Eye Health: కళ్లతో చూడటం కాదు.. ఆ కళ్లనీ జాగ్రత్తగా చూసుకోండి!-best foods for eye health and eyesight ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Eye Health: కళ్లతో చూడటం కాదు.. ఆ కళ్లనీ జాగ్రత్తగా చూసుకోండి!

Eye Health: కళ్లతో చూడటం కాదు.. ఆ కళ్లనీ జాగ్రత్తగా చూసుకోండి!

Galeti Rajendra HT Telugu
Oct 12, 2024 11:30 AM IST

Eyesight: ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి మళ్లీ నిద్రపోయే వరకూ ప్రతి పనికీ కళ్లే ప్రధానం. కానీ చాలా మంది కళ్ల ఆరోగ్యాన్ని పట్టించుకోరు. ఏ ఏ ఆహార పదార్థాలు తింటే దృష్టి లోపం దరిచేరదో ఇక్కడ తెలుసుకుందాం.

కళ్లు
కళ్లు (Unsplash)

సర్వేంద్రియానాం నయనం ప్రధానం ఈ మాట మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం. అన్ని ఇంద్రియాల కన్నా కళ్లకి ప్రాధాన్యం కాస్త ఎక్కువ. ఆ కళ్లతోనే ఈ లౌకిక ప్రపంచాన్ని మనం చూస్తాం.

నిద్రలేచినప్పటి నుంచి చదవడం, రాయడం, డ్రైవింగ్ చేయడం ఇలా ఒక్కటేమిటి ఏ పని చేయాలన్నా మన నేత్రాలే మనల్ని నడిపిస్తాయి. అయితే.. మన రోజువారీ కార్యక్రమాలు సాఫీగా సాగిపోవాలంటే ఆరోగ్యకరమైన కంటి చూపు చాలా అవసరం.

పెరిగిన దృష్టిలోపం బాధితులు

దృష్టి లోపం వ్యక్తి జీవన ప్రమాణాల్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. ఒకసారి దృష్టిలోపం ఏర్పడితే.. మనిషి సామాజిక ఒంటరితనంతో పాటు ప్రొడెక్టివిటీనీ కోల్పోతాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.2 బిలియన్ మంది ప్రజలు ఏదో ఒక రకమైన దృష్టి లోపంతో బాధపడుతున్నారు. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు దృష్టిలోపంతో ఇబ్బంది పడుతుండటం ఆందోళన కలిగించే విషయం.

పిల్లలు మారాం చేస్తున్నారని వారికి మొబైల్, ట్యాబ్స్ ఇస్తూ.. తల్లిదండ్రులే తొలుత అలవాటు చేస్తున్నారు. ఆ తర్వాత ఆ అలవాటుని మాన్పించలేక బాధపడుతున్నారు. స్క్రీన్ సమయాన్ని తగ్గించడం, ఆరు బయట పిల్లలతో సరదాగా గేమ్స్ ఆడటం వల్ల పిల్లల్లో హ్రస్వ దృష్టి (మయోపియా) అభివృద్ధి చెందకుండా కాపాడుతుందని పరిశోధనలు చూపుతున్నాయి. అలానే పిల్లలకి ప్రారంభ దశలోనే కంటి చూపు సమస్యలను గుర్తించి సరైన చికిత్స చేయిస్తే మంచిది.

ఏం తినాలంటే?

విటమిన్- ఎ పుష్కలంగా ఉండే క్యారెట్లు, చిలగడదుంపలు, బచ్చలికూర తినడం ద్వారా దృష్టి లోపాన్ని తగ్గించుకోవచ్చు. అలానే రేచీకటి రాకుండా కాపాడుకోవచ్చు.

సిట్రస్ పండ్లు, బెర్రీలు, టమోటాలు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలతో పాటు సాల్మన్ చేపలు కూడా కంటి ఆరోగ్యంతో పాటు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. మరీ ముఖ్యంగా చేపలు కళ్లు పొడిబారడాన్ని తగ్గిస్తాయి. ఉడికించిన గుడ్లను తినడం ద్వారా కంటి కండరాలు బలపడతాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

డ్రైవింగ్ లేదా ఎండలో బయటికి వెళ్లినప్పుడు సన్ గ్లాసెస్ లేదా టోపీని ధరించడం ద్వారా కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మొబైల్ లేదా ల్యాప్ ట్యాప్ స్క్రీన్‌‌ని ఏకబిగిన గంటలకొద్దీ చూడకుండా విరామం తీసుకోండి. ప్రతి 20 నిమిషాలకు స్క్రీన్‌ నుంచి పక్కకి వెళ్లి కాసేపు కళ్లకి విశ్రాంతినివ్వండి. అలానే మీకు ధూమపానం అలవాటు ఉంటే ఆ అలవాటుని మానేయడానికి ప్రయత్నించండి. కంటి వ్యాధులకు ధూమపానం ప్రధాన ప్రమాద కారకం.

మధుమేహం, అధిక రక్తపోటు వంటి పరిస్థితులు మీ కంటి చూపును ప్రభావితం చేయవచ్చు.క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. శారీరక శ్రమ కంటి ఆరోగ్యంతో పాటు మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

Whats_app_banner