Mughal Jewellery: కోట్లు విలువ చేసే ఖరీదైన మొఘల్ ఆభరణాలు ఇవన్నీ, ఇప్పుడు ఎక్కడ ఉన్నాయంటే
Mughal Jewellery: మన దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన వంశాలలో మొఘల్ వంశం ఒకటి. అత్యంత ధనిక సామ్రాజ్యం కూడా మొఘల్ రాజ్యమే. వారి అరుదైన, ఖరీదైన ఆభరణాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం.
Mughal Jewellery: మన భారతదేశాన్ని పాలించిన అత్యంత ధనిక వంశం మొఘల్ సామ్రాజ్యం. మన దేశంలో 1526వ సంవత్సరంలో అడుగు పెట్టింది మొఘల్ వంశం. తైమూరు వంశానికి చెందిన బాబరు ఒకటో పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడిని ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని భారత దేశంలో స్థాపించారు. అప్పటినుంచి రెండు వందల ఏళ్లకు పైగా మొఘల్ చక్రవర్తులు మన దేశాన్ని పాలించారు. మొఘల్ ఆభరణాలు, కళాఖండాలు ఎంతో అందమైనవి, ఖరీదైనవి. బాబరు, షాజహాన్, జహంగీరు, వారి భార్యలు వేసుకున్న ఎన్నో ఆభరణాలు ఇప్పటికీ ప్రపంచం నలుమూలలా ఉన్నాయి. వారి అభరణాలలో అత్యంత ఖరీదైనవి, ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
తాజ్ మహల్ నెక్లెస్
గుండె ఆకారంలో ఉండే తాజ్ మహల్ నెక్లెస్ ఎంతో ఖరీదైనది. దీనిలో గుండె ఆకారంలో ఉండే డైమండ్ ఉంటుంది. షాజహాన్ తండ్రి జహంగీర్ తన భార్య అయిన నూర్జహాన్ కి బహుమతిగా దీన్ని ఇచ్చారు. ఇది హాలీవుడ్ నటి ఎలిజిబెత్ టేలర్ వద్దకు చేరింది. ఆమె తన భర్తకు బహుమతిగా ఇచ్చింది. 2011లో న్యూయార్క్‌లో దీన్ని వేలం వేశారు. ఆ వేలంలో 88 లక్షల డాలర్లకు ఇది అమ్ముడుపోయింది.
తాజ్ మహల్ ఎమరాల్డ్
ఈ పచ్చను 1630-1650 మధ్య తయారు చేశారు. ఆ తర్వాత మొఘల్ వంశం నాశనం అయ్యాక ఈ ఎమరాల్డ్ కనుమరుగయ్యింది. తిరిగి 1925లో ప్యారిస్‌లో కనిపించింది. 2009లో దీన్ని న్యూయార్క్ లో వేలం వేయగా 80 లక్షల డాలర్లకు ఖతార్ కు చెందిన ఓ కుటుంబం కొనుగోలు చేసింది. అత్యంత ఖరీదైన మొఘల్ ఆభరణాలలో ఇది ఒకటి.
మొఘల్ స్పైనెల్ నెక్లెస్
ఇది అందమైన నెక్లెస్. దీనిలో ఖరీదైన డైమండ్ ఉంది. ఆ డైమండ్ బరువు 1131 క్యారెట్లు. ఈ నెక్లెస్‌లోని స్పైనెల్స్‌లో మూడు చక్రవర్తి జహంగీర్ పేరు మీద ఉంటాయి. తర్వాత షాజహాన్, ఔరంగజేబు చక్రవర్తుల పేర్లు కూడా చెక్కి ఉన్నాయి. దీన్ని 2014లో జెనీవాలో వేలం వేశారు. 25 లక్షల డాలర్లకు ఇది అమ్ముడుపోయింది.
అక్బరు వజ్రం
అక్బర్ ధరించిన ఖరీదైన వజ్రం ఇది. తర్వాత అది షాజహాన్ దగ్గరకు చేరింది. షాజహాన్ దీన్ని రెండు ముఖాల వజ్రంగా మార్చాడు. షాజహాన్ నుంచి ఇది ఎవరి దగ్గరకు చేరిందో తెలియలేదు. చాలా కాలం పాటు దీని ఆచూకీ లేదు. తర్వాత 1866లో టర్కీలో షెఫర్డ్ స్టోన్ అనే పేరుతో ఇది బయటపడింది. 1866లో ఒక లండన్ వ్యాపారి దీన్ని కొనుక్కున్నాడు. తర్వాత దీన్ని బరోడా మహారాజుకు 33 వేల డాలర్లకు అమ్మేశాడు. ఇప్పుడు ఈ వజ్రం గైక్వాడ్ కుటుంబం ఆధీనంలో ఉంది.
అతిపెద్ద పచ్చ
పచ్చలను ఎమరాల్డ్ అని పిలుస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎమరాల్డ్‌లో ఒకటి మొఘల్ వంశం దగ్గర ఉంది. ఇది చతురస్రాకారంగా ఉంటుంది. దీని బరువు 217 క్యారెట్లు. ఔరంగజేబు పాలనలో ఉన్నప్పుడు ఇది తయారైనట్టు చెబుతారు. ఎందుకంటే దీనిపై ఉన్న శాసనాలు షియాలో రాశారు. కాబట్టి ఇది ఔరంగజేబుకు చెందినదని అర్థమవుతుంది. 2001లో దీన్ని వేలం వేయగా 20 లక్షల డాలర్లకు అమ్ముడుపోయింది.