Face Wash Tips : రోజుకు ఎన్నిసార్లు ముఖం కడుక్కుంటే మంచిది.. కచ్చితంగా ఫాలో అవ్వండి
Skin Care Tips : అందంగా ఉండాలని చాలా మంది రోజులో అనేకసార్లు ముఖం కడుక్కుంటారు. కానీ ఎక్కువసార్లు ఫేస్ వాష్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. నిజానికి రోజులో ఎన్నిసార్లు ఫేస్ వాష్ చేయడం మంచిదని తెలుసుకోండి.
ముఖం మానవ శరీరంలోని సున్నితమైన భాగాలలో ఒకటి. అందమైన ముఖాన్ని కాపాడుకోవడమంటే కేవలం కాస్మెటిక్ ఉత్పత్తులను వాడడమే కాదు. మీరు మీ ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. రోజులో ఎన్నిసార్లు ముఖం కడుక్కుంటారనేది కూడా ముఖ్యమే.
చాలా మంది చర్మం మెరిసిపోవాలని తరచుగా ముఖం కడుగుతారు. గంటకు ఒకసారి కూడా ముఖాన్ని కడిగేవారు ఉన్నారంటే నమ్మండి. గుర్తొచ్చినప్పుడల్లా ముఖం కడుక్కోవడం మంచిది కాదు. ప్రతిదానికీ పరిమితి ఉంటుంది. ఆరోగ్యకరమైన చర్మం కోసం ఒక వ్యక్తి తన ముఖాన్ని రోజుకు ఎన్నిసార్లు కడగాలి అని ఒక ఐడియా ఉండాలి.
బయట తిరిగితే చర్మ సమస్యలు
మీరు మీ ముఖాన్ని రోజుకు ఎన్నిసార్లు కడగాలి అని తెలుసుకునే ముందు, మీ ముఖం కడగడం ఎందుకు ముఖ్యం అనే ప్రశ్నకు సమాధానం కూడా తెలుసుకోవాలి. మనం ప్రతిరోజూ అనేక మార్గాల్లో ప్రయాణిస్తాం. చర్మం ఎండ వేడికి, బయటి వాతావరణానికి పాడవుతుంది. దుమ్ము కణాలు ముఖం మీద పేరుకుపోతాయి. ముఖం నుండి కాలుష్య కారకాలను తొలగించడం చాలా ముఖ్యం. ఫేషియల్ క్లెన్సింగ్ మీ ముఖంలోని మృతకణాలను తొలగిస్తుంది. ముఖంపై ఉండే కాలుష్య కారకాలు కూడా తొలగిపోతాయి.
ఎక్కువసార్లు కడగొద్దు
అయితే ఏదైనా అతిగా అయితే మాత్రం విషమే. ముఖం కడుక్కోవడం కూడా అంతే... బయట ఎక్కువగా తిరుగుతున్నాం కదా అని ఎక్కువసార్లు ముఖం కడుక్కోకూడదు. ఎక్కువగా ముఖం కడుక్కోవడం వల్ల హాని కలుగుతుంది. ముఖం కడుక్కోకపోతే మొటిమలు వస్తాయని, అదే విధంగా ఎక్కువగా ముఖం కడుక్కుంటే మొటిమలు వస్తాయని బ్యూటీ నిపుణులు అంటున్నారు. ఎక్కువగా ముఖం కడుక్కోవడం వల్ల చెమట గ్రంథులు దెబ్బతింటాయి. ఇవి మొటిమలు, మచ్చలను కలిగిస్తాయి.
చర్మం ఎలాంటిదో చూడండి
మీ చర్మం ఎలాంటిదో గుర్తించి.. దాని ఆధారంగా ముఖం కడగాలి. ఉదాహరణకు మీకు పొడి చర్మం ఉన్నట్లయితే, మీ ముఖాన్ని రోజుకు ఒకటి లేదా రెండుసార్లు కడగడం సరిపోతుంది. జిడ్డు చర్మం ఉన్నవారు రోజుకు మూడుసార్లు ముఖాన్ని కడుక్కోవడం మంచిదని, అలాగే ముఖం కడుక్కోవడానికి ఎలాంటి సబ్బులు వాడకుండా ఉండవచ్చని చెబుతారు. ఎలాంటి సువాసన లేని క్లెన్సర్‌లను కొని దానితో ముఖం కడుక్కోండి. మీ ముఖానికి మేకప్ వేసుకునేటప్పుడు మీ ముఖాన్ని మరింత కడగడానికి అవకాశం ఉంటుంది.
ముఖం కడుక్కున్న తర్వాత కూడా మొటిమలు వంటి సమస్యలు ఎదురవుతున్నట్లయితే, ముఖం కడుక్కోవడం అలవాటును తగ్గించుకోవడం మంచిది. రాత్రి పడుకునే ముందు ముఖం కడుక్కోవడం అలవాటు చేసుకోవాలి.
మేకప్ ఉంటే ముఖం ఇలా కడుక్కోవాలి
మేకప్ మీ ముఖాన్ని అందంగా కనిపించేలా చేస్తుంది. అయితే ముఖానికి మేకప్ ఎక్కువ సేపు ఉంచుకోవడం మంచిది కాదు. కేవలం ముఖం కడుక్కోవడం వల్ల చర్మంలో లోతుగా ఉన్న మేకప్ తొలగిపోదు. ముందుగా కొబ్బరినూనెతో ముఖానికి బాగా మసాజ్ చేసుకోవాలి. దీని తర్వాత మాత్రమే మీరు మీ ముఖాన్ని ఫేస్ వాష్‌తో కడగవచ్చు.
జిడ్డు చర్మం ఉన్నవారు కొబ్బరినూనెకు బదులు మార్కెట్‌లో లభించే ఏదైనా తగిన క్లెన్సింగ్ బామ్‌ని ఉపయోగించి మేకప్‌ను తొలగించుకోవచ్చు. ముఖం కడుక్కున్న తర్వాత టవల్ తో ముఖాన్ని గట్టిగా రుద్దవద్దు. ఒక సున్నితమైన టవల్ తో ముఖాన్ని రాస్తూ ఉండాలి. ముఖం తుడుచుకోవడానికి ప్రత్యేకంగా టవల్ పెట్టుకోవడం అన్నింటికీ మంచిది.