Marriage: పెళ్లి చేసుకోని వారిలో 80 శాతం మందికి డిప్రెషన్ ముప్పు, జాగ్రత్తగా పడండిలా
Marriage: సమాజంలో పెళ్లికి ఎంతో ప్రాధాన్యత ఉంది. కానీ కొంతమంది పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు. అయితే పెళ్లి చేసుకోకపోవడం వల్ల కొంతమంది డిప్రెషన్ బారిన పడే అవకాశం ఉంది.
ప్రపంచవ్యాప్తంగా వివాహ వ్యవస్థ గురించి ఎన్నో రకాల అధ్యయనాలు జరుగుతున్నాయి. మకావు పాలిటెక్నిక్ యూనివర్శిటీలో దాదాపు 100,000 మందిపై ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో ఒక షాకింగ్ విషయం తెలిసింది. పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా జీవించేవారికి డిప్రెషన్ వచ్చే అవకాశం 80 శాతం ఎక్కువగా ఉందని వెల్లడైంది. ఈ అధ్యయనంలో అమెరికా, బ్రిటన్, ఐర్లాండ్, మెక్సికో, దక్షిణ కొరియా, చైనా, ఇండోనేషియా దేశాలకు చెందిన వారు పాల్గొన్నారు. 18 ఏళ్లు పైబడిన అవివాహితులను ఈ అధ్యయనంలో భాగం చేశారు.
అధ్యయనంలో భాగంగా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా జీవించే వారిలో 80 శాతం మంది ఒత్తిడి లేదా డిప్రెషన్తో బాధపడుతున్నారని తెలిసింది. అదే పెళ్లయిన వారిలో డిప్రెషన్ బారిన పడేవారి శాతం 40గా ఉన్నట్టు అధ్యయనం వెల్లడించింది. విడాకులు తీసుకున్న వారిలో లేదా జీవిత భాగస్వామి నుంచి విడిపోయిన వారిలో కూడా అనేక రకాల మానసిక సమస్యలు కనిపించాయి.
ఈ అధ్యయనంలో పాల్గొన్న నిపుణులు చాలా మంది వివాహితులకు మద్దతిచ్చే వారు అధికంగా ఉంటారని చెబుతున్నారు. అంతే కాదు వారు ఆర్థికంగా కూడా బలంగా ఉంటారు. అందుకే వారికి మానసిక సమస్యలు తక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఉన్నత విద్యావంతులైన అవివాహిత పురుషులు కూడా మానసిక అభద్రతతో బాధపడుతున్నారని అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనంలో పాల్గొన్న మనస్తత్వవేత్త డాక్టర్ బెల్లా డి పాలో మాట్లాడుతూ వివాహం ఒక పురుషుడు, స్త్రీకి స్థిరత్వాన్ని ఇస్తుందని చెప్పారు. అయితే ఈ అధ్యయనంలో పెళ్లికాని వారి కంటే వివాహిత దంపతుల ఆరోగ్యం మెరుగ్గా ఉందని కనుగొన్నారు.
డిప్రెషన్ లక్షణాలు
డిప్రెషన్ వస్తే కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. ఎక్కువ నిద్రపోతూ ఉంటారు లేదా పూర్తిగా నిద్రని తగ్గించేస్తారు. నిద్రమాత్రలు వేసుకుంటేనే వీరికి నిద్ర వస్తుంది. వారు అన్ని విషయాలపై ఆసక్తిని కోల్పోతారు. విచారంగా కూర్చుంటారు. ఖాళీగా ఉండి ఏ పనీ చేయడానికి ఇష్టపడరు. విపరీతంగా బరువు పెరుగుతారు లేదా తగ్గిపోతారు. ఉదయం నుంచి రాత్రి వరకు శక్తి లేనట్టు నీరసంగా ప్రవర్తిస్తారు.
డిప్రెషన్ సమస్యను చాలా తేలికగా తీసుకుంటారు కానీ ఇది ఒక్కోసారి తీవ్రంగా మారుతుంది. అది మీ దైనందిన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. దీన్ని తీవ్రమైన మూడ్ డిజార్డర్ గా కూడా చెప్పుకుంటారు. వీరికి ఆహారం, నిద్ర, ఆట పాటలపై ఎలాంటి ఆసక్తి ఉండదు.
మనదేశంలో 14 శాతం మంది ప్రజలు డిప్రెషన్ తో బాధపడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో 10 శాతం మందికి వెంటనే వైద్య సాయం అవసరం. మన జనాభాలో 20 శాతం ఏదో ఒక సందర్భంలో డిప్రెషన్ బారిన పడి తేరుకున్నవారేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. మనదేశంలో పది మంది డిప్రెషన్ బారిన పడితే వారిలో ఒకరికి మాత్రమే వైద్య సాయం అందుతోంది. దీన్ని బట్టి భారత్ మానసకి సమస్యలపై అవగాహన ఎంత అవసరమో అర్థమవుతోంది.
టాపిక్