Getting Frequent Colds| మీకు తరచుగా జలుబు చేస్తుందా? కారణం ఇదే!
Getting Frequent Colds: భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని ఇతర దేశాలలో కూడా ఇన్‌ఫ్లుఎంజా లాంటి రోగుల సంఖ్య పెరుగుతోందని నిపుణులు అంటున్నారు. ఈ శీతాకాలంలో ప్రజలు తరచుగా జలుబు చేయడానికి గల కారణాలు ఇక్కడ ఉన్నాయి.
చలికాలంలో ఉష్ణోగ్రతలు పడిపోతున్న క్రమంలో చాలా మందికి దగ్గు, జలుబు రావడం సహజం. అయితే తరచుగా ఈ సమస్య తలెత్తుతుంటే అందుకు వేరే కారణాలు ఉండవచ్చు. ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఇన్ల్ఫుఎంజా లాంటి అనారోగ్యాల పెరుగుదల ధోరణిని గమనించినట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు అలాగే చాలా మంది ప్రజలకు కరోనాకు రోగనిరోధక శక్తిని కూడా కోల్పోతున్నట్లు నిపుణులు స్పష్టం చేశారు. ఒత్తిడి, రాత్రి బాగా నిద్రపోకపోవడం, ఇంట్లోనే ఎక్కువగా గడపడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గడానికి కారణాలుగా ఉన్నాయి. దేశంలో ఇప్పటికీ కరోనా పూర్తిగా అంతం కాకపోగా, మళ్లీ కొత్తకొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. మరోవైపు ప్రజలు కోవిడ్ భయాలను పూర్తిగా వీడి సామాజిక దూరం నిబంధనలు గాలికి వదిలివేశారు. దీనికి అదనంగా, కాలుష్య స్థాయిలు పెరగడం వల్ల అలెర్జీ కేసులు కూడా పెరుగుతున్నాయి.
ప్రజలు కోవిడ్ వ్యాక్సినేషన్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల ఇన్ల్ఫుఎంజా వంటి ఇతర కేసులు పెరుగుతున్నాయి అని ఢిల్లీలోని ఫోర్టిస్ హాస్పిటల్ డాక్టర్ వినీత తనేజా తెలిపారు.
Reasons for Getting Frequent Colds - తరచుగా జలుబు రావడానికి కారణాలు
తరచుగా దగ్గు, జలుబు రావడానికి గల కారణాలను వైద్యులు వెల్లడించారు. వారు జాబితా చేసిన కారణాలేమిటో ఇక్కడ తెలుసుకోండి.
1. ధూమపానం
మీరు ధూమపానం చేసేవారిలో ఒకరు అయితే, మీరు వెంటనే ఆ అలవాటును వదిలించుకోవాలి. ధూమపానం రోగనిరోధక వ్యవస్థ కణాలపై ప్రభావం చూపుతుంది. ఇది తరచుగా జలుబులకు గురవుతుంది. ధూమపానం మానేసి ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నించండి.
2. వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం
మీకు తరచుగా జలుబు, దగ్గు వస్తుందంటే మీ వ్యక్తిగత పరిశుభ్రత కూడా ఒక కారణం కావచ్చు. మీ చేతులను శుభ్రంగా ఉంచుకోండి. సబ్బుతో ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవడం అవసరం. దగ్గినప్పుడు, తుమ్మేటప్పుడు నోటికి అడ్డుపెట్టుకోండి, మాస్క్ ధరించండి. అనారోగ్యంతో ఉన్న వ్యక్తుల నుండి సురక్షితమైన దూరం పాటించండి.
3. ఒత్తిడి
ఒత్తిడి మీ మానసిక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా శారీరక శ్రేయస్సును కూడా దెబ్బతీస్తుంది. ఇది మీ మనశ్శాంతిని హరించివేస్తుంది. ఒత్తిడికి గురికావడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది, జలుబు బారినపడే ప్రమాదం ఉంది. ఒత్తిడి రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది తద్వారా ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి తగ్గుతుంది.
4. తగినంత నిద్ర లేకపోవడం
ప్రశాంతమైన, నాణ్యమైన నిద్రపోలేకపోవడం కూడా మీ రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. జలుబుకు మీ గ్రహణశీలతను పెంచుతుంది. రాత్రిపూట బాగా నిద్రపోవడం అలవాటు చేసుకోండి. శీతాకాలంలో మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండండి.
5. ఇంటి లోపలే ఉండిపోవడం
చలి కారణంగా కావచ్చు లేదా వర్క్ ఫ్రమ్ హోం కారణంగా కావచ్చు. చాలా మంది నాలుగు గోడలకే పరిమితమవుతున్నారు. ఇలా బయటకు అసలే రాకపోవడం వలన కూడా మీ రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. తరచుగా అనారోగ్యానికి గురి అవుతారు. ఇంట్లో ఉండే దుమ్ము, అలెర్జీల కారకాలతో దగ్గు, జలుబు మీకు సర్వసాధరణంగా మారుతుంది.
సంబంధిత కథనం