంది. మాడును తేమగా ఉంచుతుంది. నిర్జీవంగా ఉన్న జుట్టుకు కొత్త మెరుపు వస్తుంది.

3. చుండ్రు సమస్యలు:

మందార పువ్వుతో చేసిన టీ చుండ్రు సమస్య తగ్గిస్తుంది. మందార ను నీళ్లలో ఉడికించి వడకట్టాలి. ఈ షాంపూ కడిగేసుకున్నాక ఈ నీళ్లను తలమీద పోసుకోవాలి. మందారలో ఉండే సహజ ఆమ్లాల వల్ల జుట్టు పీహెచ్ సరైన స్థాయిలో ఉంటుంది. ఇది క్రమం తప్పకుండా వాడటం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. దీనివల్ల జుట్టు పొడిబారదు. ఈ టీని డబ్బాలో పోసుకుని జుట్టుకు స్ప్రే చేసుకోవచ్చు.

4. జుట్టు రాలే సమస్య:

జుట్టు రాలే సమస్యను విటమిన్ ఈ తగ్గిస్తుంది. ఇది కలబందలో పుష్కలంగా ఉంటుంది. కలబంద గుజ్జు, మందారాలను కలిపి మిక్సీ పట్టి తలకు పట్టించాలి. సున్నితంగా మర్దనా చేయాలి. ఇరవై నిమిషాలయ్యాక కడిగేసుకోవాలి. దీనివల్ల జుట్టు రాలడం తగ్గుతుంది, దురద తగ్గుతుంది. మాడు తేమగా ఉంటుంది.

WhatsApp channel