Sandalwood Face Pack : వేసవిలో చందనంతో కూలింగ్ ఫేస్ ప్యాక్స్.. ఒక్కసారి ట్రై చేసి చూడండి
Sandalwood Face Packs In Telugu : చందనం చర్మానికి ఎంతో మంచి చేస్తుంది. అయితే దీనితో ఫేస్ ప్యాక్స్ వేసుకుంటే ఈ వేసవిలో మీ ముఖం మెరిసిపోతుంది.
మన ముఖం ఎల్లప్పుడు కాంతివంతంగా మెరిసిపోవాలని కోరుకుంటాం. ముఖ్యంగా మహిళలు అందరికంటే ప్రత్యేకంగా కనిపించాలని తహతహలాడుతుంటారు. ముఖ్యంగా సమ్మర్ సీజన్ రాగానే మనం ముందుగా గమనించేది చర్మ సంరక్షణ. కొన్ని నిమిషాలు బయటికి వెళ్లడం వల్ల ముఖంలోని మెరుపు పూర్తిగా మారిపోతుంది. ప్రస్తుతం ఎండలు మనపై ఎంతగా ప్రభావం చూపుతున్నాయి. ఇంకా చాలా రోజులు విపరీతంగా ఎండలు దంచికొట్టనున్నాయి. ఇలాంటి సమయంలో మీ ముఖాన్ని మెరిసేలా ఉంచుకోవడం మీ బాధ్యత.
ఈ వేసవిని తట్టుకుని మీ చర్మాన్ని కాంతివంతంగా మార్చేందుకు చందనం సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. చందనం చేసే ఫేస్ ప్యాక్ గురించి తెలుసుకుందాం. ఇలా వారానికి ఒక్కసారైనా ఫేస్ ప్యాక్ చేస్తే చర్మం మెరుస్తుంది.
మనందరికీ తెలిసిన చందనం అందరికీ ఇష్టమైనది. మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది. సహజసిద్ధంగా లభించే గంధంలో చర్మానికి హాని కలిగించని అనేక గుణాలు ఉన్నాయి. చందనం వాడటం వల్ల ముఖం మెరుపు పెరగడమే కాకుండా స్మూత్ గా మారుతుంది. గంధాన్ని సాధారణంగా సబ్బులు, సౌందర్య సాధనాల తయారీకి ఉపయోగిస్తారు. ఇది సహజ యాంటీసెప్టిక్‌గా కూడా పనిచేసి చర్మానికి పూర్తి రక్షణను అందిస్తుంది.
ముఖ్యంగా మొటిమలను కలిగించే బ్యాక్టీరియాతో పోరాడడంలో సహాయపడుతుంది. ఇది చర్మంలోని మలినాలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. ప్రధానంగా చర్మాన్ని మృదువుగా మార్చుతుంది. పొడి, ముడతలు పడిన చర్మాన్ని పునరుద్ధరిస్తుంది. కానీ చాలా మందికి చందనాన్ని ఎలా ఉపయోగించాలో తెలియదు. అందుకే సింపుల్‌గా ముఖానికి ఎలా అప్లై చేయాలో చూద్దాం.
పాలతో చందనం ఫేస్ ప్యాక్
గంధపు పొడి ఒక టీస్పూన్ తీసుకోండి. పౌడర్ లేకపోయినా చందనం చాలా బాగుంటుంది. చందనం ముఖ్కను కొన్ని నీళ్లలో కరిగించి రాయిపై రుద్దితే పేస్ట్‌లా తయారవుతుంది. ఈ మిశ్రమంలో ఒక టీస్పూన్ పాలు లేదా ఒక టీస్పూన్ రోజ్ వాటర్ వేసి మరో టీస్పూన్ పసుపు కలపండి. పసుపు యాంటిసెప్టిక్‌గా పనిచేస్తుంది. పాలు మాయిశ్చరైజర్‌గా పని చేస్తాయి. రోజ్ వాటర్ చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. 20 నిమిషాలు పూర్తిగా ఆరనివ్వండి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికోసారి ఇలా ఫేస్ ప్యాక్ చేయండి. ఫలితం మీకే తెలుస్తుంది. మొటిమలు, మచ్చలు వచ్చినా అన్నీ పోతాయి.
నిమ్మరసం, చందనం ఫేస్ ప్యాక్
జిడ్డు చర్మం ఉన్నవారికి ఇది బెస్ట్ ఫేస్ మాస్క్. దీన్ని సిద్ధం చేయడానికి, నిమ్మరసంలో కొంత గంధపు పొడి మిక్స్ చేసి పేస్ట్‌లా చేయాలి. తర్వాత ఈ పేస్ట్‌ని ముఖమంతా రాసి ఆరనివ్వాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని కడగాలి. మీరు ఇలా చేస్తే ఇది చర్మంలో స్రవించే సెబమ్ అనే ప్రధాన పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. ముఖం రంధ్రాలను బిగుతుగా చేస్తుంది.
తేనెతో ఇతర పదార్థాలు
ఈ ఫేస్ ప్యాక్ సిద్ధం చేయడానికి, 1 టీస్పూన్ దోసకాయ రసం, 1 టీస్పూన్ నిమ్మరసం, అర టీస్పూన్ తేనె, 1 టీస్పూన్ టమోటా రసం, 3 టీస్పూన్ల గంధపు పొడిని కలిపి మెత్తని పేస్ట్‌లా తయారు చేయాలి. దీన్ని ముఖానికి పట్టించి 25 నిమిషాల పాటు ఆరనివ్వండి. గోరువెచ్చని నీటితో కడిగేయండి. ఈ ఫేస్ ప్యాక్ ముఖంపై వివిధ రకాల నష్టాలను నయం చేయడంలో సహాయపడుతుంది.
దోసకాయతో ఫేస్ ప్యాక్
దీన్ని సిద్ధం చేయడానికి, 2 టేబుల్ స్పూన్ల పెరుగు లేదా దోసకాయ రసాన్ని సమాన మొత్తంలో గంధపు పొడిని కలపండి. తర్వాత దీన్ని ముఖంలోని ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయండి. కాసేపు ఆరనివ్వండి. ఆపై మీ ముఖం కడగాలి. ఈ ఫేస్ మాస్క్‌తో మీరు తక్షణ పరిష్కారాలను పొందుతారు.
గుడ్డు చందనం ఫేస్ ప్యాక్
గుడ్డు, చందనం ఫేస్ ప్యాక్ చర్మం ఆకృతిని మెరుగుపరుస్తుంది. ముడతలు రాకుండా చేస్తుంది. దీని కోసం 1 గుడ్డు పచ్చసొన, 1 టీస్పూన్ పెరుగు, 3-4 టీస్పూన్ గంధపు పొడిని తీసుకుని ఫేస్ ప్యాక్ లాగా కలపండి. తర్వాత ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి. మీ ముఖం మెరిసిపోతుంది.