Ayodhya in Thailand: మనదేశంలోనే కాదు ఆ దేశంలోనూ ఒక అయోధ్య ఉంది, ఆ నగరాన్ని కచ్చితంగా చూడాల్సిందే
Ayodhya in Thailand: మన దేశంలో అయోధ్య సర్వాంగ సుందరంగా సిద్ధమవుతోంది. థాయిలాండ్ లో కూడా ఇలాంటి అయోధ్య ఒకటుంది.
Ayodhya in Thailand: ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి సర్వాంగ సుందరంగా సిద్ధమవుతోంది. విగ్రహాల ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని వీక్షించేందుకు దేశవ్యాప్తంగా వేలమంది అయోధ్యకు చేరుకోనున్నారు. ఇప్పటికే 7000 మందికి ఆహ్వానాలు వెళ్లాయి. వీరిలో ఎంతోమంది రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు ఉన్నారు. కేవలం మనదేశంలోనే కాదు థాయిలాండ్ లోనూ ఒక అయోధ్య ఉంది. ఈ నగరాన్ని అక్కడ ఆయుతయ అని పిలుస్తారు. చూడడానికి ఇది అయోధ్య లాగే ఇది ఉంటుంది. థాయిలాండ్ లో ఉన్న యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లలో ఇది ఒకటి.
ఈ ఆయుతయా నగరంలో అద్భుతమైన దేవాలయాలు, శిధిలమైన చరిత్రకు సాక్ష్యాలుగా ఎన్నో ఉన్నాయి. థాయ్, బర్మా వాస్తు శిల్పుల నైపుణ్యానికి సాక్ష్యంగా ఈ నగరం నిలుస్తుంది. థాయిలాండ్ వెళ్లిన ప్రతి ఒక్కరూ ఈ ఆయుతయ నగరాన్ని చూసి వస్తారు. భారతీయ యాత్రికులకు థాయిలాండ్‌లో ఈ ఆయుతయ నగరం అయోధ్యను గుర్తుచేస్తుంది. చూడగానే ఇదొక పురాతన భారతీయ నగరంలా కనిపిస్తుంది. ఈ నగరాన్ని 1350లో రామతిబోడి అనే రాజు స్థాపించాడు. నాలుగు శతాబ్దాలకు పైగా ఈ నగరాన్ని థాయిలాండ్ కు రెండవ రాజధానిగా ఉంది. కాలం గడుస్తున్న కొద్దీ రాజ్యాలు కూలిపోయి, చివరికి వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందింది. చావో ఫ్రయ అనే నది ఇక్కడ ఉంటుందిజ ఇది సముద్ర వాణిజ్యాన్ని సులభతరం చేసింది.
అయోధ్య, ఆయుతయ నగరాలు ఒకేలా ఉండటమే కాదు, రెండు నగరాల సాంస్కృతిక, మతపరమైన సంబంధాలు కూడా ఒకేలా ఉంటాయి. ఆయుతయ నగరంలో బౌద్ధమతం, హిందూ, బ్రాహ్మణ సంప్రదాయాల అందమైన సమ్మేళనాన్ని చూడవచ్చు. ఇది సాంస్కృతిక మత వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ నగరంలో ఉన్న బంగారు ద్వారం మన అయోధ్య నగరాన్ని గుర్తుకు తెరుస్తుంది.
రాముడితో బంధం
రాముడి జన్మస్థలమైన అయోధ్య పేరు మీదే ఈ పురాతన నగరమైన ఆయుతయాకు పేరు పెట్టారు. రామాయణం గుర్తుకు తెచ్చుకుని ఆయుతయ మొదటి పాలకుడు రామతిబోడి ఈ నగరానికి ఆ పేరు పెట్టినట్టు చరిత్రకారులు చెబుతారు. ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని పరిపాలించిన రాజులు కూడా ఈ పేరును స్వీకరించారు. దీంతో ఆ నగరానికి శ్రీరాముడితో ఉన్న సంబంధం బలంగా మారింది. అక్కడ ఉన్న బౌద్ధ మిషనరీలు రామాయణాన్ని రామకీన్ అనే పేరుతో థాయిలాండ్ భాషలోకి అనువదించాయి. అందుకే థాయిలాండ్ వెళ్లిన ప్రతి భారతీయుడు ఆయుతయ నగరాన్ని సందర్శించి రావాలి. ఆ నగరంలో ఉంటే మన అయోధ్య నగరంలో ఉన్నంత అనుభూతి కలుగుతుంది.