Ram mandir golden gate: అయోధ్య రామ మందిరంలోని బంగారు తలుపు చూశారా?
Golden gate: అయోధ్య రామ మందిరంలో బంగారు తలుపు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఫోటోలు వైరల్ అయ్యాయి.
Golden gate: యావత్ భారతదేశం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం మరికొన్ని రోజుల్లో రానుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు పూర్తి కాబోతున్నాయి. జనవరి 22వ తేదీన అయోధ్యలోని రామాలయంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగబోతుంది.
ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు ముందు అయోధ్యలోని రామ మందిరంలో తొలి బంగారు తలుపుని ఏర్పాటు చేశారు. 12 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు ఉన్న ఈ తలుపుకి సంబంధించి ఫోటోలు యూపీ సీఎంవో కార్యాలయం విడుదల చేసింది. ఈ తలుపుని మొదటి అంతస్తులో ఏర్పాటు చేశారు. రానున్న మూడు రోజుల్లో మరో 13 బంగారు తలుపులు అమర్చనున్నారు. రామ మందిరంలో మొత్తం 46 ద్వారాలు ఉంటాయి. వాటిలో 42 ద్వారాలకి 100 కిలోల బంగారు పూత పూయనున్నారు. మెట్ల దగ్గర ఉండే నాలుగు తలుపులకి మాత్రం బంగారు పూత వేయరు.
ఈ ద్వారం ప్రత్యేకత ఏంటంటే..
గోల్డెన్ గేట్ తలుపుకు మధ్యలో రెండు ఏనుగులు నిర్మించారు. ఈ రెండు ఏనుగులు ప్రజలకి స్వాగతం పలుకుతున్నట్టుగా కనిపిస్తాయి. ఇవి కాకుండా ప్యాలెస్ లాంటి ఆకారం కనిపిస్తుంది. ఇక్కడ ఇద్దరు సేవకులు చేతులు జోడించినట్టి కనిపిస్తుంది. ఇక ద్వారం దిగువ భాగంలో చతురస్రాకారంలో అందమైన కళాకృతులూ ఉన్నాయి. ఈ తలుపుల నిర్మాణం కోసం మహారాష్ట్ర నుంచి ప్రత్యేక కలపని తెప్పించారు. సుమారు వెయ్యి సంవత్సరాల వరకు ఇవి చెక్కు చెదరవు. ఈ తలుపుల డిజైన్ రూపొందించేందుకు కన్యాకుమారి నుంచి కళాకారులు వచ్చారు.
అప్పటి నుంచి వేడుకలు
జనవరి 16 నుంచి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మతపరమైన కార్యక్రమాలు ప్రారంభించనుంది. శ్రీరాముడి కథతో ఊరేగింపు ప్రారంభమవుతుంది. ప్రతిష్ఠాపన రోజు వరకు వేడుకలు కొనసాగానున్నాయి. ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్రమోదై తో పాటు సుమారు నాలుగు వేల మందికి పైగా ప్రముఖులు, రామ భక్తులు, కరసేవకులు హాజరు కానున్నారు. దేశవిదేశాలకి చెందిన కళాకారులు రామాయణాన్ని ప్రదర్శించనున్నారు. వారం రోజుల పాటు ఉత్తర ప్రదేశ్ తో పాటు పలు ప్రాంతాలు మొత్తం రామ నామ స్మరణతో మారుమోగనున్నాయి.
భక్తులు పాటించాల్సిన నియమాలు
అయోధ్య రామ మందిరంలో ఏర్పాటు చేయనున్న రామ్ లల్లా విగ్రహానికి మూడు సార్లు మంగళ హారతి ఇవ్వనున్నారు. శృంగార్ హారతి, భోగ్ హారతి, సంధ్యా హారతి ఇస్తారు. రామ మందిరంలోకి వచ్చే భక్తులు కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. సంప్రదాయమైన దుస్తుల్లో మాత్రమే ఆలయంలోకి ప్రవేశించాలి. పాశ్చాత్య దుస్తులు ధరించిన వారిని అనుమతించరు. ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు వెంట తీసుకుని వెళ్ళడానికి అనుమతి లేదు.