Saturday Motivation: కష్టాలన్నీ నాకే అంటూ తెగ బాధపడుతున్నారా? కర్ణుడి కష్టాల ముందు మీ కష్టాలు ఏపాటివి?
Saturday Motivation: చాలామంది తమకున్న చిన్న చిన్న సమస్యలను చూసి భయపడిపోతూ ఉంటారు. తమకే అన్ని కష్టాలు వస్తున్నాయనుకుంటారు. మహాభారతంలో కర్ణుడి కష్టాలతో పోలిస్తే మీ కష్టాలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి.
Saturday Motivation: ఏ మనిషి జీవితం కూడా పూలబాటలా ఉండదు. ప్రతి మనిషికి ముళ్ళబాట ఎదురవుతూనే ఉంటుంది. ఆ ముళ్ళబాటను దాటితేనే పూలబాట ఎదురవుతుంది. ముళ్లబాటను, పూలబాటుగా మార్చుకునే శక్తి కూడా దేవుడు మనకే ఇస్తాడు. కానీ కొంతమంది చిన్న సమస్య రాగానే తమకే ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ వస్తున్నాయని తెగ బాధ పడిపోతూ ఉంటారు. ఆ బాధలో ఏవేవో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వేరే వాళ్ళ మీద నిందలు మోపి తమ తప్పులేదని, ఈ కష్టాలకు ఎదుటివారే కారణం అని చెబుతూ ఉంటారు. మీకే కాదు ప్రపంచంలోని ప్రతి మనిషికి ఏదో ఒక కష్టం ఉంటుంది. అంతెందుకు మహాభారతంలో ముఖ్యమైన పాత్రల్లో కర్ణుడు ఒకటి. పుట్టుక నుంచి అతను సమస్యలను ఎదుర్కోవడం మొదలుపెట్టాడు. ఆయన కష్టాలను తెలుసుకుంటే... వాటి ముందు మీ కష్టాలు పెద్దవిగా అనిపించవు.
హిందువులకు పరమ పవిత్ర గ్రంథం మహాభారతం. మహాభారతంలో కర్ణుడు పాత్ర ఎంత ముఖ్యమైనదో అందరికీ తెలిసిందే. అతను తన జీవితంలో ప్రతి సమస్యను ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకెళ్లాడు. కష్టాన్ని కూడా సంతోషంగా స్వీకరించాడు, దాన్ని ఆస్వాదించాడు.కర్ణుడు నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఏ కష్టాన్నైనా ఓర్పుగా ఎదుర్కోవాలన్నదే కర్ణుడి జీవితం మనకు చెబుతోంది.
కుంతీ పెళ్లి కాకముందే ఊహించని విధంగా కర్ణుడికి జన్మనిచ్చింది. సమాజానికి భయపడి ఆ చంటి బిడ్డను గంగపాలు చేసింది. పుట్టుకతోనే తల్లిని కోల్పోయాడు కర్ణుడు. ఆ తర్వాత అతిరథుడి కి దొరికి క్షత్రియుడైనా కూడా సాధారణ వ్యక్తిలా పెరిగాడు. తనకెంతో ఇష్టమైన విలువిద్యను కూడా నేర్చుకోవడానికి అర్హత లేదని మాటలు పడ్డాడు. జీవితాంతం అడుగడుగునా అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నాడు. సూర్య పుత్రుడై ఉండి కూడా కర్ణుడు సాధారణ వ్యక్తిగా జీవించాల్సి వచ్చింది.
బ్రహ్మాస్త్రం కోసం పరశురాముడు దగ్గరికి వెళ్లిన కర్ణుడికి అక్కడ కూడా అవమానమే ఎదురయింది. కర్ణుడు తన తొడ మీద నిద్రపోతున్న గురువుకి నిద్రా భంగం కలగకూడదని, తన తొడకు గాయం తగిలి రక్తం కారుతున్నా అలాగే కూర్చున్నాడు. కానీ చివరికి పరశురాముడి ఆగ్రహానికి గురయ్యాడు. తాను నేర్చుకున్న బ్రహ్మాస్త్రం తన మరణ సమయంలో ఉపయోగపడదని శాపాన్ని తీసుకున్నాడు. బ్రహ్మాస్త్రం నేర్చుకున్నా కూడా ఎలాంటి ఉపయోగం లేకపోయింది. కర్ణుడు ఒక బ్రాహ్మణుడి దగ్గర అస్త్రాభ్యాసం కోసం చేరాడు. అక్కడ అజాగ్రత్త వల్ల దూడను చంపాడు. దీనివల్ల మళ్లీ శాపానికి గురయ్యాడు. యుద్ధసమయంలో కర్ణుడి రథచక్రం గోతిలో కూరుకుపోయి ప్రాణాంతక పరిస్థితికి చేరుకుంటాడని ఆ బ్రాహ్మణుడు శపించాడు. అక్కడ్నించి కూడా తీవ్ర నిరాశతో వెనుదిరిగాడు కర్ణుడు.
కుంతి తన తల్లి అని తెలిసినా కర్ణుడు ఆమెను అమ్మ అని పిలవలేకపోయాడు. తల్లి ప్రేమను పొందలేకపోయాడు. సొంత అన్నదమ్ములతోనే పోరాడాల్సి వచ్చింది. తనకు ఎలాంటి ఉపయోగం లేకపోయినా యుద్ధంలో స్నేహం కోసం దుర్యోధనుడు పక్కన ఉండి ప్రాణాలు కోల్పోయాడు. ప్రతి చోట కర్ణుడికి జీవితంలో అవమానాలు, అపజయాలు ఎదురవుతూనే ఉన్నాయి. అయినా కూడా ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటూ వచ్చాడు. వివరంగా చెప్పుకుంటే కర్ణుడు అపజయాలు అవమానాలు ఎన్నో ఉంటాయి. వాటన్నింటి ముందు మీ కష్టాలు చాలా తేలికపాటిగా అనిపిస్తాయి. కాబట్టి సమస్యలు, కష్టాలు నాకే వస్తాయని పదేపదే అనుకోకుండా వాటిని ఎలా అధిగమించాలో ఆలోచించండి. సమస్యలను స్వీకరించడం మొదలుపెడితే అవన్నీ చాలా చిన్నవిగా కనిపిస్తాయి. కొన్నాళ్లకి అవి సమస్యలుగా కూడా కనిపించవు.