World Health Day 2022 | మీకు తరచూ జలుబు చేస్తుందా? అయితే జాగ్రత్త
హానికరమైన బాక్టీరియా నుంచి మనలను కాపడడంలో, శరీరంలో వ్యాధిని కలిగించే మార్పులతో పోరాడడంలో రోగనిరోధక వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తి ఇతర వ్యక్తులతో పోలిస్తే ఎక్కువగా అంటువ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. అంత ముఖ్యమైన రోగనిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలి? ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Immunity Boosting | ఆరోగ్యకరమైన శరీరం, మనస్సు కోసం బలమైన రోగనిరోధక శక్తి అవసరం. మన శరీరాన్ని వివిధ వ్యాధులు, పర్యావరణ శక్తుల నుంచి రక్షించేలా రోగనిరోధక వ్యవస్థ బాధ్యత వహిస్తుంది. కానీ.. మన రోజువారీ జీవనశైలి బలహీనమైన రోగనిరోధక శక్తికి దారితీస్తుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తిలో ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, రక్తహీనత, పెనుమోనియా, బ్రోన్కైటిస్, చర్మ వ్యాధులు, జీర్ణ సమస్యలు, అభివృద్ధి ఆలస్యం ఉంటాయి. అంతేకాకుండా అధిక ఒత్తిడి స్థాయిలు, జలుబు, శ్వాసకోశ సమస్యలు, జీర్ణ సమస్యలు, తరచుగా వచ్చే ఇన్‌ఫెక్షన్‌లు, ఎక్కువ అలసట వంటివి బలహీన రోగనిరోధక శక్తికి సంబంధించిన కొన్ని హెచ్చరిక సంకేతాలు.
కారణాలు..
పైన చెప్పిన సంకేతాలు మీకు ఉన్నట్లైతే.. మీరు రోగనిరోధక వ్యవస్థ పట్ల కాస్త అదనపు శ్రద్ధ వహించాలి. మీకు తెలుసా బలహీనమైన రోగనిరోధక శక్తికి ముఖ్యమైన కారణం ఒత్తిడి. ఇది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అంతే కాకుండా ధూమపానం, మద్యపానం, సరైన ఆహారం తీసుకోకపోవడం, అంటువ్యాధులు, క్యాన్సర్ చికిత్సలు, హెచ్ఐవీ లేదా ఎయిడ్స్ వంటివి మరిన్ని కారణాలు కావొచ్చు అంటున్నారు నిపుణులు.
ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహాన కల్పించేదుకు.. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటాం. దీనిలో భాగంగా రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బలహీనమైన రోగనిరోధక శక్తి హెచ్చరిక సంకేతాలు..
* ఎల్లప్పుడూ జలుబుతో ఉంటారు. లేదా తరచుగా జలుబు చేస్తుంది. ఇది రోగనిరోధక శక్తి బలహీనతకు సంకేతం. ఎందుకంటే మీ శరీరం కాలానుగుణ ఇన్ఫెక్షన్లతో పోరాడలేకపోతుంది.
* తరచుగా విరేచనాలు, గ్యాస్ లేదా మలబద్ధకం. జీర్ణ సమస్యలు కూడా మీ రోగనిరోధక వ్యవస్థ పని చేయాల్సిన విధంగా పనిచేయడం లేదని సూచిస్తాయి.
* గాయాలు త్వరగా నయం కాకపోవడం. ఇది కూడా బలహీనమైన రోగనిరోధక శక్తి హెచ్చరిక సంకేతాలలో ఒకటి.
* తరచుగా ఇన్ఫెక్షన్‌లు వస్తాయి. రోగనిరోధక వ్యవస్థ బయటనుంచి వచ్చే.. బ్యాక్టీరియా, వైరస్, హానికరమైన పదార్థాలతో పోరాడలేకపోతే.. తరచుగా ఇన్ఫెక్షన్‌లు రావొచ్చు.
* త్వరగా అలసిపోతారు. అన్నిసార్లు లేదా ఎక్కువసార్లు మీరు ఏదైనా పని చేస్తూ అలసిపోతున్నారా? ఇది కూడా బలహీనమైన రోగనిరోధక శక్తి వల్ల కావచ్చు.
మరి రోగనిరోధక శక్తిని ఎలా మెరుగుపరచుకోవాలి?
కొన్ని జీవనశైలి మార్పులు, కొత్త అలవాట్లు సహజంగా మీ రోగనిరోధక వ్యవస్థను బలంగా, ఆరోగ్యంగా మారుస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
* మీరు తినే వాటిపై శ్రద్ధ వహించాలి. సమతుల్య ఆహారం తినేందుకు ప్రయత్నించాలి.
* మంచి నిద్ర చాలా అవసరం. కనీసం మనిషి 8 గంటలు నిద్రపోవాలి. మనం నిద్రపోతున్నప్పుడు శరీరం తన శక్తిని పునరుద్ధరిస్తుంది. దెబ్బతిన్న కణాలను రిపేర్ చేస్తుంది.
* క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఎందుకంటే ఇది మీ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఆరోగ్యకరమైన శరీరాన్ని, బరువును పొందడంలో ఇది సహాయం చేస్తుంది. అంతేకాకుండా మన శరీరంలో సంతోషకరమైన హార్మోన్లను కూడా ఉత్పత్తి చేస్తుంది. ఇవి ఒత్తిడిని ఎదురించడంలో సహాయపడతాయి.
* తరచూ చేతులు కడుక్కోవాలి. అపరిశుభ్రమైన చేతుల నుంచి సూక్ష్మక్రిములు ఎక్కువగా మన శరీరంలోకి ప్రవేశిస్తాయి.
* ఒత్తిడి స్థాయిని తగ్గించడానికి మైండ్‌ఫుల్‌నెస్, యోగా చేయాలి.
* ధూమపానానికి నో చెప్పాలి.
ఆహారంలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి, ఇతర స్థూల, సూక్ష్మ పోషకాలు ఉండాలి. చక్కెర తగ్గించి.. హైడ్రేటెడ్‌గా ఉండాలి.
సంబంధిత కథనం