Anger Management | కోపాన్ని అదుపు చేసుకోలేకపోతున్నారా? ఇవిగో మార్గాలు!
కోపాన్ని ప్రదర్శించడం వల్ల మీ ప్రియమైన వారి మనసు నొచ్చుకుంటుంది. ఎదుటివారికి మీ వ్యక్తిత్వంపై ప్రతికూల భావం ఏర్పడుతుంది. కోపాన్ని ప్రదర్శించి ఆ తర్వాత బాధపడటం కంటే ఈ చిట్కాలను పాటించి కోపాన్ని అదుపులో పెట్టండి.
కోపం కూడా ఒక భావోద్వేగమే. కొన్ని బాహ్య కారకాలకు ప్రతిఘటనగా ఈ భావోద్వేగం ఉద్భవిస్తుంది. మనకు అన్యాయం జరిగినప్పుడు, అణచివేతకు గురైనప్పుడు లేదా అవమానాలకు గురైనప్పుడు మన శరీరం ప్రతిస్పందిస్తుంది. మనకు తెలియకుండానే మన శరీరంలో అడ్రినలిన్ హార్మోన్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ హర్మోన్ క్రియాశీలత మనలో ఉద్రేకానికి కారణమవుతుంది, అది కోపంగా బయటకు వస్తుంది. ఒక్కోవ్యక్తి ఒక్కోలా కోపాన్ని వ్యక్తం చేస్తారు. కొందరికి కోపం సర్రుమని నశాలానికి ఎక్కి గట్టిగా అరుస్తారు. అగ్గిమీద గుగ్గిలం అవుతారు. ఇంకొందరు దొరికింది పగలగొట్టేస్తారు, ఇంకొందరు అతడు సినిమాలో మహేష్ బాబులా గోడకు గుద్ది తమ కోపాన్ని ప్రదర్శిస్తారు. అయితే కొంతమంది మాత్రమే తమ కోపాన్ని చాలా సున్నితంగా వ్యక్తం చేస్తారు. అది అందరికీ సాధ్యం కాదు, అదొక ఆర్ట్. దీనివల్ల వారు 'కూల్' అని పేరుగడిస్తారు.
కొందరికి పట్టరాని కోపం ఉంటుంది, దీంతో ఎదుటివారిపై ఇష్టారీతిన తమ కోపాన్ని ప్రదర్శిస్తారు. ఆ తర్వాత బాధపడతారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇది వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడమే సామాజికంగా ఇబ్బందులకు గురిచేస్తుంది. ఆరోగ్యపరంగానూ మంచిది కాదు. అయితే మీరూ ఈ కోవలోకి చెందితే, మీరు మీ కోపాన్ని అదుపు చేసుకోవాలని భావిస్తే ఇక్కడ కొన్ని సూచనలు ఉన్నాయి. వీటి ద్వారా కొంతమేర మీ కోపాన్ని నియంత్రించుకోవచ్చు.
దూరంగా ఉండండి
కోపంతో మాట్లాడే మాటలు మీ ప్రియమైన వారిని నొచ్చుకునేలా చేస్తాయి. కోపం వచ్చిన క్షణంలో వాగ్వాదం పెంచకుండా అక్కడ్నించి దూరంగా వెళ్లిపోండి. కొద్దిగా అటూఇటూ తిరుగుతూ మీ మూడ్ మార్చుకోండి.
నేనే కరెక్ట్
మీ వైపు తప్పు ఉంటే ఆ తప్పును అంగీకరించండి. తప్పును ఒప్పుకోవడంలో తప్పులేదు. ‘ఎల్లప్పుడూ నేనే కరెక్ట్’ అనే సుపీరియారిటీ కాంప్లెక్స్ నుంచి బయటపడేందుకు అందరూ ప్రయత్నించాలి. ఆత్మవిమర్శ చేసుకొని మరోసారి ఆ పరిస్థితి తలెత్తకుండా చూసుకోవాలి.
అసంతృప్తిని వ్యక్తం చేయండి
పరిస్థితులను చాలా పరిణితితో డీల్ చేయండి. మీకు ఒకరి వల్ల ఇబ్బంది కలిగినపుడు వారిపై అసహ్యకరంగా దూషణలకు దిగకుండా ఇది కరెక్ట్ కాదని చెప్పండి. కోపానికి బదులు అసంతృప్తిని వ్యక్తం చేయండి.
క్షమించండి
కొన్నిసార్లు వారివైపు నుంచే తప్పులు దొర్లినప్పటికీ అందుకు వారిపై కోపాన్ని ప్రదర్శించకుండా కుదిరితే క్షమించండి. మరోసారి జరగకుండా హెచ్చరించండి మొత్తానికి వారిని మన్నించండి.
యోగా- ధ్యానం
మనసు మీద నియంత్రణ ఉండాలన్నా, ప్రతికూల ఆలోచనలను తగ్గించాలన్నా యోగా, ధ్యానానికి మించిన ప్రత్యామ్నాయం లేదు. ప్రతిరోజూ యోగా, ధ్యానం లాంటివి చేయడం వలన భావోద్వేగాలు అదుపులో ఉంటాయి. అలాగే అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
సంబంధిత కథనం