Prostate cancer: పురుషుల్లో పెరుగుతున్న ఆ క్యాన్సర్ కేసులు, మగాళ్ళంతా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్న కొత్త అధ్యయనం
Prostate cancer: నిత్యం మనిషి మనుగడ కోసం ఏదో ఒక అధ్యయనం సాగుతూనే ఉంటుంది. ఆ అధ్యయన ఫలితాలు అప్పుడప్పుడు బయటకి వస్తూ ఉంటాయి. అలాంటి అధ్యయనంలో ఒకటి ప్రొస్టేట్ క్యాన్సర్ పై జరిగింది.
Prostate cancer: పురుషులకు మాత్రమే వచ్చే క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్. ఈ క్యాన్సర్ కేసులు ఇప్పటికే పెరుగుతున్నాయి. 2040 కల్లా రెట్టింపు కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు ఒక అధ్యయనం చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో సాధారణంగా వస్తున్న క్యాన్సర్లలో ప్రొస్టేట్ క్యాన్సర్ ఒకటి. వచ్చే 20 ఏళ్లలో ఈ క్యాన్సర్ బారిన పడే సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉన్నట్టు లాన్సెట్ నివేదికప్రచురించిన అధ్యయనం చెప్పింది.
2020లో 14 లక్షల మంది పురుషులు ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన పడినట్టు తేలింది. 2040 కల్లా ఈ సంఖ్య 29 లక్షలకు చేరే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. పురుషుల్లో వచ్చే మొత్తం క్యాన్సర్ కేసులలో 15% ఈ ప్రొస్టేట్ క్యాన్సరే.
ప్రొస్టేట్ క్యాన్సర్ అంటే...
ప్రొస్టేట్ క్యాన్సర్ పురుషులకు మాత్రమే వచ్చే క్యాన్సర్ కాబట్టి వారు జాగ్రత్తగా ఉండాలని ఈ పరిశోధనలు చెబుతున్నాయి. ఈ ప్రొస్టేట్ క్యాన్సర్ అనేది ప్రొస్టేట్ గ్రంధిలో అభివృద్ధి చెందే ప్రాణాంతక క్యాన్సర్ కణితుల వల్ల వస్తుంది.
ఎవరికి వస్తుంది?
ప్రొస్టే్ క్యాన్సర్ రావడానికి అనేక ప్రమాద కారకాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది వయస్సు. ఎవరైతే 50 సంవత్సరాల వయస్సు దాటుతారో వారికి ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. అలాగే కుటుంబ చరిత్రలో ఎవరికైనా ఈ క్యాన్సర్ ఉంటే వారి వారసులకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇతర జాతులతో పోలిస్తే ఆఫ్రికన్ - అమెరికన్ పురుషుల్లో ప్రోస్ట్రేట్ క్యాన్సర్ ను అభివృద్ధి చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే రెడ్ మీట్ ఎక్కువగా తినే వారిలో కూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. పండ్లు, కూరగాయలు తక్కువగా తినే వారికి ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే ఊబకాయంతో బాధపడుతున్న వారు, ఎలాంటి వ్యాయామం చేయకుండా ఎక్కువ గంటల పాటూ ఒకేచోట కూర్చునే వారిలో కూడా ఈ క్యాన్సర్ రావచ్చు.
ప్రొస్టేట్ క్యాన్సర్ లక్షణాలు
ప్రొస్టేట్ కాన్సర్ వస్తే తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. మూత్ర విసర్జన చేయడం కష్టంగా అనిపిస్తుంది. దాన్ని ఆపడం కూడా ఇబ్బందిగానే ఉంటుంది. మూత్రం లేదా వీర్యంలో రక్తం కనిపిస్తుంది. రక్త పరీక్షల ద్వారా ఈ క్యాన్సర్ ఉందో లేదో తెలుసుకుంటారు. అలాగే మల పరీక్షలు, స్క్రీనింగ్ టెస్ట్ లు కూడా చేస్తారు.
టాపిక్