Friday Motivation: కష్టాలు మీ శత్రువులు కాదు, మీ బలాలనీ బలహీనతల్ని తెలియజేసే నిజమైన మిత్రులు
Friday Motivation: కష్టాల పేరు చెబితేనే ఎంతోమంది తిట్టుకుంటూ ఉంటారు. ఎప్పుడు ఏ కష్టం వస్తుందో అనుకుంటారు. నిజానికి కష్టాలు శత్రువులు కాదు, మీ బలహీనతల్ని బలాలని మీకు తెలియజేసే మిత్రులు.
మనిషికి సుఖాలే కావాలి, ఆనందం మాత్రమే అనుభవించాలి. నిజానికి మనిషి జీవితంలో సుఖదుఃఖాలు కలిసే ఉంటాయి. సుఖం విలువ తెలియాలంటే కష్టాన్ని అనుభవించి తీరాలి. సంతోషం విలువ తెలియాలంటే బాధను చవి చూడాల్సిందే. కష్టాలు వస్తాయని ముందే భయపడుతూ కూర్చుంటే బతకలేరు. తప్పో ఒప్పో అడుగు వేసి చూడాల్సిందే. ఓటమి పాలైతే ఆ ఓటమిలో మీ బలహీనతలు ఏంటో తెలిసిపోతుంది. ఒకవేళ మీరు గెలిస్తే ఆ గెలుపులో ఏది మిమ్మల్ని గెలిపించిందో మీ బలం ఏంటో మీకు అర్థమవుతుంది.
కష్టాలు, ఆపదలు వచ్చినప్పుడు అన్ని దారిలో మూసుకుపోయినట్లే అనిపిస్తుంది. కానీ ధైర్యంగా ఆలోచించి చూడండి. ఎక్కడో దగ్గర ఓ దారి తెరుచుకునే ఉంటుంది.
ధనవంతులకు కష్టాలు ఉండవని అనుకుంటారు. నిజానికి ధనవంతుడికి, కటిక పేదవాడికి ఇద్దరికీ కష్టాలు వచ్చి పోతూనే ఉంటాయి. ధనవంతుడికి వచ్చిన కష్టం బయటికి కనిపించదు. పేదవాడికి వచ్చిన కష్టం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కష్టాలు పగలు రాత్రి లాంటివి వచ్చి పోతూనే ఉంటాయి. 24 గంటల్లో 12 గంటలు చీకటిగానే ఉంటుంది. కానీ మిగతా 12 గంటలు వెలుగు చూపిస్తుంది. ఆ వెలుగు కోసం చీకటిని భరించాల్సిన అవసరం ఉంది.
కష్టాన్ని సుఖాన్ని ఒకేలా చూడడం ప్రారంభించండి. ఎంతటి సమస్య వచ్చినా మీరు దాన్ని తట్టుకునే శక్తిని పొందుతారు. పట్టరాని సంతోషం కలిగినప్పుడు దాన్ని ఎలా తట్టుకోవాలో ఎప్పుడైనా ఆలోచించారా? మరి కష్టం వచ్చినప్పుడు మాత్రం ఎందుకంతగా ఆలోచించి విలవిలలాడి పోతారు? సంతోషం కలిగినట్టే కష్టం కూడా వచ్చి అలా పోతుంది. మీరు చేయాల్సినదల్లా ఆ సమస్యను తొలగించేందుకు చిన్న ప్రయత్నం. ఏరోజు ఒకేలా ఉండదు, ఏ క్షణము మనతో నిలిచిపోదు. అలాగే కష్టాలు పడుతున్న లక్షణాలు కూడా అలా దొర్లిపోయి వెళుతూనే ఉంటాయి. తిరిగి మనల్ని సంతోష క్షణాలకు చేరువ చేస్తూనే ఉంటాయి. అలలు కూడా తీరం చేరేసరికి ఉదృతి తగ్గించుకోవాల్సిందే. సుతారంగా మన పాదాలను తడిపి వెనక్కి వెళ్లాల్సిందే. కష్టాలు కూడా అంతే... సమయం వచ్చినప్పుడు ఓసారి పలకరించి మీ బలహీనతలను మీకు తెలియజేసి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ టైం సమయంలో మీరు ధైర్యంగా ఉండడం ఉంటే చాలు.
చీకటి వెలుగులు ఎంత సత్యమో... జీవితంలో కష్టసుఖాలు కూడా అంతే. ఈరోజు కష్టం వస్తే రేపు కచ్చితంగా సుఖం వచ్చే తీరుతుంది. మీరు కాస్త ఓపికగా, ధైర్యంగా ఆ కష్టాలన్నీ దాటాలి. కష్ట సమయంలోనే మీలో పట్టుదల పెరగాలి. దాన్ని అధిగమించే శక్తి సామర్థ్యాలను తెచ్చి పెట్టుకోవాలి. ఇది మీ జీవితాన్ని మరింత దృఢంగా మారుస్తుంది. ఏ సమస్య వచ్చినా తట్టుకునే శక్తిని మీకు అందిస్తుంది.