Chanakya Niti । మితిమీరిన కోపం వచ్చినపుడు ఆచార్య చాణక్యుడి వ్యూహం అనుసరించండి!
Chanakya Niti: కోపాన్ని కూడా సరైన రీతిలో వ్యక్తపరచడం తెలిసి ఉండాలి. ఆచార్య చాణక్యుడి నీతిశాస్త్రం ప్రకారం, మీకు కోపం వచ్చినపుడు గుర్తుపెట్టుకోవాల్సిన నియమాలు ఇక్కడ తెలుసుకోండి.
Chanakya Niti: తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష అనే సూక్తిని మనం చాలాసార్లు విని ఉంటాం. అయితే ఎవరికైనా కోపం రావడం అనేది సహజం. కానీ ఆ కోపం అనేది అదుపు చేసే స్థాయిలో ఉండాలి. మితిమీరిన కోపం అనర్థాలకు దారితీస్తుంది. కొన్నిసార్లు కొందరికి కోపం వస్తే అదుపు చేసుకోలేరు, కట్టలు తెంచుకునే వచ్చే కోపంతో మీరు చేయాల్సిన పనులు తప్పుదారి పడతాయి. ఇది మీ బంధాలను చెడగొడుతుంది. ముఖ్యంగా అది మీ ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. అనియంత్రిత కోపం తలనొప్పి, ఆందోళన, అధిక రక్తపోటుకు దారితీస్తుంది.
ఆచార్య చాణక్యుడు ప్రకారం, కోపాన్ని సముచితంగా వ్యక్తీకరించినట్లయితే, అది సానుకూలమైన, ఉపయోగకరమైన భావోద్వేగం కావచ్చు. చాలా సార్లు మనకు కోపం వచ్చినప్పుడు ఏమి చేయాలో తెలియదు, అయితే ఆచార్య చాణక్యుడి సూత్రాలు మీరు కోపాన్ని అదుపు చేసుకోవడంలో లేదా మీ కోపాన్ని ఉపయోగకరంగా మార్చుకోవడంలో తోడ్పడవచ్చు. మితిమీరిన కోపం విషయంలో చాణక్య వ్యూహం మీకు మంచి మార్గదర్శకంగా ఉంటుంది.
ఆలోచనాత్మకంగా మాట్లాడండి
ఏ వ్యక్తి అయినా ఆలోచించిన తర్వాతే మాట్లాడాలి అంటారు ఆచార్య చాణక్యుడు. ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో తెలిసి ఉండటం చాలా ముఖ్యం ఎందుకంటే, మీరు కోపంలో మాట్లాడిన పదాలను తర్వాత వెనక్కి తీసుకోలేరు. చాణక్యుడి మాటలోని అర్థం ఏమిటంటే, కోపం కూడా ఆలోచనాత్మకంగా ఉండాలి, మీరు మాట్లాడే మాటలు ఎదుటి వారి మనసులో మీపై గౌరవం కలిగించేలా ఉండాలి. ఒక వ్యక్తి జీవితంలో కోపంతో ఇలాంటి సంఘటనలు చాలా తరచుగా ఎదురవుతాయి. కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మలుచుకోవాలి.
మీ స్వరాన్ని నియంత్రించండి
మీకు కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని వ్యక్తపరచడంలో తప్పులేదు, కానీ మీ స్వరం నియంత్రణలో ఉండాలి. గట్టిగా అరిచినంత మాత్రాన ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీరు ఉపయోగించే పదజాలం ఎదుటి వారి మనసును గాయపరుస్తుంది, అదే సందర్భంలో వారు నియంత్రణ కోల్పోయి మీపై మాటలు అన్నప్పుడు మీరూ నొచ్చుకుంటారు. ఇది ప్రభావం కొంత సమయం తర్వాత ఉంటుంది, తర్వాత పశ్చాతాపం చెందాల్సి వస్తుంది.
వెంటనే స్పందించవద్దు
ఆచార్య చాణక్యుడు దేనికీ కూడా వెంటనే స్పందించకూడదని చెప్పారు. తక్షణ ప్రతిస్పందన కారణంగా మనం చాలాసార్లు సరైన పదాలను ఉపయోగించలేము. ఇది అవతలి వ్యక్తికి తప్పుడు సంకేతాలను ఇస్తుంది. కాబట్టి దేనికైనా ప్రతిస్పందించే ముందు ఒక్క క్షణం ఆలోచించండి, కొన్నిసార్లు ఏమీ మాట్లాడకపోవడం ద్వారా కూడా మీ స్పందనను తెలియజేయవచ్చు. ఎవరైనా ఏదైనా అన్నప్పుడు కొంచెం ఆగి సరైన రీతిలో ప్రతిస్పందించండి.
ఆచార్య చాణక్యుడి ప్రకారం కోపాన్ని మించిన అగ్ని లేదు. అది అందరినీ దహించి వేస్తుంది, కాబట్టి అగ్నిని రగిలించకుండా ప్రశాంత మార్గాన్ని ఎంచుకోండి.
సంబంధిత కథనం