Thursday Thoughts: బ్రేకప్ గాయానికి ఇలా మందు పూయండి, నొప్పి త్వరగా మానిపోతుంది
Thursday Thoughts: ప్రతి ఒక్కరి జీవితంలో బ్రేకప్ జరగడం అనేది ఎక్కవ జరిగే అంశమే. కానీ కొందరు ఆ బ్రేకప్ వల్ల తీవ్ర మానసిక వేదనకు గురవుతారు. అలాంటి వారు ఆ బ్రేకప్ నుంచి ఎలా బయటపడాలో తెలుసుకండి
ప్రేమ కోసం తపించి బ్రేకప్ మిగిల్చిన వేదనతో కుంగిపోతున్నారా? మీ మధ్య దూరం అంతులేని దుఃఖాన్ని మిగిల్చిందా? ఒంటరితనమే ఇప్పుడు కొత్త బంధమైందా? పదే పదే తలుచుకుంటూ ఆ బాధనే ఆనందిస్తున్నారా? ఆ బాధే మీ మధ్య చివరి కనెక్షన్‌గా భావించి అందులోనే ఉండిపోతున్నారా? ఒక్క అడుగూ ముందుకు వేయలేకపోతున్నారా? అలా అయితే మీ జీవితం ముందుకు సాగలేదు. బ్రేకప్ నుంచి బయటపడితేనే మీరు ఏదైనా సాధించగలరు.
ప్రేమ బంధం బీటలు వారినప్పుడు మీ గుండె బద్దలవడం, మీరు అగాథంలోకి పడిపోయినట్టు నీరసించడం సర్వ సాధారణం. కానీ మీ జీవితం అక్కడే ఆగిపోకూడదు. ముందుకు సాగడానికి మీరు ఒక్కో అడుగు ముందుకు వేయాలి. ఈ సమయంలో మీరు ఒంటరిగా లేరని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. లక్షలాది మంది ఈ బాధను అనుభవించి బయటకు వచ్చిన వారేనని గుర్తుంచుకోవాలి. ఈ అగాథం నుంచి గట్టెక్కడానికి ఏం చేయాలో తెలుసుకోండి. దేని సహాయం అవసరమో ఇక్కడ చూడండి.
వాస్తవాన్ని గుర్తించండి
వాస్తవాన్ని అంగీకరించండి. మీ భావోద్వేగాలను సమాధి చేయడానికి ప్రయత్నించవద్దు. ఏడ్వడం, కోపంగా లేదా విచారంగా ఉండడం ఈ సమయంలో సహజం. మీరు కోలుకునే క్రమంలో ఈ భావాలు సర్వ సాధారణం. మీ భావాలను స్నేహితుడు, కుటుంబ సభ్యుడు లేదా థెరపిస్టుతో పంచుకోండి. లేదా వారికీ తెలియాల్సిన పనిలేదనుకుంటే ఒక జర్నల్ లో రాసుకోండి. అలాగే ఈ సమయంలో మిమ్మల్ని మీరు ప్రేమించడం నేర్చుకోండి. బాగా తినండి. తగినంత నిద్ర పొందండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడానికి ప్రయత్నించండి. మీరు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటే మానసికంగా ఫిట్ అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు.
మీలో కొత్త వ్యక్తిని చూడండి
మీ ప్రేమ మీ భాగస్వామికి అర్థం కాలేకనో, లేక తన ప్రేమ మీకు అర్థం కాలేకనో, అభిప్రాయ భేదాలో మీ మధ్య దూరం పెంచి ఉంటాయి. కానీ మీ మనుసును అర్థం చేసుకునే ఆత్మీయులు ఒక్కరైనా ఉంటారు కదా. ప్రియమైనవారితో సమయాన్ని గడపడం ద్వారా మీరు గాయాల నుంచి ఉపశమనం పొందవచ్చు.
మీకు నచ్చిన అభిరుచి లేదా యాక్టివిటీని తెలుసుకోండి. మీకు ఆనందాన్ని కలిగించే కార్యకలాపాలలో పాల్గొనండి. మీలో కొత్త వ్యక్తిని కనుగొనండి. అంతేగానీ చెడు వ్యసనాలకు బానిసై మిమ్మల్ని మరింత కోల్పోకండి. కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడం మీ ఆత్మగౌరవాన్ని పెంచడానికి సహాయపడుతుంది.
ప్రతికూల ఆలోచనలను తిప్పి కొట్టండి
మీ మనస్సులో నడుస్తున్న ఆలోచనలపై దృష్టి పెట్టండి. అవి సహాయపడతాయా లేదా హానికరమా? ప్రతికూల ఆలోచనలను సానుకూల ఆలోచనలతో భర్తీ చేయండి. మీ ప్రేమ అందరికీ నచ్చాలని లేదు కదా. అసలు అవతలి వైపు నుంచి లేని ప్రేమను ఉన్నట్టుగా భావించి, ఇప్పుడు కోల్పోయినట్టుగా భ్రమ పడుతున్నారేమో ఆలోచించండి. మీరు కోల్పోయిన వాటిపై దృష్టి పెట్టడానికి బదులుగా, మీరు ఏమి పొందారో లేదా మీరు దేనికి కృతజ్ఞతతో ఉన్నారో దానిపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి. ధ్యానం లేదా లోతైన శ్వాస వంటి పద్ధతులు మీకు ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి.
చికిత్స తీసుకోవడంలో తప్పులేదు
మీ భావోద్వేగాలను ఎదుర్కోవటానికి, ముందుకు సాగడానికి థెరపిస్టు సాయం తీసుకోవడంలో ఎలాంటి తప్పులేదు. మీరు ముందుకు సాగడానికి థెరపిస్టు సాయం చేస్తారు. ఇలాంటి అనుభవాలను ఎదుర్కొన్న ఇతరులతో కనెక్ట్ కావడం ఓదార్పునిస్తుంది. అలాగే నయం కావడానికి కొంత సమయం పడుతుందని కూడా గ్రహించండి.
చిన్న చిన్న విజయాలు మీ దరి చేరినప్పుడు మిమ్మల్ని మీరు ప్రశంసించుకోండి. మీరు కోలుకునే సమయంలో ఇది మరింత మేలు చేస్తుంది. ప్రేమ బంధాలు బీటలు వారడం జీవితంలో ఒక సాధారణ పరిణామం. ధైర్యంగా ఈ సవాలును అధిగమించవచ్చు. మునుపటి కంటే బలంగా ముందుకు సాగడానికి ఈ నొప్పిని ఒక ఇంధనంగా మార్చుకోండి.