Chanakya Niti | ఉద్యోగ వ్యాపారాలలో విజయం సాధించడానికి చాణక్యుడు చెప్పిన సూత్రాలు
విజయం సాధించాలంటే అందుకు దారులు కఠినంగా ఉంటాయి. కానీ కష్టపడే వారికి అది మామూలు విషయమే. ఆచార్య చాణక్యుడు కూడా చెప్పింది ఇదే. ఉద్యోగంలో, వ్యాపారంలో, జీవితంలో విజయం సాధించాలంటే చాణక్యుడి నీతి సూత్రాలు తెలుసుకోండి.
ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్ర శ్లోకాల ద్వారా జీవితానికి మనిషి సంబంధించిన అనేక విషయాలు తెలియజేశారు. కర్మ ఫలితాలు, జీవితసత్యాల గురించి పరిపూర్ణమైన వివరణలు ఇచ్చారు. మనిషి తన జీవితంలో అనుభవించే సుఖదుఃఖాలు, కష్టనషాలు అన్నీ అతడు చేసిన కర్మల ఫలమేనని పేర్కొన్నారు. ఒక వ్యక్తి వర్తమానం, భవిష్యత్తు అతడి పూర్వ జన్మల కర్మల ఆధారంగా నిర్ణయించి ఉంటాయని తెలిపారు. కాబట్టి, వ్యక్తి తన జీవితాన్ని ధర్మంతో, నీతి నియామాలను పాటిస్తూ ఆదర్శవంతంగా జీవించాలి, అవే తనను ఏనాటికైనా ఉన్నత స్థానంలో నిలబెడతాయని నీతి శాస్త్రంలో వివరించారు.
వైవాహిక జీవితం, ఉద్యోగం-వ్యాపారం మొదలైన వాటికి సంబంధించిన అనేక విషయాలను కూడా చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ప్రస్తావించారు. ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే ఎలాంటి సూత్రాలను పాటించాలో సవివరంగా తెలియజేశారు.
Chankaya Niti
కెరీర్‌లో విజయం సాధించటానికి ఆచార్య చాణక్యుడు అందించిన కొన్ని నీతి సూత్రాలను ఇక్కడ జాబితా చేస్తున్నాం. అవేంటో మీరూ తెలుసుకోండి.
లక్ష్యం ఉండాలి
ముందుగా మీరు మీ రంగంలో ఉన్నత స్థితిలో ఉండాలంటే ఒక లక్ష్యం అంటూ ఏర్పరుచుకోవాలి. మీ లక్ష్యానికి చేరుకోవటానికి దారులు ఏమున్నాయో ప్లాన్ చేసుకోవాలి. ఇలా ఒక లక్ష్యం అంటూ ఉండి, ఆ దిశగా పయనం అంటూ మొదలుపెడితే విజయం అనేది తప్పక సిద్ధిస్తుంది.
కష్టపడే తత్వం
ఆచార్య చాణక్య ప్రకారం, మీరు జీవితంలో మీ లక్ష్యాలను సాధించాలనుకుంటే, మీ శ్రమను నమ్ముకోండి. జీవితంలో ఎవరికీ ఏదీ సులభంగా లభించదు, శోధించి సాధించాల్సిందే. మీకోసం మీరు కష్టపడండి, క్రమశిక్షణతో పనిచేయండి. మీ కష్టపడే తత్వమే మీ లక్ష్యాలను ముద్దాడేందుకు మీకు సహాయపడుతుంది.
నమ్మకం- విధేయత
మీరు చేసే పనిని ముందుగా నమ్మండి. మీరు చేపట్టిన పనిపై మీకే నమ్మకం లేకపోతే ఆ పని ముందుకు సాగదు. పని పట్ల విధేయత చూపండి. నిర్లక్ష్యం ఎంత మాత్రం తగదు. మీరు చేసే పనిలో నిజాయితీగా ఉంటే, మీ విజయాన్ని ఆపడం ఎవరితరం కాదు. కానీ, పనిపై విధేయత అనేది లేకపోతే మీ ప్రతిష్ట కూడా దిగజారే ప్రమాదం ఉంటుంది.
రిస్క్ తీసుకోవడానికి భయపడకండి
ధైర్యే సాహసే లక్ష్మీ అంటారు.. కాబట్టి రిస్క్ ఎప్పుడూ తీసుకోవడానికి భయపడకండి. సరైన సమయంలో సరైన నిర్ణయం ధైర్యంగా తీసుకోవడం వలన మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. క్లిష్ట పరిస్థితుల్లో భయపడవద్దు, స్పష్టమైన నిర్ణయం తీసుకోవడంలో వెనకడుగు వేయవద్దు, వైఫల్యానికి భయపడవద్దు. ఏదేమైనా ప్రయాణం ఆపకుండా ముందుకు సాగిపోవాలి.Cj
సంబంధిత కథనం