Monsoon Yoga । ఈ వర్షాకాలంలో మీ రోగనిరోధక శక్తిని పెంచే 5 అద్భుతమైన యోగసనాలు..!-monsoon yoga poses and breathing exercises to stay healthy ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Monsoon Yoga Poses And Breathing Exercises To Stay Healthy

Monsoon Yoga । ఈ వర్షాకాలంలో మీ రోగనిరోధక శక్తిని పెంచే 5 అద్భుతమైన యోగసనాలు..!

HT Telugu Desk HT Telugu
Jul 31, 2022 08:45 AM IST

ఇంట్లోనే కొన్ని నిమిషాల పాటు యోగసనాలు వేయటం, ధ్యానం చేయడం వంటి అభ్యాసాలు చేయడం ద్వారా మీ ఒత్తిడి, ఆందోళనలు తగ్గించుకోవచ్చు. రోగనిరోధకశక్తిని పెంచుకోవచ్చు. ఈ వర్షాకాలంలో మిమ్మల్ని ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచటానికి సహాయపడే యోగాసనాలు చూడండి.

Monsoon Yoga
Monsoon Yoga (Unsplash)

వర్షాకాలం అనేది మనకు ఆనందం, అనారోగ్యాలను కలిగించే ఒక ప్రత్యేకమైన సీజన్. ఈ మాన్‌సూన్‌లో ఉండే ఆహ్లాదకరమైన వాతావరణం, చల్లగా కురిసే వర్షాలు ప్రజల మానసిక స్థితికి అద్భుత ప్రయోజనాలు చేకూరుస్తుండగా.. అధిక తేమ స్థాయిలు, పొడవైన ట్రాఫిక్ జామ్‌లు, బురద నీటి గుంటలు చికాకును కలిగిస్తాయి. అంతేకాదు ఈ సీజన్‌లో మీ రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. త్వరగా ఇన్‌ఫెక్షన్లు, అనారోగ్య సమస్యల బారినపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

కాబట్టి పోషకాహారం తినడం, బాగా వ్యాయామం చేయడం, ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. అప్పుడే ఈ సీజన్‌ను పూర్తి స్థాయిలో ఆస్వాదించగలుగుతాం. ఆరోగ్యం ఉంటే ఆనందం ఉంటుంది.

మీలోని రోగనిరోధక శక్తిని మెరుగుపరిచి, మీ ఆరోగ్యాన్ని పెంపొందించే అభ్యాసాలలో యోగా ఒకటి. ఈ వర్షాకాలంలో ధ్యానం, యోగా వంటివి మీ శరీరానికి యాంటి-స్ట్రెస్, యాంటీ ఇన్ల్ఫమేటరీ కవచాలను అందిస్తాయి. తద్వారా మిమ్మల్ని అనేక సీజనల్ వ్యాధుల నుంచి రక్షించగలవు. ఈ వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా సాధన చేయాల్సిన కొన్ని యోగాసనాలను ఇక్కడ తెలుసుకోండి.

ప్రాణాయామం

ప్రాణాయామం ఒక గొప్ప శ్వాసక్రియ వ్యాయామం. ఇందులో కపాలభాతి ప్రాణాయామం అనేది ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో పాత్ర పోషిస్తుంది.మెరుగైన ఆక్సిజన్ రవాణా, శ్వాస క్రియకు తోడ్పడుతుంది. మరీ ముఖ్యంగా ఈ ఆసనం అంతర్గత అవయవాలకు మసాజ్ చేస్తుంది. శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. క్రియా జీవక్రియ రేటును పెంచటంలో, జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అధిక బరువును సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చు. అలాగే అనులోమ, విలోమ ప్రాణాయామం కూడా ఈ వర్షాకాలంలో టెన్షన్, అలసటను రిలీజ్ చేసి మీ మనస్సును ప్రశాంతంగా, సంతోషంగా ఉంచుతుంది.

అధో ముఖ స్వనాసన

అధో ముఖ స్వనాసనాన్ని క్రిందికి చూస్తున్న కుక్క భంగిమ అని కూడా అంటారు. ఈ భంగిమ శరీరాన్ని శక్తివంతం చేయడంలో, పునరుజ్జీవింపజేయడంలో సహాయపడుతుంది. ఇది వెన్నెముకను పొడిగిస్తుంది, ఛాతీ కండరాలను బలపరుస్తుంది, తద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇంకా చేతులు, భుజాలు, కాళ్ళు , పాదాలకు బలాన్ని తెస్తుంది. మెదడుకు రక్త ప్రసరణను పెంచడంలో కూడా ఇది ఉపకరిస్తుంది.

సేతు బంధాసనం

ఈ ఆసనాన్ని వీపును వంచి వంతెన వంటి ఆకారాన్ని ఏర్పరచడం ద్వారా సాధన చేస్తారు. ఇది వెన్ను కండరాలును బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. తద్వారా వెన్నునొప్పిని నివారిస్తుంది. ఇంకా, మూత్రపిండాలకు శక్తినిస్తుంది, నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది, శరీరంలో రక్తపోటును నియంత్రిస్తుంది. ఈ భంగిమ మెడ, ఛాతీ, వెన్నెముకను విస్తరించి మీ ఊపిరితిత్తులను విస్తరిస్తుంది.

భుజంగాసనం

ఈ ఆసనాన్ని కోబ్రా భంగిమ అని కూడా అంటారు. ఇది ఉదర కొవ్వును కాల్చివేస్తుంది. తద్వార ఉదర కండరాలను టోన్ చేస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మొత్తం వీపును బలపరుస్తుంది, వెన్నెముక ఫ్లెక్సిబిలిటీని మెరుగుపరుస్తుంది. ఒత్తిడి, అలసట నుంచి ఉపశమనం అందించడంలో గొప్ప పాత్ర పోషిస్తుంది.

నౌకాసనం

దీనిని బోట్ పోజ్ అని కూడా అంటారు. నౌకాసనం ప్రధానంగా ఉదర కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా ఈ అసనం సాధన చేస్తే ముందుకొచ్చిన పొట్టను ప్రభావవంతంగా తగ్గిస్తుంది.అలాగే ఒత్తిడిని తగ్గిస్తుంది, మనస్సును చింత లేకుండా ఉంచుతుంది.

యోగా చేయటానికి బయటకు వెళ్లాల్సిన పనిలేదు, భారీగా చెమటోడ్చాల్సిన అవసరం అంతకంటే లేదు. మీ ఇంట్లో ఉండి సౌకర్యవంతంగా యోగా చేయవచ్చు. మిమ్మల్ని మీరు ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం