Before Marriage Checklist | త్వరలో వివాహం చేసుకోబోతున్నారా? పెళ్లికి ముందు ఇవి కీలకం!
Before Marriage Checklist: వివాహానికి సిద్ధం అవుతున్నవారు, వివాహం చేసుకునే ముందుకు కొన్ని విషయాలపై స్పష్టత కలిగి ఉండటం మంచిదని మనస్తత్వ నిపుణులు, ఫ్యామిలీ కౌన్సిలింగ్ థెరపిస్టులు సూచిస్తున్నారు.
Before Marriage Checklist: వివాహం అనేది ఏ వ్యక్తి జీవితంలో అయినా కీలకఘట్టం. వివాహానికి ముందులా ఒకలా ఉండే జీవితం వివాహం తర్వాత పూర్తిగా మారిపోతుంది. బంధాలు పెరుగుతాయి, బాధ్యతలు పెరుగుతాయి. వివాహం తర్వాత ఏ బంధాలు ఉన్నా, లేకపోయినా.. భార్యాభర్తల బంధం దృఢంగా ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకరి విలువలు, లక్ష్యాలు, ఆశయాలు, అవసరాలను మరొకరు తెలుసుకోవడం, ఒకరికొకరు గౌరవించుకోవడం, విధేయతను కొనసాగించడం అనేవి విజయవంతం అయిన వివాహ బంధానికి కీలకం.
ఈరోజుల్లో చాలా మంది ఎంతో ఘనంగా వివాహాలు చేసుకుంటున్నారు, కానీ కొన్నినాళ్లకే తమ బంధానికి స్వస్తి పలికి విడిపోతున్నారు. ఏ బంధంలోనైనా మనస్పర్థలు రావడం సహజం, అవి కొన్నాళ్లకు సమసిపోయి మళ్లీ అందరూ కలిసిపోతారు. కానీ ఇద్దరు భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఎక్కువైతే ఆ బంధం మళ్లీ అతుక్కోలేనంత దూరం అవుతుంది. వివాహ బంధం అనేది జీవితకాలం పాటు కొనసాగాల్సిన అనుబంధం, అయితే ఇటీవల కాలంలో విడిపోతున్న చాలా మంది వివాహితుల్లో తమ మధ్య సమస్యల కంటే మూడో వ్యక్తి ప్రమేయమే ఎక్కువ ఉంటుంది. కాబట్టి భార్యాభర్తలు తమ బంధాన్ని కొనసాగించడానికి మంచి నిబద్ధతను కలిగి ఉండాలి.
కొత్తగా వివాహానికి సిద్ధం అవుతున్నవారు, వివాహం చేసుకునే ముందుకు కొన్ని విషయాలపై స్పష్టత కలిగి ఉండటం మంచిదని మనస్తత్వ నిపుణులు, ఫ్యామిలీ కౌన్సిలింగ్ థెరపిస్టులు సూచిస్తున్నారు. పెళ్లి చేసుకోవడానికి ముందు ఏయే అంశాలు కీలకమో ఇక్కడ తెలుసుకోండి.
విలువలు
మనం పాటించే విలువలు, మనం అనుసరించే విధానాలు మనం ఎవరం అనేది నిర్ణయిస్తాయి. కొత్తగా వివాహ బంధంలోకి ప్రవేశిస్తున్నపుడు అవతలి వ్యక్తి కూడా అవే విలువలతో పెరిగి ఉండకపోవచ్చు, మీరు పాటించే విధానాలనే వారు పాటించాలనే నియమం లేదు. అయితే ఒకరి విలువలను మరొకరు గౌరవించుకోవడం ముఖ్యం. ఒకరి విధానాలను మరొకరు విమర్శించుకోవడం ద్వారా ఆ బంధంలో ఎప్పడూ కలహాలే ఉంటాయి. కాబట్టి సంబంధాన్ని కలుపుకునే ముందే ఈ విషయంపై ఇద్దరూ ఒక స్పష్టమైన అవగాహనను కలిగి ఉండాలి.
కమ్యూనికేషన్
ప్రతి వ్యక్తికి కమ్యూనికేట్ చేయడానికి తమకంటూ ఒక స్వంత మార్గం ఉంటుంది. ఆ వ్యక్తి కోపంలో ఉన్నప్పుడు ఎలా స్పందిస్తారు, మామూలుగా ఉన్నప్పుడు ఎలా ఉంటారు అనేది అర్థం చేసుకోగలగాలి. కొందరు విషయాలను సరిగ్గా వ్యక్తపరచలేరు. ఒకరి భావ వ్యక్తీకరణ విధానం ఎలా ఉందో తెలిసినపుడు, ఎప్పుడైనా గొడవ జరిగిన సందర్భంలో అవతలి వ్యక్తి అర్థం చేసుకుంటారు. ఇది పెళ్లికి ముందే తెలిసి ఉండాలి. మనం కమ్యూనికేట్ చేసే విధానం మనం పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న వ్యక్తితో పంచుకోవడం ముఖ్యం. లేదంటే, కాపురంలో గొడవలు వచ్చినపుడు కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అపార్థాలు పెరిగే అవకాశం ఉంటుంది.
సాన్నిహిత్యం
ఏ సంబంధంలో అయినా సాన్నిహిత్యం అనేది ఉండాలి. ఇక్కడ సాన్నిహిత్యం అంటే కేవలం భౌతికంగా శరీరాలతో దగ్గరవడం అని మాత్రమే చెప్పడం లేదు, మనసుతో దగ్గరవడం, మాటతో దగ్గరవడం, చేతలతో దగ్గరవడం కూడా సాన్నిహిత్యమే. కష్టసుఖాలు, జయాపజయాలు పంచుకోవడానికి నమ్మకమైన వ్యక్తిగా మీ భాగస్వామి ఉండాలి.
డబ్బు
మీరు పెళ్లి చేసుకునే ముందు కచ్చితంగా చర్చించాల్సిన ముఖ్యమై అంశం డబ్బు. మీరు ఎలాంటి జీవితాన్ని గడపాలనుకుంటున్నారు? అందుకు మీ వద్ద ఉన్న ఆర్థిక ప్రణాళికలు ఏమిటి? మీరు డబ్బు చూసే విధానం, మీరు ఖర్చు చేసే అలవాట్లు, పొదుపు ప్రణాళికలు ఇవన్నీ ఒకరికొకరు తెలియజేయాలి. చాలా కాపురాల్లో ఈ డబ్బే చిచ్చు పెడుతుంది. కాబట్టి దీనిపై ముందుగానే సరైన అవగాహన కలిగి ఉండాలి.
కుటుంబ నేపథ్యం
వివాహం తర్వాత భార్యాభర్తలుగా మీరు ఇద్దరు మాత్రమే కాదు. మీ రెండు కుటుంబాలు ఒక్కటవుతాయి. మీ కుటుంబాలు కలిసిపోయేలా ఉన్నాయా లేవో సరిచూసుకోండి. ఇరు కుటుంబాల గురించి పరస్పరం పెళ్లికి ముందే చర్చించుకోవాలి.
మత విశ్వాసాలు
వివాహబంధానికి మత విశ్వాసాలు కూడా కీలకం. అది ఆధ్యాత్మికం లేదా మతపరమైనది కావచ్చు, కులానికి సంబంధించినది కావచ్చు. మనకు ఉన్న నమ్మకాలు, మనం అనుసరించే జీవన విధానాన్ని తెలియజేయాలి. పెళ్లికి ముందే వీటిపై పరస్పర ఏకాభిప్రాయం కుదరాలి, అప్పుడే ఏ సమస్యలు రావు.
సంబంధిత కథనం